Ashadam Bonalu: ఆషాడం బోనాలు ప్రారంభం.. పట్టు వస్త్రాలు సమర్పించిన తెలంగాణ మంత్రులు-inauguration of ashadam bonals telangana ministers presented silk cloths ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ashadam Bonalu: ఆషాడం బోనాలు ప్రారంభం.. పట్టు వస్త్రాలు సమర్పించిన తెలంగాణ మంత్రులు

Ashadam Bonalu: ఆషాడం బోనాలు ప్రారంభం.. పట్టు వస్త్రాలు సమర్పించిన తెలంగాణ మంత్రులు

HT Telugu Desk HT Telugu
Jun 22, 2023 01:49 PM IST

Ashadam Bonalu: తెలంగాణలో ఆషాడం బోనాలు మొదలయ్యాయి. గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఆషాడ బోనాల ఉత్సవాలను మంత్రులు ప్రారంభించారు.

ఆషాడ బోనాలు ప్రారంభించిన తెలంగాణ మంత్రులు
ఆషాడ బోనాలు ప్రారంభించిన తెలంగాణ మంత్రులు

Ashadam Bonalu: తెలంగాణలో ఆషాడ మాసం బోనాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ‌లోని శ్రీ జగ‌దాంబిక ఆల‌యంలో తెలంగాణ ఆషాడ బోనాల ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, త‌ల‌సాని, మ‌హ‌మూద్ అలీ పట్టు వస్త్రాలు సమర్పించారు.

లంగర్‌హౌస్‌ నుంచి చేపట్టిన అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌, మ‌హ‌మూద్ అలీ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

లంగ‌ర్ హౌస్ నుంచి ర‌థం, తొట్టెల ఊరేగింపు ప్రారంభ‌మై గోల్కొండ కోట‌లోని జ‌గ‌దాంబ ఆల‌యం వ‌ర‌కు ఊరేగింపు కొన‌సాగింది. ఉత్స‌వ విగ్ర‌హాల‌కు ఆల‌య క‌మిటీ స‌భ్యులు, ప్ర‌ధానార్చ‌కుల ఇంట్లో ఘ‌నంగా పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణలో ప్ర‌ముఖ పండుగ‌ల‌లో ఒకటైన బోనాల పండుగ‌ను తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్ర పండుగ‌గా ప్ర‌క‌టించిందన్నారు. బోనాల ఉత్స‌వాల‌కు ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసింద‌ని చెప్పారు 2014 నుంచి 2022 వ‌ర‌కు బోనాల నిర్వ‌హ‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.78.15 కోట్లు కేటాయించిందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల‌ను ప్ర‌తి సంవ‌త్స‌రం 3,033 ఆల‌యాల‌కు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. బోనాల పండుగ‌కు ముందు తొల‌క‌రి ప‌ల‌క‌రింపు శుభ‌సూచ‌కంగా భావిస్తున్నామ‌న్నారు. అమ్మ‌వారి ఆశీస్సులు రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై ఉండాల‌ని, తెలంగాణ రాష్ట్రం శుభిక్షంగా ఉండాల‌ని అకాంక్షించారు. ఆషాడబోనాల సందర్భంగా అమ్మవారికి మొక్కులు సమర్పించుకోడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.

Whats_app_banner