తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bathukamma Songs Telugu : తరతరాలుగా పాడుతున్న ఈ బతుకమ్మ పాటలు విన్నారా?

Bathukamma Songs Telugu : తరతరాలుగా పాడుతున్న ఈ బతుకమ్మ పాటలు విన్నారా?

Anand Sai HT Telugu

08 October 2023, 12:14 IST

google News
    • Bathukamma Songs In Telugu : తెలంగాణలో బతుకమ్మ అంటే జీవన విధానం. ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకొనే గొప్ప పండగ. వందల ఏళ్ల నుంచి వస్తున్న పాటలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అందులో కొన్నింటిని HT Telugu మీ కోసం సేకరించింది.
బతుకమ్మ పాటలు
బతుకమ్మ పాటలు

బతుకమ్మ పాటలు

బతుకమ్మ అనగానే.. రంగు రంగుల పూలు మాత్రమే కాదు.. తెలంగాణ సంస్కృతి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే గొప్ప విధానం మనది. అలాంటి బతుకమ్మ పండుగ రోజున ఆడబిడ్డలు పాడే పాటలు వింటుంటే.. మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. తరతరాలుగా వస్తున్న కొన్ని పాటలు ఇంకా పాడుతూనే ఉండటం గొప్ప విషయం. బతుకమ్మ పేరుస్తూ.. కొన్ని పాటలు ఉన్నాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ఇప్పటి వరకూ వచ్చాయి. అలాంటి బతుకమ్మ పాటలు మీకోసం..

మెుదటి పాట

తొమ్మిది రోజులు ఉయ్యాలో..

నమ్మికా తోడుత ఉయ్యాలో..

అలరి గుమ్మడి పూలు ఉయ్యాలో..

అరుగులు వేయించిరి ఉయ్యాలో..

గోరంట పూలతో ఉయ్యాలో..

గోడలు కట్టించి ఉయ్యాలో..

తామరపూలతో ఉయ్యాలో..

ద్వారాలు వేయించిరి ఉయ్యాలో..

మెుగిలి పూలతోని ఉయ్యాలో..

మెుగరాలు వేయించిరి ఉయ్యాలో..

వాయిలీ పూలతో ఉయ్యాలో..

వాసాలు వేయించిరి ఉయ్యాలో..

పొన్నపూలతోటి ఉయ్యాలో.. ఇల్లును కప్పించిరి ఉయ్యాలో..

దోసపూలతోని ఉయ్యాలో..

తోరణాలు కట్టించిరి ఉయ్యాలో..

పసుపు ముద్దను చేసి ఉయ్యాలో..

గౌరమ్మను నిలిపి ఉయ్యాలో..

చామంతి పూలతో ఉయ్యాలో..

చెలియను పూజించిరి ఉయ్యాలో..

సుందరాంగులెల్ల ఉయ్యాలో..

సుట్టూత తిరిగిరి ఉయ్యాలో..

ఆటలు ఆడిరి ఉయ్యాలో..

పాటలు పాడిన్రు ఉయ్యాలో..

గౌరమ్మ వరమిచ్చెను ఉయ్యాలో..

కాంతలందరికీ ఉయ్యాలో..

పాడిన వారికి ఉయ్యాలో..

పాడి పంటలు కలుగును ఉయ్యాలో..

ఆడిన వారికి ఉయ్యాలో..

ఆరోగ్యము కలుగును ఉయ్యాలో..

విన్న వారికి ఉయ్యాలో..

విష్ణుపదము కలుగు ఉయ్యాలో..

రెండో పాట

బతుకమ్మ పండుగ ఉయ్యాలో..

అప్పుడే వచ్చెను ఉయ్యాలో..

బంగారు నగలు ఉయ్యాలో..

బంగారు గాజులు ఉయ్యాలో..

గుమ్మడి పూలు ఉయ్యాలో..

గునుగూ పూలు ఉయ్యాలో..

వరుస వరుసలతోటి ఉయ్యాలో..

వరుసగా పేర్చి ఉయ్యాలో..

అప్పుడే వచ్చిరి ఉయ్యాలో..

ఆడబిడ్డలు ఉయ్యాలో..

ఆటలు ఆడేను ఉయ్యాలో..

