BRS Gurukula Bata : ఈనెల 30 నుంచి బీఆర్ఎస్ 'గురుకుల బాట'
28 November 2024, 18:01 IST
- రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమానికి సిద్ధమైంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ సర్కార్ సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం
బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం పట్టనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరాలను వెల్లడించారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 07 వరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు.
గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను పరిశీలించనున్నారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నేతలు ఇందులో పాల్గొంటారని కేటీఆర్ చెప్పారు.
రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరని… ముఖ్యమంత్రికి ఢిల్లీకి తిరిగేందుకే సమయం సరిపోతలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. విద్యార్థులు చనిపోతున్నా ఒక్క సమీక్ష కూడా నిర్వహించని ప్రభుత్వానికి ఉసురు తప్పదని కామెంట్స్ చేశారు. గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్ల పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ తరఫున అధ్యయన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో గురుకుల అధ్యయన కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా గురుకుల బాట కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కమిటీ నివేదికను పార్టీకి సమర్పిస్తుందని వివరించారు. ఈ నివేదికలోని అంశాలను శాసనసభ వేదికగా లేవనెత్తనున్నట్లు ప్రకటించారు.
సీఎం రేవంత్ కీలక ఆదేశాలు :
రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో తరచూ ఘటనలు చోటుచేసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందజేయాలని స్పష్టం చేశారు. ఫుడ్ పాయిజన్, ఇతర ఘటనలకు బాధ్యులైన వారిపై వేటు వేయాలని ఆదేశాలు జారీ చేశారు.
హాస్టళ్లలో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు జరగడంపై సీఎం సీరియస్ అయ్యారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాశీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. లేని వార్తలను ప్రచారం చేస్తూ.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని.. వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
టాపిక్