Alai Balai 2024 : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్.. ఈసారి స్పెషల్ ఇదే!
13 October 2024, 10:29 IST
- Alai Balai 2024 : హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇవాళ అలయ్ బలయ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. బండారు దత్తాత్రేయ కుమార్తె ఆధ్వర్యంలో అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంప్రదాయ వంటలతో భోజనాలు సిద్ధం చేశారు.
హైదరాబాద్‌లో అలయ్ బలయ్
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆదివారం సాయంత్రం అలయ్ బలయ్ జరగనుంది. ప్రతి ఏటా దసరా సందర్భంగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారు. బండారు దత్తాత్రేయ కుమార్తె ఆధ్వర్యంలో ఈసారి అలయ్ బలయ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. తెలంగాణ సంప్రదాయ వంటలతో భోజనాలను సిద్ధం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పర్వ దినాల సందర్భంగా బంధుమిత్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసే కార్యక్రమమే.. అలయ్ బలయ్. ముఖ్యంగా దసరా సందర్భంగా దీన్ని నిర్వహిస్తారు. పండుగ రోజు సాధారణంగా అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి.. తర్వాత రోజు బంధుమిత్రులను కలుసుకున్న సందర్భంగా పరస్పర ఆత్మీయాభిమానాలు చాటుకుంటూ కౌగిలించుకొని అలయ్ బలయ్ చెప్పుకుంటారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వానికి అద్దం పట్టేలా ఈ కార్యక్రమం జరుగుతుంది.
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక పేరుతో 29.9.2009 న బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్‌ను ప్రారంభించారు. అప్పడు ఈ కార్యక్రమానికి గవర్నర్ ఎన్టీ తివారీ వచ్చారు. అలయ్ బలయ్‌లో ఏర్పాటు చేసిన వివిధ కళారూపాలను చూసి ముగ్ధుడైన అప్పటి గవర్నర్ ఎన్‌డీ తివారీ.. పాటలు పాడారు. ప్రజాకవి గోరటి వెంకన్న తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని వివరిస్తూ పాటలు పాడారు. లయబద్ధంగా చిందేస్తూ అందర్నీ ఉర్రూతలూగించారు.
అలయ్ బలయ్‌లో తెలంగాణ జానపద కళారూపాలు ఒగ్గుకథలు, గోండు నృత్యం, పీర్లు, గొర్ల కాపరులు, పోతరాజులు, సాధ్యశూరులు, బోనాలు, బంతిపూల బతుకమ్మలు, గంగిరెద్దులు, సీతమ్మ జడకొప్పులు వంటి వాటితోపాటు.. కోలాటాలు, భజనకీర్తనలు, సన్నాయి బాజాలు, జమిడిక మోతలు, ఘటాలు, వంటివి ఆకట్టుకుంటాయి. తెలంగాణ వంటలు.. సద్ద అప్పలు, జొన్నరొట్టెలు, మక్కగారెలు, మాలీదా, యాట వేపుడు, నాటు కోడి పులుసు, పొట్టు రొయ్యలు, గుడాలు, బుడాలు, అటుకుల చుడువా వడ్దిస్తారు.