AP Elections: అప్పట్లో అలా...!ఇప్పుడు ఇలా.. ఎన్నికల సంఘంపైనే టీడీపీ ఆశలు... ఈసీ క్రియాశీలతపైనే నమ్మకం..-the tdp leaders who have pinned their hopes on the election commissions activism ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Elections: అప్పట్లో అలా...!ఇప్పుడు ఇలా.. ఎన్నికల సంఘంపైనే టీడీపీ ఆశలు... ఈసీ క్రియాశీలతపైనే నమ్మకం..

AP Elections: అప్పట్లో అలా...!ఇప్పుడు ఇలా.. ఎన్నికల సంఘంపైనే టీడీపీ ఆశలు... ఈసీ క్రియాశీలతపైనే నమ్మకం..

Sarath chandra.B HT Telugu
Mar 27, 2024 11:28 AM IST

AP Elections: మరికొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడ నుంది. దేశ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల నగారాతో పాటు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ముహుర్తం కూడా ఖరారు కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై టీడీపీ మదనపడుతోంది.

ఎన్నికల సంఘం క్రియాశీలతపై ఆశలు పెట్టుకున్న టీడీపీ
ఎన్నికల సంఘం క్రియాశీలతపై ఆశలు పెట్టుకున్న టీడీపీ

AP Elections: మరికొద్ద గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు పార్లమెంటు ఎన్నికల ముహుర్తం ఖరారు కానుంది. 2019 ఎన్నికలకు ముందు అధికారంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ TDP ప్రభుత్వ పరిస్థితులు టీడీపీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. 2019 జనవరి నుంచి ఏపీలో అధికార వ్యవస్థ మొత్తం ఎన్నికల సంఘం నియంత్రణలోకి వెళ్లిపోవడాన్ని గుర్తుచేస్తున్నారు. ఐదేళ్ల క్రితం పరిస్థితులు గుర్తు చేసుకుని ఆ పార్టీ నేతలు బెంబేలెత్తుతున్నారు.

2014లో రాష్ట్ర విభజన తర్వాత 2016 నాటికి ఆంధ్రప్రదేశ్ Andhrapradesh కార్యనిర్వాహక వ్యవస్థ మొత్తం అమరావతి తరలి వచ్చింది. 2015లో అమరావతిలో తాత్కలిక రాజధాని భవనాల నిర్మాణం పూర్తి చేసి ఏడాదిలోపే హైదరాబాద్ నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడకు తరలించారు.

విజయవాడలో మరికొన్ని ప్రభుత్వ కార్యలయాలను ఏర్పాటు చేశారు. కీలకమైన సచివాలయం, శాసనసభలను వెలగపూడిలో ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉండే ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం మాత్రం 2018 సెప్టెంబర్‌ వరకు హైదరాబాద్‌లో ఉండిపోయింది.

ఆలస్యంగా సన్నాహాలు..

దేశ వ్యాప్తంగా 2019 సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై కసరత్తు ప్రారంభించిన తర్వాత ఏపీలో ఓటర్ల జాబితా Voters List ఖరారు కాకపోవడం, పాత జాబితాల్లో లోపాలు ఉండటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. అప్పటికే ఎన్డీఏ NDA కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. అప్పటికే టీడీపీ-బీజేపీ BJP మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరోవైపు ఎన్నికల జాబితాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఓట్ల తొలగింపు, కొత్త ఓట్లను చేర్చడంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని విపక్ష వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికరి ఫిర్యాదు చేసింది. ఏపీలో జరుగున్న పరిణామాలపై పదేపదే రాజకీయ పార్టీలు ఈసీకి Election Commission ఫిర్యాదులు చేయడంతో 2019 జనవరిలో అనూహ్యంగా ఏపీలో ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని ఎన్నికల సంఘం మార్చేసింది. అప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన ఆర్పీ సిసోడియా స్థానంలో గోపాలకృష్ణ ద్వివేదికి బాధ్యతలు అప్పగించారు.

ఏపీలో నలుగురు కమిషనర్లతో 2019 ఎన్నికలు...

2019 ఎన్నికల Schedule వెలువడే నాటికి ఏపీలో ప్రధాన ఎన్నికల అధికారితో పాటు మరో ముగ్గురు కమిషనర్లను నియమించారు. సీనియర్ ఐఏఎస్‌ అధికారులు సుజాత శర్మ, వివేక్ యాదవ్, మార్కండేయులును ఎన్నికల సంఘంలో కమిషనర్లుగా ఎన్నికల సంఘం నియమించింది. సాధారణంగా రాష్ట్రాల ఎన్నికల విధుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఐఏఎస్‌ అధికారిని మాత్రమే ఈసీ సీఈఓగా నియమిస్తారు. ప్రస్తుతం ముఖేష్‌ కుమార్ మీనా ఒక్కరే ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిగా విధుల్లో ఉన్నారు.

2019లో మాత్రం ఏపీలో నలుగురు అధికారులు ఎన్నికల్ని పర్యవేక్షించారు. పోలీస్‌ శాఖలో సైతం సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ వంటి వారికి బాధ్యతలు అప్పగించారు. అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర రావులపై ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నేరుగా పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారుల్ని నియమించారు.

2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గోపాలకృష్ణ ద్వివేది పంచాయితీ రాజ్‌శాఖతో పాటు గ్రామ సచివాలయాలు, మైనింగ్ వంటి కీలక శాఖల బాధ్యతలు అప్పగించారు. వివేక్ యాదవ్‌ మొదట గుంటూరు కలెక్టర్‌గా నియమించారు. తర్వాత సిఆర్‌డిఏ కమిషనర్‌, ఏపీ బేవరేజేస్ కార్పోరేషన్‌ బాధ్యతలు అప్పగించారు.

