Meaty Rice: ప్రపంచంలో మొదటిసారిగా ‘మాంసాహార అన్నం’ ఉత్పత్తి, దీన్ని తింటే చికెన్ తిన్నట్టే ఉంటుంది
Meaty Rice: శాస్త్రవేత్తలూ ఏదో ఒక ఆవిష్కరణ చేస్తూనే ఉంటారు. అలాంటి ఆవిష్కరణలో ఒకటి ఈ మాంసాహార అన్నం. దీన్ని మీటీ రైస్ అని పిలుస్తారు.
Meaty Rice: ఆహార ప్రియులకు గుడ్ న్యూస్. చికెన్ రుచితో ఉండే బియ్యాన్ని ఉత్పత్తి చేశారు శాస్త్రవేత్తలు. మాంసం రుచి ఎలా ఉంటుందో... అలాంటి రుచిని ఇచ్చే అన్నాన్ని కనిపెట్టారు. దీనికి మీటీ రైస్ అని పేరు పెట్టారు. మనం తెలుగులో మాంసాహార అన్నం అని పిలుచుకోవచ్చు. దీన్ని దక్షిణ కొరియాలోని యోన్సే యూనివర్సిటీ కి చెందిన పరిశోధకులు తయారు చేశారు.
పరిశోధకులు ఈ బియ్యాన్ని ప్రయోగశాలలో తయారు చేశారు. వివిధ రకాల మాంసం, చేపల రుచినీ పరిగణనలోకి తీసుకొని ఈ బియ్యాన్ని సృష్టించారు. సాధారణ మాంసంతో పోలిస్తే ఈ బియ్యం ఎనిమిది శాతం ఎక్కువ ప్రోటీన్, ఏడు శాతం ఎక్కువ మంచి కొలెస్ట్రాల్‌ను కలిగి ఉంటుంది. అంతేకాదు ఈ బియ్యాన్ని వండాక 11 రోజులపాటు తాజాగానే ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్దనే ఉంచవచ్చు. కండరాలు అభివృద్ధికి కావలసిన పోషకాలను ఇది అందిస్తుంది.
ఎందుకు సృష్టించారు?
ఇలాంటి మాంసాహార అన్నాన్ని శాస్త్రవేత్తలు ఎందుకు సృష్టించారు? అనే సందేహం ఎక్కువ మందిలో ఉంటుంది. దీన్ని సైనికుల కోసం తయారు చేశారు. వారి అవసరాలను తీర్చేందుకు ఈ బియ్యాన్ని వినియోగిస్తారు. యుద్ధం లేదా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు వారికి పోషకాహార లోపం రాకుండా ఈ బియ్యాన్ని అందిస్తారు. ఈ బియ్యంతో వండిన అన్నం 11 రోజుల పాటు తాజాగా ఉంటుంది. కాబట్టి సైనికులకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి వారికి శక్తి కూడా నిరంతరం అందుతూనే ఉంటుంది.
పర్యావరణానికి కూడా ఈ మీటీ రైస్ ఎంతో మేలు చేస్తుంది. మాంసం ఉత్పత్తిలో కార్బన్ డయాక్సైడ్ విడుదల ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ హైబ్రిడ్ బియ్యం ఉత్పత్తిలో కార్బన్ డయాక్సైడ్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. జంతు పెంపకంతో పోలిస్తే ఈ బియ్యాన్ని పండించడమే సులువు. ఈ బియ్యాన్ని ప్రజలకు పరిచయం చేసేందుకు మరింత పరిశోధనలు అవసరం. భవిష్యత్తులో ఇది సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
టాపిక్