Agriculture Technology : అన్నదాతకు అండగా టెక్నాలజీ, శబ్దాలతో అడవి జంతువులు పరార్!
02 March 2024, 16:47 IST
- Agriculture Technology : పక్షులు, అటవి జంతువుల నుంచి పంటలకు రక్షించేందుకు రైతులకు టెక్నాలజీ సాయం అందిస్తుంది. రైతులకు సాయంగా పంటలను రక్షించేందుకు జయసంకర్ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నూతన పరికరం రూపొందించారు.
అన్నదాతకు అండగా టెక్నాలజీ
Agriculture Technology : ఒకప్పుడు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అడవి పందులు, పక్షుల నుంచి కాపాడుకోవడం రైతులకు కష్టంగా ఉండేది. ఎన్నో వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని పంటలకు రక్షణ చేసేవారు రైతులు. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ ప్రకారం పంటలను రక్షించుకునేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారతీయ సకశేరుక(Vertebrate) విభాగం ఓ కొత్త పరికరం రూపొందించింది. సులువుగా పొలాల్లోకి తీసుకెళ్లడంతో పాటు పంట పొలాల్లోని ఓ చిన్న చెట్టు కొమ్మ ఉంటే చాలు దానికి వేలాడ దీసుకునేలా తయారు చేశారు. ఈ పరికరం పేరు 'ఈ కెనాన్'. సోలార్ సిస్టం (Solar System)ద్వారా ఈ కెనాన్ పని చేస్తుంది. ఈ పరికరంలో వివిధ రకాల శబ్దాలను పొందుపరిచారు. అందులో పులులు, సింహాల గాండ్రింపులు, గన్ శబ్దం, మనుషులు, పక్షుల అరుపులతో పాటు 20 రకాల శబ్దాలతో కూడిన ఒక చిప్ ను తయారు చేసి ఇందులో ఉంచారు.
ఆటోమేటిక్ ఛార్జ్
ఎండలో సుమారు రెండు గంటలు ఉంటే చాలు ఆటోమేటిక్ ఛార్జ్ అవుతుంది. 12 గంటల పాటు నిరంతరం వివిధ రకాల శబ్దాలు వస్తూనే ఉంటాయి. ఉదయం పక్షులను రాకుండా చూడటంతో పాటు, రాత్రి సమయాల్లో అడవి పందుల దాడులు చేయకుండా బెదరగొట్టడానికి ఈ యంత్రం ఉపయోగపడుతోంది. 110 డెసిబుల్స్ శబ్ధం వినిపిస్తుంది. రైతులకు(Farmers) అందుబాటులోకి ఉండేలా అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో రూ. 18 వేలతో ఇవి దొరుకుతున్నాయి. ఆదిలాబాద్ రైతులకు కావాలంటే కృషి విజ్ఞాన కేంద్రానికి వచ్చి తెలియజేస్తే, ఎన్ని కావాలో తెప్పిస్తామని శాస్త్రవేత్త కె.రాజశేఖర్ చెబుతున్నారు.
సొంత ఆలోచనతో పంట రక్షణ
ఆదిలాబాద్ జిల్లా జైనథ మండలం నిరాల గ్రామానికి చెందిన బొల్లు రాజుకుమార్ తన పొలంలో సోలార్ సీసీ కెమెరాను(CC Cameras) అమర్చుకున్నారు. గతంలో రాత్రి వేళల్లో పంటలపై గుంపులుగా అడవి పందులు దాడిచేసేవి. పొలాల్లోకి దొంగలు వచ్చి మోటార్లు, వ్యవసాయ పరికరాలు చోరీ చేసేవారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు పంట పొలంలో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ఒక సిమ్ కార్డుతో నెట్వర్క్ ద్వారా కెమెరా ఫోను కనెక్ట్ చేశారు. తన ఫోన్ ద్వారా 360 డిగ్రీల కోణంలో కెమెరాను ఏవైపునకు కావాలంటే ఆ వైపునకు తిప్పుతూ దిక్కులను చూసేలా ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకంగా ఈ కెమెరా ముందుకు మనుషులు, జంతువులు, పక్షులు సైతం వస్తే అలర్ట్ చేస్తుంది. కూలీలను అప్రమత్తం చేసేలా సైరన్ శబ్ధం మోగించే సదుపాయం ఉంది. రాత్రి, పగలు పంట పొలంలో ఉండాల్సిన పనిలేదు. కూలీల పనితీరును పర్యవేక్షించవచ్చు. కూలీలతో నేరుగా మాట్లాడే సదుపాయం ఉంది. పంట పొలంలో ఎలాంటి సంఘటనలు జరిగినా ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ కెమెరా ఉంటుంది. ప్రధానంగా విద్యుత్తు అవసరం లేకుండానే సౌరశక్తితో ఈ సీసీ కెమెరా పని చేస్తుంది.