Formula E Race Case : ఇటు ఏసీబీ.... అటు ఈడీ..! ఫార్ములా ఈరేస్ కేసులో ఏం జరగబోతుంది..?
21 December 2024, 8:44 IST
- ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయగా.. మరోవైపు ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్ పేరు ఉంది. ఓవైపు ఏసీబీ విచారణకు సిద్ధమవుతుండగా.. మరోవైపు ఈడీ కూడా నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది.
కేటీఆర్ పై ఏసీబీ, ఈడీ కేసు
ఫార్ములా ఈరేస్ కేసు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేయగా.. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏ1గా ఉన్నారు. మరో ఇద్దరు అధికారుల పేర్లు కూడా నమోదు చేశారు.
కేటీఆర్ పై 13(1)(ఏ) రెడ్‌విత్, 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 409 రెడ్‌విత్, 120(బి) ఐపీసీ సెక్షన్ల తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. రూ. 55 కోట్లను విదేశీ కంపెనీకి(ఫార్ములా ఈరేస్) చెల్లించటంలో అక్రమాలు జరిగాయని ఇందులో ప్రస్తావించింది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి పేర్లను నమోదు చేసింది.
ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందిన వెంటనే కేసు నమోదు చేసేసింది ఏసీబీ. ప్రాథమిక విషయాల ఆధారంగా లోతుగా విచారించేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగానే… ఈడీ ఎంట్రీ ఇచ్చేసింది. డిసెంబర్ 20వ తేదీన ఉదయమే ఏసీబీని సంప్రదించింది. ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన వివరాలపై ఆరా తీసింది.
ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని ఈడీ తీసుకుంది.దీని ఆధారంగానే ECIR (Enforcement Case Information Report) ను నమోదు చేసింది. A1గా కేటీఆర్ పేరును పేర్కొంది. ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది.
ఏం జరగబోతుంది..?
ఫార్ములా ఈరేస్ కేసులో ఇటు ఏసీబీ, అటు ఈడీ కేసులు నమోదు చేయటంతో నెక్స్ట్ ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ శిబిరంలో హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ… కేసులో ఉన్నవారికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉండటంతో పాటు స్వయంగా వారిని విచారించించనుంది. కేసుకు సంబంధించిన మరికొన్ని వివరాలపై ఆరా తీసే అవకాశం ఉంటుంది. బలమైన ఆధారాలుంటే… సంచలన పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
విదేశీ సంస్థకు హెచ్‌ఎండీఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా రూ.55 కోట్లు చెల్లించడంపై ఏసీబీ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇందులో కేటీఆర్ పాత్రతో పాటు అధికారులు పాత్రపై లోతుగా విచారించనుంది. పూర్తిస్థాయి విచారణతో అసలు విషయాలు బయటకు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఈడీ ఎంట్రీతో మారిన సీన్…!
ఈ కేసులోకి ఈడీ ఎంట్రీతో సీన్ మారే అవకాశం ఉంది. ప్రధానంగా… హెచ్‌ఎండీఏ బ్యాంకు ఖాతా నుంచిఎఫ్‌ఈవో సంస్థ ఖాతాకు జరిగిన నగదు బదిలీ లావాదేవీలపై ఫోకస్ పెట్టనుంది. ఇదే విషయంపై లోతుగా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఫెమా, పీఎంఎల్‌ఏ చట్టాల ఉల్లంఘనలపై విచారించనుంది. ఆర్బీఐ అనుమతులు లేకుండా నిధులు బదిలీతో పాటు పన్ను మినహాయింపు వంటి అంశాలపై కూపీ లాగే అవకాశం ఉంది.
ఈడీ కేసు నమోదు నేపథ్యంలో కేసులో ఉన్న కేటీఆర్ తో పాటు మరో ఇద్దరు అధికారులకు కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. వీరందర్నీ విచారించి… మరికొన్ని విషయాలపై స్పష్టత తీసుకోవచ్చని తెలుస్తోంది. కేవలం విచారణ వరకు విషయం ఆగుతుందా..? లేక మరేమైనా పరిణామాలు చోటు చేసుకుంటాయా అనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.
ఇప్పటికే ఏసీబీ కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని ఉన్నత న్యాయస్ఖానం ఆదేశించింది. మరోవైపు ఏసీబీ విచారణ జరపవచ్చని సూచించింది. తదుపరి విచారణ డిసెంబర్ 27వ తేదీన జరగనుంది. ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ పిటిషన్ లో ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.
ఇక ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతోనే నమోదు చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ దోస్తీ రాజకీయాలు చేస్తూ.. కేటీఆర్ పై కుట్ర చేస్తున్నాయని విమర్శలు గుపిస్తోంది. ఏసీబీ కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే ఈడీ ఎంట్రీ ఇవ్వటమే ఇందుకు బలమైన సాక్ష్యమని చెబుతోంది. ఈకేసులపై న్యాయపోరాటం చేస్తామని… ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదని వాదిస్తోంది.
మొత్తంగా చూస్తే ఈ కేసులో ఇటు ఏసీబీ విచారణ, మరోవైపు ఈడీ ఎంట్రీతో సంచలన పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయమే అన్న అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి..!