తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ab Venkateswara Rao Posting : ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ సర్కార్ పోస్టింగ్ - బాధ్యతల స్వీకరణ, ఇవాళ సాయంత్రమే పదవీ విరమణ

AB Venkateswara Rao Posting : ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ సర్కార్ పోస్టింగ్ - బాధ్యతల స్వీకరణ, ఇవాళ సాయంత్రమే పదవీ విరమణ

31 May 2024, 13:45 IST

google News
    • AB Venkateswara Rao Posting : ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేయంతో ఆయనకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. దీంతో ఆయన శుక్రవారం… ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బాధ్యత లు స్వీకరించారు.
 బాధ్యతలు స్వీకరించిన ఏబీ వెంకటేశ్వరరావు
బాధ్యతలు స్వీకరించిన ఏబీ వెంకటేశ్వరరావు

బాధ్యతలు స్వీకరించిన ఏబీ వెంకటేశ్వరరావు

Senior IPS Officer AB Venkateswara Rao : ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇదే రోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ చివరి రోజే సస్పెన్షన్ ఎత్తివేయటంతో పాటు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ కూడా ఇచ్చింది.

బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… రెండు సంవత్సరాల తరువాత ఇదే ఆఫీస్ లో చార్జ్ తీసుకుంటున్నానని చెప్పారు. తనకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.

ఈరోజే నా పదవీ విరమణ……

“ఈరోజు నా పదవీ విరమణ రోజు. ఈరోజే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నా. సాయంత్రం పదవీ విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. కారణాలు ఏమైనా ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను... ఎటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. పోస్టింగ్ ఆర్డర్లు వచ్చాయి, విధుల్లో చేరాను. ఇప్పటికి ఇంతవరకు మాత్రమే మాట్లాడాలి. ఇంతకాలం నాకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటాను. యూనిఫాంతో రిటైర్ కావడం నా కల నెర వేరినట్లుగా భావిస్తున్నాను” అని ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు.

ఏబీ వెంకటేశ్వరరావుకు తాజాగా హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. పోస్టింగ్ ఇవ్వాలంటూ మే 8న క్యాట్‌ ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని చేసిన వాదనల్ని హైకోర్టు తోసిపుచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై గత వారమే విచారణ పూర్తైంది. తాజాగా క్యాట్‌ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోడానికి హైకోర్టు నిరాకరించింది.

ఏం జరిగిందంటే….

ఆంధ్రప్రదేశ్‌లో డీజీ క్యాడర్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరావు 2019 ఎన్నికల సమయంలో నిఘా విభాగాధిపతిగా ఉన్నారు. ఈసీ జోక్యంతో ఆయన ఆ పోస్టు నుంచి తప్పుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారనే అభియోగాలతో ఆయన్ని సస్పెండ్ చేశారు. దాదాపు ఐదేళ్లుగా పోస్టింగ్‌ లేకుండా ఉన్నారు. రెండుసార్లు ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారు.

ఐదేళ్లుగా ఆయన పోస్టింగ్ కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. పోస్టింగ్ కోసం ఆయన కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడంతో సస్పెన్షన్ ను ఎత్తివేయాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తనను రెండోసారి సస్పెండ్ చేయడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‍లో సవాల్ చేశారు.

ఒకే రకమైన అభియోగాలతో వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేయండం న్యాయ విరుద్దమని క్యాట్ అభిప్రాయపడింది. ఆయనను వెంటనే సర్వీస్ లోకి తీసుకుని రావాల్సిన ఎరియర్స్ మొత్తం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏబీవీ సస్పెన్షన్ చట్ట విరుద్దమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రెండోసారి సస్పెండ్ చేయడం ఉద్యోగిని వేధించడమేనని క్యాట్ అభిప్రాయపడింది.

ఒకే కారణంతో రెండుసార్లు సస్పెండ్

టీడీపీ ప్రభుత్వంలో రక్షణ పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో ఆయన క్యాట్ ను ఆశ్రయించగా క్యాట్ సస్పెన్షన్ ను సమర్థించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఏబీవీ సస్పెన్షన్ ను కొట్టివేసింది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ లో ఉంచవద్దని ఆదేశిస్తూ... ఏబీవీని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకుంది. అయితే కొంతకాలానికి తిరిగి అదే కారణం చెబుతూ సస్పెండ్ చేసింది. దీంతో ఆయన మళ్లీ క్యాట్ ను ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం క్యాట్ ఇవాళ తుది తీర్పు ఇచ్చింది.

ఒక ఉద్యోగిని రెండోసారి ఒకే కారణంతో సస్పెండ్ చేయడం చట్ట విరుద్ధమని క్యాట్ పేర్కొంది. ఆయన సస్పెన్షన్‌ను వెంటనే రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏబీవీకి వెంటనే పోస్టింగ్‌ ఇచ్చి, సస్పెన్షన్‌ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని క్యాట్ ఆదేశించింది.

అడిషనల్ డీజీపీ ర్యాంకులో ఇంటిలిజెన్స్ విభాగపు అధిపతిగా సెక్యూరిటీ ఎక్విప్‌మెంట్ కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును గతంలో సర్వీస్ నుంచి సస్పెండ్ చేసింది. కేంద్ర హోం శాఖ కూడా దీనిని ధ్రువీకరించింది. ఏబీ వెంకటేశ్వరరావును శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది.

ఏబీని విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీని కోరింది. అయితే రెండు ఇంక్రిమెంట్లు మాత్రమే నిలిపేయాలని యూపీఎస్సీ సిఫార్సు చేసింది. ఏబీవీని డిస్మిస్‌ చేయడానికి యూపీఎస్సీ సిఫార్సు చేయలేదని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ వ్యవహారాన్ని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌లో సవాల్ చేశారు. దీంతో ఆయనకు అనుకూలంగా క్యాట్‌ జారీ చేసిన ఉత్తర్వుల్ని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. ఏబీ పదవీ కాలం నేటితో ముగియనుంది. రిటైర్మెంట్‌లోగా సర్వీస్‌లో చేరాలనే లక్ష్యంతో ఏబీ న్యాయపోరాటం చేశారు.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏబీవీపై విధించిన సస్పెన్షన్ ను ఏపీ సర్కార్ ఎత్తివేసింది. అయితే ఇవాళ ఉద్యోగ విరమణ చేయనున్న దృష్ట్యా పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈమేరకు సీఎస్ జవహర్‍రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

తదుపరి వ్యాసం