Bathukamma Festival 2023 : నేటి నుంచే 'బతుకమ్మ' సంబురం
14 October 2023, 7:34 IST
- Bathukamma Festival 2023 : తెలంగాణ సాంప్రదాయానికి ఈ బతుకమ్మ పండగ ప్రతీక. ఈ పండగ వస్తే చాలు… పట్నం, పల్లె అనే తేడా లేకుండా… ఘనంగా జరుపుకుంటారు. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచే బతుకమ్మ పండగ సంబురం ప్రారంభం కానుంది.
బతుకమ్మ పండగ
Bathukamma Festival 2023 : తెలంగాణ రాష్ట్రంలోనే మహిళలకు అతిపెద్ద పండుగైన బతుకమ్మ సంబరాలు ఇవాళ్టి నుంచే ప్రారంభం కానున్నాయి. వీధివీధిన వాడవాడనా బతుకమ్మ ఆటలు ఆడడానికి బాలికల నుంచి వృద్ద మహిళల వరకు సిద్దమవుతున్నారు. తొమ్మిదిరోజుల పాటు ఎంతో ఘనంగా కొనసాగే బతుకమ్మ వేడుకలతో ప్రతివీధి శోభాయమానంగా మారబోతుంది.
పాటల ప్రాశస్త్యం…
రామరామ ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, అంటు ఉయ్యాల పాటలు, జానపదంలో నుంచి వచ్చే తెలంగాణ పాటలతో రాష్ట్రం మార్మోగనుంది. నేటి నుంచి....తొమ్మిది రోజుల పాటు మహిళలు ఎంతో ఘనంగా నిర్వహించే ఈ పండుగకు ఎంతో విశిష్టత కూడా ఉంది. అడవిపూలైన గుమ్మడి,తంగేడు,బంతి,గునుగు,తామరలాంటి పూలతో అందంగా అలంకరించి అనంతరం వాడవాడనా మహిళలంతా ఒకేచోట చేరుకుని సాయంత్ర సమయాల్లో అమ్మవారి పాటలు జానపద నృత్యాలు,కోలాటాలు ఇలారకరకాలుగా తొమ్మిదిరోజులపాటు అమ్మవారిని కొలుస్తారు. తొమ్మిదో రోజున పెద్ద బతుకమ్మలను పేర్చి మహిళలంతా వాయనాలు ఇచ్చుకుని గ్రామచెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.
చెరువులో పూలు వేస్తే ......
వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన పూల బతుకమ్మలను గ్రామంలోని చెరువులో నిమజ్జనం చేయడం అనవాయితీ. అయితే అనాదిగా వస్తున్న ఈ ఆచారం వెనుక శాస్త్రపరిజ్ఞానం కూడా ఉందని పెద్దలంటున్నారు. వర్షాకాలంలో వచ్చి చేరిన నీటిలో....ప్రజలకు హనిచేసే అతిసూక్ష్మక్రిములుంటాయని చెరువులో వేసే బ్రతుకమ్మపూలతో క్రిములు నశింపచేస్తాయని దీంతో చెరువునీటిని వాడినవారికి… కలరా,మలేరియా లాంటి వ్యాధులు సోకకుండా ఉంటాయని చెబుతున్నారు. అలాగే శరద్ఋతువులో ప్రారంభమయ్యే శరన్నవరాత్రుల్లో గౌరమ్మ రూపంలో అమ్మవారిని కొలుస్తుంటారు. అయితే పూలన్నీ శ్రీచక్ర స్వరూపంలో పేర్చి అందులో మధ్యన పసుపుతో తయారు చేసిన గౌరమ్మలను ఉంచి అమ్మవారి పాటలతో ప్రదక్షణా పూర్వకంగా తిరగడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. భాధ్రపద అమావాస్య మొదలుకుని ఎనిమిదిరోజుల పాటు చిన్నబ్రతుకమ్మలను పేర్చిన మహిళలు… తొమ్మిదవరోజున పెద్దబ్రతుకమ్మలను తయారు చేసి పూజించిన అనంతరం డప్పుచప్పుళ్ల మధ్య గ్రామంలోని నిర్దేశిత ప్రాంతానికి వెళ్తారు. మహిళలందరు ఒకేదగ్గర చేరుకుని కొత్తబట్టలు,సత్తుపిండ్లు ఇలా అన్ని సమకూర్చుకున్నతర్వాత వాయనాలు ఇవ్వడంతో బ్రతుకమ్మ పండుగ పూర్తవుతుంది. తొమ్మిదిరోజుల పాటు మహిళలు చేసుకునే అతిపెద్ద పండుగకూడా బ్రతుకమ్మ అనే చెప్పవచ్చు.
సత్తు పిండి ప్రత్యేకత
నవధాన్యాలతో తయారు చేసిన సత్తుపిండ్లను ఇంటిల్లిపాది ఎంతో భక్తి శ్రద్దలతో అమ్మవారికి నైవేద్యాలు చేసిన అనంతరం సువాసినీలకు వాయనాలు ఇచ్చి అనంతరం కుటుంబసభ్యులంతా కలిసి సత్తుపిండి సేవించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే నవధాన్యాలతో చేసిన సత్తుపిండిని తినడం వల్ల వర్షాకాలం,చలికాలాలకు సంధిగా ఉన్న సమయంలో వ్యాధినిరోదక శక్తి పెరగడంతో పాటు,చర్మవ్యాధులు రాకుండా ఉంటాయని పెద్దలు చెబుతున్నారు. అందుకే ప్రతి సంవత్సరం పూలను నీటిలో నిమజ్జనం చేయడంతో పాటు సత్తుపిండి సేవనం ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని వారంటున్నారు. వివిధ రాష్ట్రాలలో, దేశాలలో ఉన్న తెలంగాణ వారు కూడా బ్రతుకమ్మ పండుగకు సొంత గ్రామాలకు చేరుకునేందుకు ఉత్సాహపడతారు. కాకతీయుల కాలం నుంచే బ్రతుకమ్మ పండుగను సాంప్రదాయంగా జరిపారని చరిత్రకారులు చెబుతున్నారు.
బతుకమ్మ కథ
ఒక ఊరిలో కరువు కాటకాలు సంభవించి ఆ గ్రామప్రజలంతా కరువుతో అల్లాడుతున్న సమయంలో గ్రామస్తులకు తంగేడు పూల చెట్ల పొదల్లో ఒక పాప కనిపించిందని,దీంతో ఆ గ్రామస్తులందరు కలిసి ఆ పాపను చేరదీశారట. అప్పటి నుంచి ఆ గ్రామంలో పంటలు సమృద్దిగా పండి ప్రతి ఇంటా సిరిసంపదలు కురిసాయని....ఆ గ్రామస్తుల బతుకులు బాగు పడడంతో ఆ పాపకు బతుకమ్మ పేరు పెట్టారని అప్పటినుంచే బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నట్టు చరిత్ర చెబుతోంది. పంట చేతికి వచ్చి చేతిలో డబ్బులు వచ్చే సమయంలో గ్రామస్తులందరు చిన్నాపెద్ద అనే తేడా లేకుండా కలిసి ఉండడమే బతుకమ్మ పండుగలోని పరమార్థం. తెలుగు వారికి ధీటుగా మార్వాడీ,గుజరాతీలు కూడా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని దాండియా ఆడడం ప్రత్యేకమని చెప్పవచ్చు.