Intelligence DG: ఎన్నికల వేళ కలిసి రాని ఇంటెలిజెన్స్ డీజీ పోస్టింగ్… 2019లో కూడా కుమార్ విశ్వజిత్‌కే బాధ్యతలు….
Intelligence DG: ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఆనవాయితీ కొనసాగుతోంది. ఎన్నికల వేళ కీలక రాజకీయ ఫిర్యాదులు, ఆరోపణలతో ముఖ్యమైన అధికారుల్ని బాధ్యతల నుంచి తప్పించడమనే సాంప్రదాయం కొనసాగుతోంది. 2019, 2024లో ఎన్నికల కమిషన్ ఒకే అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ బాధ్యతలు అప్పగించింది.
Intelligence DG: ఏపీలో ఇంటెలిజెన్స్ డీజీ అధికారులకు ఆ పోస్టు అచ్చి రావడం లేదు. సరిగ్గా ఐదేళ్ల తర్వాత 2019 పరిణామాలే మళ్ళీ పునరావృతం అయ్యాయి. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ బాధ్యతల నుంచి PSR Anjaneyulu పిఎస్సార్ ఆంజనేయులును తప్పించి కుమార్ విశ్వజిత్‌కు ఎన్నికల సంఘం బాధ్యతలు అప్పగించింది. విచిత్రం ఏమిటంటే 2019లో ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ డీజీ పదవి నుంచి తప్పించినపుడు కూడా ఈసీ కుమార్ విశ్వజిత్‌కే ఆ బాధ్యతలు అప్పగించారు.
ఏపీలో అంతా ఊహించినట్టే కీలకమైన అధికారులపై ఎన్నికల సంఘం వేటు పడింది. ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్సార్ ఆంజనేయులును విధుల నుంచి తప్పించిన ఎన్నికల సంఘం ఆయన స్థానంలో 1994 బ్యాచ్‌కు చెందిన Kumar Viswajith కుమార్ విశ్వజిత్‌కు బాధ్యతలు అప్పగించింది. కుమార్ విశ్వజిత్ గతంలో ఏపీ Home Secretary హోం సెక్రటరీగా కూడా పనిచేశారు.
అప్పట్లో అలా…
2019లో కూడా సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ డీజీ పోస్టు నుంచి ఏబీ వెంకటేశ్వరరావు ఈసీ ఆదేశాలతో తప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నికల సంఘం పరిధిలోకి ఎవరెవరు వస్తారు అనే విషయం మీద వివాదం తలెత్తడంతో ఏబీ వెంకటేశ్వరరావు పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
వైసీపీ రాజకీయ ఫిర్యాదుల మీద ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడంపై అప్పటి ప్రభుత్వం హై కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదంలో అప్పటి ప్రతిపక్ష వైసీపీ కూడా ఇంప్లీడ్ అయ్యింది.
ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చే అధికారుల జాబితా నుంచి నిఘా విభాగం అధిపతి ఏబీ వెంకటేశ్వర రావును మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేట పేరిట ఉత్తర్వులు జారీ చేయడం., అప్పట్లో ఆయన మెడకు చుట్టుకుంది.
2019లో ఎన్నికల హడావుడి మొదలయ్యాక వైసీపీ ఫిర్యాదులతో శ్రీకాకుళం, కడప, ప్రకాశం జిల్లాల్లో ఎస్పీలతో పాటు, ఇంటెలిజెన్స్ డీజీ మీద వేటు పడింది. వారిని విధుల నుంచి తప్పించాలని వైసీపీ నేతలు పలు మార్లు ఫిర్యాదులు చేయడంతో వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
దీంతో ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీవో 716 విడుదల అయ్యింది. ఆ తర్వాత నిఘా విభాగ అధిపతి ఏబీ వెంకటేశ్వర రావుని మినహాయిస్తూ జీవో 720 విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక ఎన్నికల సంఘ పరిధిలోకి వచ్చే అధికారుల జాబితా నుంచి నిఘా అధిపతిని మినహాయిస్తూ సీఎస్ పేరిట జీవో 721 విడుదల జారీ అయ్యింది.
ఎన్నికల సంఘం తరపున వాదించిన న్యాయవాది ప్రకాష్ రెడ్డి., నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల సంఘం పరిధిలో ఉన్న డీజీ ఇంటెలిజెన్స్., సార్వత్రిక ఎన్నికల సమయానికి ఎలా రాకుండా పోతారని ప్రశ్నించడంతో అప్పటి అడ్వకేట్ జనరల్ న్యాయ స్థానానికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. సుదీర్ఘ వాదనల తర్వాత జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ సత్యనారాయణ ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది.
దీంతో ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర రావుని బదిలీ చేస్తూ జీవో 750 విడుదల అయ్యింది. అప్పటికే కడప, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలపై ఈసి బదిలీ వేటు వేసింది.ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ఈసీ తప్పించింది. సిఎస్ అనిల్ చంద్ర పునేటా స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించారు.
ఎన్నికల ఫలితాల తర్వాత….
2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. మొదట్లో కొన్నాళ్ల పాటు తెలంగాణ క్యాడర్‌కు చెందిన స్టీఫెన్ రవీంద్ర ఏపీ ఇంటెలిజెన్స్ బాధ్యతలు నిర్వహించారు. స్టీఫెన్ రవీంద్ర డిప్యూటేషన్‌కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసినా కేంద్ర హోంశాఖ అనుమతించలేదు.
అప్పటికే ఆయన క్యాడర్ పరిమితులు అనుమతించక పోవడంతో తిరిగి సొంత రాష్ట్రానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. కుమార్ విశ్వజిత్ అధికారికంగా ఇంటెలిజెన్స్ డీజీ పోస్టులో ఉండగానే స్టీఫెన్ రవీంద్ర ఆ బాధ్యతలు నిర్వర్తించారు. కొంత కాలం పాటు మనీష్ కుమార్ సిన్హాకు ఇంటెలిజెన్స్ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో పిఎస్సార్ ఆంజనేయులును నియమించారు. దాదాపు మూడళ్లుగా ఇంటెలిజెన్స్ డీజీ ర్యాంకులో ఉన్న పిఎస్సార్ ఆంజనేయులు సార్వత్రిక ఎన్నికల వేళ మునుపటి ఆనవాయితీని కొనసాగిస్తూ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
సంబంధిత కథనం