BRS Delhi Office: బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
14 December 2022, 13:36 IST
- BRS Party Latest News: ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్‌లో బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రారంభించారు. మధ్యాహ్నం 12:39 నిమిషాలకు టీఆర్ఎస్ జెండాను ఎగురవేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం
BRS Office in Delhi: ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ను ప్రారంభించారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. సర్దార్ పటేల్ రోడ్‌లో మధ్యాహ్నం 12:39 నిమిషాలకు బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు పలువురు రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఈ సందర్భంగా కేసీఆర్‌కు జాతీయ, రాష్ట్ర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
రాజశ్యామల యాగం..
తొలుత రాజశ్యామల, నవచండీయాగాలు నిర్వహించారు. ఈ యాగాల్లో కేసీఆర్, ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవితతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.
డిసెంబర్ 9న టీఆర్ఎస్ పార్టీ... భారత రాష్ట్ర సమితిగా మారింది. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి హాజరయ్యారు. ఇదే రోజు బీఆర్ఎస్ జెండా, నినాదాన్ని కూడా ప్రకటించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ భారత రాష్ట్ర సమితి నినాదం అని స్పష్టం చేశారు కేసీఆర్. ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే అని వ్యాఖ్యానించారు. ఇదేగాక త్వరలోనే బీఆర్ఎస్ జాతీయ కార్యవర్గం ఏర్పాటు. జాతీయ కార్యదర్శుల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మరోవైపు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్.. వారం రోజుల పాటు ఇక్కడే ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ జాతీయ విధానానికి సంబంధించి పలువురితో కేసీఆర్ మంతనాలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారితో చర్చించిన అనంతరం... పార్టీ జాతీయ విధానాన్ని ప్రకటిస్తారని సమాచారం. పలు రాజకీయ పార్టీ నేతలతో పాటు పలు రంగాలకు చెందిన వారితో చర్చలు ఉంటాయని తెలుస్తోంది.