Farmers Protest : వేరుశనగ గిట్టుబాటు ధర కోసం రైతన్నలు ఆందోళన, మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పై దాడి!
13 February 2024, 15:27 IST
- Farmers Protest : గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తు్న్న రైతుల కోపం కట్టలు తెంచుకుంది. వ్యాపారుల మోసాలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. అచ్చంపేట మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పై రైతులు దాడికి పాల్పడ్డారు.
మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పై దాడి
Farmers Protest : గిట్టుబాటు ధర కోసం వేరుశనగ రైతులు(Farmers Protest) రోడ్డెక్కారు. అప్పు చేసి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే అధికారులు, దళారులు కుమ్మక్కై గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారని ఆగ్రహించారు. దీంతో మార్కెట్ యార్డుల(Market Yard) వద్ద నిరసన చేస్తున్నారు. గత ఆదివారం నాగర్ కర్నూలు జిల్లాలో వేరు శనగ రైతులు ఆందోళన చేశారు. అచ్చంపేట మార్కెట్ యార్డుకు పెద్ద సంఖ్యలో వేరు శనగ రైతులు చేరుకుని నిరసన తెలిపారు. ఈ నిరసనలో ఉద్రిక్తత దారితీసింది. మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పై రైతులు దాడికి దిగారు. మార్కెట్ కమిటీ ఆఫీసులో ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళన
వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా అధికారులు, వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దళారుల మోసాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళనకు దిగారు. దీంతో అచ్చంపేట(Achampet)లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మార్కెట్ కు ఆదివారం పెద్ద సంఖ్యలో రైతులు సుమారు 32,875 బస్తాల వేరుశనగ పంటను తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు వ్యాపారులు కొనుగోళ్లు ప్రారంభించగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.7060, కనిష్ఠంగా రూ.4816 ధరను నిర్ణయించారు. వ్యాపారులు నాణ్యత పేరుతో తక్కువ ధర ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కె్ట్ నిబంధనల ప్రకారం 100 గ్రాముల వేరుశనగలు ఒలిచి గింజల బరువును తూచి దాని బట్టి ధర నిర్ణయించాల్సి ఉంటుంది. అందుకు భిన్నం వ్యాపారులు చేతిలోకి కాయలు తీసుకుని నాణ్యత లేదంటూ ధరను నిర్ధారిస్తూ మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పై దాడి
దీంతో వ్యాపారుల మోసాలపై ఫిర్యాదు చేసేందుకు రైతులు పెద్ద సంఖ్యలో మార్కెట్ కమిటీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ అధికారులు, వ్యాపారులను జరుగుతున్న మోసాలపై నిలదీశారు. అయితే వ్యాపారులు దుకాణాలకు తాళాలు వేసి మార్కెట్ నుంచి వెళ్లిపోయారు. గిట్టుబాటు ధర కల్పించాలని నాలుగు రోజులుగా నిరసన చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ అరుణ కార్యాలయం చేరుకున్న ఆమెపై దాడికి పాల్పడ్డారు. మహిళలు ఛైర్ పర్సన్(Chairperson Attacked) చీర పట్టుకుని లాగుతూ మార్కెట్ ఆవరణలోని వేరుశనగ కుప్పల వద్దకు లాక్కెళ్లారు. అక్కడ ఆమెపై వేరుశనగలు పోస్తూ నిరసన తెలిపారు. అనంతరం మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ అరుణను అంబేడ్కర్ కూడలికి తీసుకొచ్చి అక్కడ సుమారు 2 గంటలపాటు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని నిబంధనల మేరకు నాణ్యతను పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని రైతులకు నచ్చజెప్పారు. దీంతో రైతుల శాంతించారు. తనపై రైతులు(Farmers) దాడి చేశారని అరుణ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పై దాడి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రైతన్న ఆగ్రహం వస్తే అంతే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మహిళ అని కూాడా దాడి చేయడం సరికాదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.