Bapatla District : సోదరుడి హత్య... తమ్ముడే సూత్రదారి..! మర్డర్ మిస్టరీ ఇలా వీడింది
14 July 2024, 11:03 IST
- Bapatla District Crime News : సొంత అన్నను తమ్ముడే హత్య చేయించాడు. పక్కా ప్లాన్ వేసి పని పూర్తి చేశాడు. ఈ ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది.
అన్నయ్య హత్యకు తమ్ముడే సూత్రదారి
Bapatla District Crime News : ఎన్‌టీఆర్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. సొంత అన్నయ్య హత్యకు తమ్ముడే సూత్రదారిగా వ్యవహరించాడు. మద్యానికి, గంజాయికి బానిస అయిన అన్నతో తల్లిదండ్రులకు థ్రెట్ ఉందని భావించిన తమ్ముడు అన్నను హతమార్చేందుకు ప్రణాళిక గీశాడు.
ఇంట్లో అన్న బెడద ఉండకుండా ఉండేందుకు అన్నను ఎలాగైనా హత్య చేయాలని పథకం రచించాడు. ఎవరికీ అనుమానం రాకుండ అన్నను హత్య చేశాడు. ఈ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సోదరుడే ప్రధాన నిందితుడని పోలీసులు ప్రకటించారు.
ఏం జరిగిందంటే…?
బాపట్ల జిల్లా చినగంజాం మండలం కడవకుదురుకు చెందిన కంపిరి సురేష్ బాబు విజయవాడలోని పోలీస్ శాఖలో ఎస్పీఎఫ్ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వీరు గత కొంత కాలంగా విజయవాడలోనే నివాసం ఉంటున్నారు. ఆయనకు అనిల్ నాయుడు, అఖిల్ నాయుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో పెద్ద కుమారుడు అనిల్ నాయుడు మద్యానికి, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస అయ్యాడు. దీంతో డ్రగ్స్, మద్యంల మత్తులో ఉండి ఇంట్లో నిరంతరం గొడవ పడేవాడు.
ఇంట్లో డబ్బుల కోసం వేధించేవాడు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరింపులకు దిగేవాడు. దీంతో అన్నపై తమ్ముడు అఖిల్ నాయుడి తీవ్రమైన కోపం పెంచుకున్నాడు. అన్నయ్య బతికి ఉంటే ఎప్పుడైనా తల్లిదండ్రులను చంపేస్తాడని… అన్న బెడదను తప్పించుకోవాలని తమ్ముడు భావించాడు. అన్న అనిల్ నాయుడు బెడదను తొలగించుకోవాలని పథకం రచించాడు. అయితే అన్న అనిల్ నాయుడు జులై 4 (గురువారం)న హైదరాబాద్‌కు వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న తమ్ముడు అఖిల్ నాయుడు హత్యకు ఇదే సరైన సమయమని భావించాడు.
ఎలాగైనా అన్నను హత్య చేయాల్సిందేనని ప్లాన్‌ను రూపొందించాడు. ఈ విషయాన్ని స్నేహితులకు తెలిపాడు. స్నేహితులతో కలిసి అన్నను అంతమొందించాలని అఖిల్ నాయుడు నిర్ణయించుకున్నాడు. అన్నతో వెళ్లి ఎవరూ లేని చోట హతమార్చాలని ప్లాన్ చేశాడు. ప్లాన్‌లో భాగంగానే అన్న వెనుకే కారులో స్నేహితులతో కలిసి వెళ్లాడు. వత్సవాయి మండలంలో కారు ఆపి అనిల్‌నాయుడుకు స్నేహితులతో కలిసి అఖిల్ నాయుడు మద్యం తాగించాడు.
కత్తులతో పొడిచి హత్య…..
కత్తులతో మెడ, పొట్టతో పాటు ఇతర భాగాల్లో తీవ్రంగా గాయపరిచి, హత్య చేశారు. అనంతరం కారులో అదే రోజు (గురువారం) రాత్రి ఎన్‌టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు వచ్చారు. అక్కడ వంతనపై నుంచి మృతదేహాన్ని కిందకు పడేశారు. మరుసటి రోజు (శుక్రవారం) జులై 5న సాయంత్రం స్థానికులు అక్కడ పడి ఉన్న మృత దేహాన్ని చూశారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, హత్య కేసు నమోదు చేశారు. జగ్గయ్యపేట సీఐ జానకీరామ్ నేతృత్వంలో పోలీసులు నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పెద్ద కుమారుడు అనిల్ నాయుడు హత్యపై తండ్రి సురేష్‌బాబు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అయితే తండ్రి సురేష్ బాబు కూడా హత్యకు దారి తీసిన విషయాలు చెప్పలేదు. అయితే మృతుడి ఫోన్ కాల్ లిస్టును పోలీసులు బయటకు తీశారు. అందులో సోదరుడి అఖిల్ నాయుడు ఫోన్ కాల్ చాలా సార్లు నమోదు అయింది. దీంతో అఖిల్ నాయుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టగా కొద్ది కొద్దిగా సమాచారం బయటకు వచ్చింది. శనివారం (జులై 13) పోలీసులు అన్న హత్య కేసులో తమ్ముడే సూత్రధారి అని తెలుసుకున్నారు.