పాటలు పాడేను ఉయ్యాలో..

పసుపు కుంకుమలు ఉయ్యాలో..

సత్తు సద్దులు ఉయ్యాలో..

గౌరీ శంకరులు ఉయ్యాలో..

గంగ శివులతోటి ఉయ్యాలో..

మెప్పులు పొందంగ ఉయ్యాలో..

ఆటలు ఆడంగ ఉయ్యాలో..

బతుకమ్మ పాటలు ఉయ్యాలో..

కలకాలం పాడెదం ఉయ్యాలో..

బతుకమ్మ ఆటలు ఉయ్యాలో..

కలకాలం ఆడెదం ఉయ్యాలో..

మూడో పాట

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ..

ఏమేమి కాయోప్పునే గౌరమ్మ..

గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మ..

గుమ్మాడి కాయోప్పునే గౌరమ్మ..

గుమ్మాడి చెట్టుకింద గౌరమ్మ..

ఆట సిలకాలార గౌరమ్మ.

పాట సిలకాలార గౌరమ్మ..

బమ్మశ్రీ మాడలూ గౌరమ్మ..

కందుమ్మ గడ్డలు గౌరమ్మ..

ఎనుగుల కట్టెలు గౌరమ్మ..

తారు గోరంటలు గౌరమ్మ..

తీరుద్దారాక్షలు గౌరమ్మ..

పోను తంగేడుపూలు గౌరమ్మ..

రాను తంగేడుపూలు గౌరమ్మ..

ఘనమైన పొన్నపూలే గౌరమ్మ..

గజ్జలా ఒడ్డాణమే గౌరమ్మ..

తంగేడు చెట్టు కింద గౌరమ్మ.. ఆట సిలకాలార గౌరమ్మ..

పాట సిలకాలార గౌరమ్మ..

బమ్మశ్రీ మాడలూ గౌరమ్మ..

కందుమ్మ గడ్డలు గౌరమ్మ..

ఎనుగుల కట్టెలు గౌరమ్మ..

తారు గోరంటలు గౌరమ్మ..

తీరుద్దారాక్షలు గౌరమ్మ..

పోను తంగేడుపూలు గౌరమ్మ..

రాను తంగేడుపూలు గౌరమ్మ..

ఘనమైన పొన్నపూలే గౌరమ్మ..

గజ్జలా ఒడ్డాణమే గౌరమ్మ..

కాకర చెట్టు కింద.. గౌరమ్మ.. ఆట సిలకాలార గౌరమ్మ..

పాట సిలకాలార గౌరమ్మ..

బమ్మశ్రీ మాడలూ గౌరమ్మ..

కందుమ్మ గడ్డలు గౌరమ్మ..

ఎనుగుల కట్టెలు గౌరమ్మ..

తారు గోరంటలు గౌరమ్మ..

తీరుద్దారాక్షలు గౌరమ్మ..

పోను తంగేడుపూలు గౌరమ్మ..

రాను తంగేడుపూలు గౌరమ్మ..

ఘనమైన పొన్నపూలే గౌరమ్మ..

గజ్జలా ఒడ్డాణమే గౌరమ్మ..

రుద్రాక్ష చెట్టు కింద గౌరమ్మ.. ఆట సిలకాలార గౌరమ్మ..

పాట సిలకాలార గౌరమ్మ..

బమ్మశ్రీ మాడలూ గౌరమ్మ..

కందుమ్మ గడ్డలు గౌరమ్మ..

ఎనుగుల కట్టెలు గౌరమ్మ..

తారు గోరంటలు గౌరమ్మ..

తీరుద్దారాక్షలు గౌరమ్మ..

పోను తంగేడుపూలు గౌరమ్మ..

రాను తంగేడుపూలు గౌరమ్మ..

ఘనమైన పొన్నపూలే గౌరమ్మ..

గజ్జలా ఒడ్డాణమే గౌరమ్మ..

ఆ పూలు తెప్పించి..

పొందుగా పెరిచి..

గంధములు పూయించి..

పసుపు కుంకుమలు పెట్టి..

నీ నోము నీకిత్తునే గౌరమ్మ..

నా నోము నాకియ్యవ్వే గౌరమ్మ..

సేకరణ : HT Telugu

తదుపరి వ్యాసం