Khammam : వెంబడించి రాళ్లతో దాడి చేసి..! ఖమ్మంలో బైక్ ఫైనాన్సర్ల వేధింపులకు యువకుడి బలి
05 April 2024, 21:52 IST
- Khammam Crime News : ఖమ్మంలో దారుణం వెలుగు చూసింది.కిస్తీ చెల్లించని కారణంగా ఓ యువకుడిని ఫైనాన్సర్లు వెంబడించి రాళ్లతో కొట్టారు. వేధింపులు తట్టుకోలేని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
బైక్ ఫైనాన్సర్ల వేధింపులకు యువకుడి బలి..
Khammam Crime News : ఖమ్మంలో(Khammam) అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. బైక్ ఫైనాన్సర్ల వేధింపులకు ఒక యువకుడు బలైపోయాడు. కొద్ది నెలలుగా నెలసరి కిస్తీ చెల్లించని కారణంగా ఒక యువకుడిని ఫైనాన్సర్లు వెంబడించి రాళ్లతో కొట్టి మరీ వేధింపులకు పాల్పడ్డారు. వారి వేధింపులు తాళలేకపోయిన ఆ యువకుడు పరిగెడుతూ చెరువులో పడి మృత్యువాత పడ్డాడు.
రాజస్థాన్ కి చెందిన కొందరు యువకులు ఏడాది కిందట పనుల కోసం ఖమ్మం జిల్లా కేంద్రానికి వలస వచ్చారు. అందులో వినయ్ అనే యువకుడు ఖమ్మంలోని మోహన్ సాయి ఫైనాన్స్ కంపెనీలో బైక్ కొనుగోలు చేశాడు. డౌన్ పేమెంట్ కింద కొంత నగదు కట్టగా నెలసరిగా కొంత మొత్తం కిస్తీగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. కాగా ఇటీవల కొంతకాలంగా కరువు పరిస్థితుల నేపథ్యంలో పనులు దొరక్క వినయ్ నెలసరి చెల్లించాల్సిన బైక్ కిస్తీ చెల్లించలేకపోయాడు. దీంతో శుక్రవారం ఉదయం వినయ్ ఉంటున్న ఇంటికి చేరుకున్న ఫైనాన్సర్లు ఎట్టి పరిస్థితుల్లో కిస్తీ చెల్లించాలంటూ పట్టు పట్టారు. పరిస్థితి బాగోలేదని, అందుకే కిస్తీ చెల్లించలేకపోతున్నానని వేడుకున్నాడు. మరి కాస్త సమయం ఇవ్వాలని అతను కాళ్ళ వేళ్ళ పడినా వదిలిపెట్టలేదు. దీంతో ఆ యువకుడు వారి నుంచి తప్పించుకునేందుకు పరుగు లంకించుకున్నాడు. అయినా బైక్ పై వెంటాడిన ఫైనాన్సర్లు అతన్ని వదిలిపెట్టకుండా రాళ్లతో సైతం దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చివరికి ఆ యువకుడు లకారం చెరువులో ప్రమాదవశాత్తు పడిపోయి మృత్యు కుహరంలోకి చేరుకున్నాడు.
పెచ్చుమీరిపోతున్న ఫైనాన్సర్ల వేధింపులు..
ఖమ్మం జిల్లా కేంద్రంలో బైక్ ఫైనాన్సర్ల వేధింపులు నానాటికి హెచ్చరిల్లి పోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆ వేధింపులు ఒక యువకుడి ప్రాణాలను సైతం బలి తీసుకోవడం సంచలనం కలిగిస్తోంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో బైక్ లు అమ్ముతున్న ఫైనాన్స్ కంపెనీలు ఒక్క నెల కిస్తీ చెల్లించకపోయినా వాహనదారుడి ఇంటికి వెళ్లి పది మందిలో పరువు తీయడం ద్వారా విపరీతమైన వేధింపులకు, ఒత్తిడికి గురి చేస్తున్నారు. మరికొందరు డబుల్ తాళాలతో వేధిస్తున్నారు. ఒక తాళం తమ వద్ద పెట్టుకొని కిస్తీ కట్టని నెల దౌర్జన్యంగా బైకును లాక్కెళ్ళుతున్నారు. ఫైనాన్స్ కంపెనీ యజమానులు ఇందుకోసం రికవరీ ఏజెంట్లుగా ఆజానుబాహులను నియమించుకుంటున్నారు. కరుడుగట్టిన మనస్తత్వం కలిగిన వ్యక్తులను నియమిస్తుండడంతో వారు అత్యంత వాశవికంగా వ్యవహరిస్తూ వాహనదారులపై అమానవీయంగా విరుచుకుపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే రాజస్థాన్ కు చెందిన వినయ్ ఫైనాన్సర్ల ఉచ్చులో పడి బలైపోయాడు.
గతంలో జిల్లా ఎస్పీగా పని చేసిన రంగనాథ్ ఫైనాన్సర్ల ఆగడాలకు మొక్కుతాడు వేశాడు. ఆ తర్వాత అతని బదిలీతో మళ్లీ ఫైనాన్సర్లు తమ కార్యకలాపాలను విస్తరింపజేసుకున్నారు. ఫైనాన్సర్ల వేధింపులకు సంబంధించి ఎందరో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నప్పటికీ ఇది తమ పరిధిలోని వ్యవహారం కాదని చెబుతూ తప్పించుకుంటున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో బాధితులు ఫైనాన్సర్ల ఉచ్చలో చిక్కుకుంటున్నారు.