కోర్టు వివాదాలతో సిఎస్‌ పదవి ఎసరు...

2019లో ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదంలో అప్పటి ప్రతిపక్ష వైసీపీ కూడా ఇంప్లీడ్ అయ్యింది. ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చే అధికారుల జాబితా నుంచి నిఘా విభాగం అధిపతి ఏబీ వెంకటేశ్వర రావును మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేట పేరిట ఉత్తర్వులు జారీ చేయడం, ఆయన మెడకు చుట్టుకుంది.

2019లో ఏపీలో ఎన్నికల హడావుడి మొదలయ్యాక అధికార, ప్రతిపక్షాలు నిత్యం కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర సీఈఓ కార్యాలయానికి వరుస ఫిర్యాదులు చేసేవారను. ఈ క్రమంలో ఏపీలోని శ్రీకాకుళం, కడప, ప్రకాశం జిల్లాల్లో ఎస్పీలతో పాటు, ఇంటెలిజెన్స్ డీజీ మీద వైసీపీ నేతలు పలు మార్లు ఫిర్యాదులు చేయడంతో వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

దీంతో ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీవో 716 విడుదల అయ్యింది. ఆ తర్వాత నిఘా విభాగ అధిపతి ఏబీ వెంకటేశ్వర రావుని మినహాయిస్తూ జీవో 720 విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక ఎన్నికల సంఘ పరిధిలోకి వచ్చే అధికారుల జాబితా నుంచి నిఘా అధిపతిని మినహాయిస్తూ సీఎస్ పేరిట జీవో 721 విడుదల జారీ అయ్యింది.

సిఎస్‌కు తెలియకుండానే జీవో విడుదల…

ఏబీ వెంకటేశ్వరరావుకు మినహాయింపు వ్యవహారం కాస్త కోర్టుకు వెళ్లడంతో ఎన్నికల సంఘం తరపున వాదించిన న్యాయవాది ప్రకాష్ రెడ్డి, నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల సంఘం పరిధిలో ఉన్న డీజీ ఇంటెలిజెన్స్, సార్వత్రిక ఎన్నికల సమయానికి ఎలా రాకుండా పోతారని ప్రశ్నించడంతో అప్పటి అడ్వకేట్ జనరల్ న్యాయ స్థానానికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

సుదీర్ఘ వాదనల తర్వాత జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ సత్యనారాయణ ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. దీంతో ఏబీ వెంకటేశ్వర రావుని బదిలీ చేస్తూ జీవో 750 విడుదల అయ్యింది. ఆయన స్థానంలో కుమార్ విశ్వజిత్‌కు బాధ్యతలు అప్పగించారు. అప్పటికే కడప, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలపై ఈసీ బదిలీ వేటు వేసింది.

పదవి కోల్పోయిన నాటి ఏపీ సిఎస్‌ పునేఠా....

2019 ఎన్నికల వేళ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ అవమానకర పరిస్థితుల్లో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆయనపై వేటు పడింది. సిఎస్‌కు తెలియకుండా జీవో 721 జారీ కావడంతో ఆయన అవమానకర పరిస్థితుల్లో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సిఎస్‌ డిజిటల్‌ కీతో పిఎస్‌ జీవో ఇచ్చేశారని గుర్తించేసరికి ఈసీ ఆయనపై వేటు వేసింది.

2019లో ఎన్నికల విధుల్లో ఉన్న సీఈఓ ద్వివేది, నిఘా విభాగం అధిపతి  కుమార్ విశ్వజిత్
2019లో ఎన్నికల విధుల్లో ఉన్న సీఈఓ ద్వివేది, నిఘా విభాగం అధిపతి కుమార్ విశ్వజిత్

అధికార యంత్రాంగంపై ఆందోళన...

ఎన్నికల వేళ ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై టీడీపీలో ఆందోళన నెలకొంది. ఏపీలో అధికార వ్యవస్థ మొత్తం వైసీపీ ప్రభుత్వం గుప్పిట్లో ఉందని ఆ పార్టీ అనుమానిస్తోంది. 2019లో ఎన్నికల సంఘం పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని తన అదుపులోకి తీసుకుని ఎన్నికల్ని నిర్వహించింది.

కరువు పరిస్థితులపై ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సెక్రటేరియెట్‌లో సమీక్ష నిర్వహించడానికి, క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించడానికి సైతం ఎన్నికల సంఘం అనుమతించలేదు. దీనిపై అప్పటి సీఈఓతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘర్షణ పడాల్సి వచ్చింది.

నాడు ఎన్నికల కోడ్‌ రావడానికి ముందే ఏపీలో అధికార యంత్రాంగం మొత్తం ఈసీ చెప్పు చేతల్లోకి వెళ్లిపోవడాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పనిచేస్తున్నారనే ఆందోళన ఆ పార్టీలో ఉంది.

ఓటర్ల జాబితాలో అక్రమాలు, లోపాలపై ఫిర్యాదులు చేస్తున్నా వాటిని సరిదిద్దే ప్రయత్నాలు ఏమాత్రం జరగలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఓట్ల తొలగింపు, బదిలీ వంటి అంశాలపై తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదని చెబుతున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాతైనా అధికార యంత్రాంగంలో మార్పు వస్తుందేమోనని టీడీపీ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు.

Whats_app_banner