Chicken Prices : దడ పుట్టిస్తున్న చికెన్ ధరలు.. తగ్గిపోయిన విక్రయాలు
26 February 2024, 13:52 IST
- Chicken Prices in Telangana: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.300పైనే ఉంది. స్కిన్ తో అయితే రూ.260 అమ్ముతున్నారు.
చికెన్ ధరలు
Chicken Prices in Telangana: చికెన్ ధర చుక్కల్లోకి ఎక్కి కూర్చుంది. వారంతో సంబంధం లేకుండా నోరూరినప్పుడల్లా చికెన్ షాపుకి పరుగులు తీసే మాంసాహార ప్రియులు ఇప్పుడు కాస్త వెనకడుగు వేయాల్సి వస్తోంది. జేబు తడిమి చూసుకుని ఒకింత ఆలోచించాల్సి వస్తోంది. ఓపక్క ఏపీలో బర్డ్ ఫ్లూ ప్రభావంతో కోళ్లు చనిపోతున్న పరిస్థితి నెలకొనగా తెలంగాణలో ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. గడిచిన కొద్ధి రోజులుగా కోడి ధర అంతకంతకూ కొండెక్కుతోంది. చికెన్ రేటు అమాంతం పెరగడంతో మాంసహార ప్రియులు గగ్గోలుపెడుతున్నారు. ఓ వైపు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, మరోవైపు కోళ్ల సరఫరా తగ్గడంతో ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకుంటున్నాయి. ఫలితంగా చికెన్ ధర తగ్గుముఖం పట్టే ప్రసక్తే లేకుండా పెరిగిపోతోంది. ఇక తప్పేదీలేదనుకున్న మాంసాహార ప్రియులు కొనుగోలు చేస్తుంటే కోడి ధరలు చూసి సామన్యుడు మాత్రం బెంబేలెత్తిపోతున్నాడు. చికెన్ తినే కోరికను వాయిదా వేసుకుంటున్నాడు. తాజాగా ఒక్క రోజులోనే చికెన్ ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకోవడం గమనార్హం.
ఉత్పత్తి తగ్గడంతో..
బుధ, గురు వారాల్లో రూ.150 నుంచి 200 ఉన్న కిలో లైవ్ కోడి.. ఆది, సోమ వారాల్లో అమాంతం పెరిగిపోయింది. కోళ్ల సరఫరా తగ్గడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. వినియోగ దారుల అవసరం మేరకు ఉత్పత్తి లేకపోవడంతో కోడి మాంసం ధరలు కొండెక్కాయి. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.300పైనే ఉంది. స్కిన్ తో అయితే రూ.260 అమ్ముతున్నారు. ఇక బోన్ లెస్ చికెన్ రికార్డు స్థాయిలో కిలోకు రూ.500 కు పైగా అమ్ముతున్నారు. ఈ ధరల్లో ప్రాంతాల వారీగా హెచ్చుతగ్గులు కనిపించడం సర్వసాధారణంగా మారింది. కొన్ని చోట్ల వ్యాపారులు సిండికేట్ గా మారి ఇష్టారీతిన ధరలను నిర్ణయించేస్తున్నారు. ఓవైపు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, మరోవైపు ఎండల తీవ్రత ఎక్కువైతే చికెన్ ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతు న్నారు. ఆదివారం వస్తే చాలు గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ముక్కలేకపోతే ముద్ద దిగదు. ఆదివారం సుమారు 12 లక్షల కిలోలు, మిగిలిన రోజుల్లో సుమారు 7 లక్షల వరకు చికెన్ విక్రయాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇదిలా ఉండగా తాజాగా ధరల పెరుగుదలతో విక్రయాలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ ధరలు అధికంగా ఉండటంతో మాంసం ప్రియులు చేపల వైపు మొగ్గు చూపుతున్నారు.