Telangana Caste Census : తెలంగాణలో సమగ్ర కుల గణన - 60 రోజుల్లో సర్వే పూర్తి, ఉత్తర్వులు జారీ
Caste Census in Telangana : కుల గణనపై తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యతను ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించింది. 60 రోజుల గడువుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కులాల వారీగా సమగ్ర సర్వే నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కుల గణనపై తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కులాలవారీగా సమగ్ర సర్వే నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. కుల గణన బాధ్యతలను ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించింది. ఇందుకోసం 60 రోజుల గడువును విధించింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలపై సమగ్ర సర్వే నిర్వహించనుంది.
కొంత కాలంగా తెలంగాణ వ్యాప్తంగా కుల గణన అంశంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ప్రభుత్వం కూడా సానుకూలంగా ప్రకటనలు చేస్తూ వచ్చింది. తొలుత బీసీ కుల గణనపై నిర్ణయం కూడా తీసుకుంది. అసెంబ్లీ వేదికగా తీర్మానం కూడా చేసింది. ఈ గణన తర్వాతే… స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రంలోని బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. దీంతో బీసీ కుల గణన ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు కొద్దిరోజుల కింద ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో అమలు చేస్తామని ప్రకటించింది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన ప్రకటన చేశారు.
ఎస్సీ వర్గీకరణ అమలుపై ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈక్రమంలోనే హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను కమిషన్ చీఫ్‌గా నియమించారు. ఉపకులాల వారీగా ఎస్సీల వెనకబాటుతనాన్ని ఈ కమిషన్ అధ్యయనం చేయనుంది. 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీంతో ఈ కమిషన్ నివేదిక కూడా కీలకంగా మారనుంది.
బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి కీలక అంశాలు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే… ప్రభుత్వం సమగ్ర కుల గణనకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇందులో భాగంగా….బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కులాల వారీగా సమగ్ర సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.