Khammam : కడుపులోనే చిన్ని ప్రాణాలను చిదిమేస్తున్నారు..! ఖమ్మంలో నాలుగు హాస్పిటల్స్ సీజ్..-four hospitals were seized in khammam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Four Hospitals Were Seized In Khammam

Khammam : కడుపులోనే చిన్ని ప్రాణాలను చిదిమేస్తున్నారు..! ఖమ్మంలో నాలుగు హాస్పిటల్స్ సీజ్..

HT Telugu Desk HT Telugu
Mar 31, 2024 10:52 AM IST

Khammam News: చట్టాలు, నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ.. పసికందుల ప్రాణాలు పిండ దశలోనే గాలిలో కలిసిపోతున్నాయి. స్కానింగ్‌ సెంటర్లు, ప్రైవేటు ఆసుపత్రులు.. కాసుల వేటలో పడి శిశువుల్ని చిదిమేస్తున్నాయి. తాజాగా ఖమ్మంలో నాలుగు ఆస్పత్రులను అధికారులు సీజ్ చేశారు.

ఖమ్మం జిల్లా
ఖమ్మం జిల్లా

Khammam News: ప్రాణాలు నిలబెట్టాల్సిన వైద్యులే నిలువునా ప్రాణాలు తీస్తున్న ఉదంతాలు ఖమ్మం(Khammam) కేంద్రంగా నివ్వెరపోయేలా చేస్తున్నాయి. మానవత్వం మంటగలిసేలా కొందరు వైద్యులు డబ్బుల కోసం చేస్తున్న వికృత క్రీడ తోటి వైద్యులను సిగ్గుపడేలా చేస్తున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే నాలుగు హాస్పిటళ్లు సీజ్‌ అయ్యాయంటే కొందరు ప్రయివేటు వైద్యులు చేస్తున్న దందా ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా జరుగుతున్న ఈ దుర్మార్గుల వల్ల ఖమ్మంలో విలువలతో కూడిన వైద్యం చేస్తున్న డాక్టర్లను మానసికంగా కుంగదీస్తోందన్న చర్చ జరుగుతోంది. మరీ బాధాకరమైన విషయం ఏమంటే సంతాన సాఫల్య కేంద్రం అంటూ బోర్డులు పెట్టి కడుపులో పెరిగే పసి కందుల్ని చిదిమేస్తున్న వైనం వైద్య లోకాన్ని యావత్‌ సమాజం ముందు సిగ్గుపడేలా చేస్తోంది. మరి ఇంతలా పెచ్చుమీరి పోయిన ఈ తంతును జిల్లా వైద్య అరోగ్యశాఖ అధికారులు ఇంతవరకూ ఎందుకు గుర్తించలేక పోతున్నారనే విషయంపై సర్వత్రా విమర్శలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అబార్షన్లకు పాల్పడే హాస్పిటళ్ల రద్దుకు కూడా సిఫారసు చేసేందుకు వెనుకాడబోమని ఐఎంఏ పెద్దలు ప్రకటించారు. చట్ట ప్రకారం ఆయా హాస్పిటళ్లపై చర్యలు ఉంటాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ఘటనలు సహించబోమన్నారు.

ట్రెండింగ్ వార్తలు

అబార్షన్లు చేస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కిన హాస్పిటల్‌..

ఖమ్మంలో అబార్షన్లు నిర్వహించే హాస్పిటళ్ల సంఖ్య రోజురోజుకూ వెలుగులోకి వస్తున్నాయి. అబార్షన్ల వ్యాపారమే ద్యేయంగా పలువురు ఖమ్మం కేంద్రంగా ఈ అమానవీయ దందాకు తెరలేపినట్టు విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. పేరుకు సంతాన సాఫల్య కేంద్రం అంటూ ఊదరగొట్టే హోర్డింగులు పెట్టి మరీ చట్ట విరుద్దమైన చర్యలకు నిస్సిగ్గుగా తెగబడుతున్నారు. అది ఎంతలా అంటే ఒక్కో హాస్పిటల్‌లో రోజుకు కనీసం ఐదుగురికి అబార్షన్లు చేస్తున్నట్టు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు గుర్తించడం విస్తుగొలుపుతోంది. రెండు రోజుల కిందట మూడు హాస్పిటళ్లను సీజ్‌ చేసిన డీఎంహెచ్ఓ డా.మాలతి, డిప్యూటీ డీఎంహెచ్‌ డా.సైదులు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఖమ్మం నడిబొడ్డున చర్చి కాంపౌండ్‌ సమీపంలోని సుగుణ హాస్పిటల్‌పై దాడి చేసి ఇద్దరు నెలలు నిండని గర్భిణులకు అబార్షన్లు చేసే క్రమంలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటికే ఆ ఇద్దరు మహిళలకు ఇంజక్షన్లు ఇచ్చి అబార్షన్‌కు సిద్ధం చేసి ఉంచిన సమయంలో పోలీసు శాఖ, వైద్యారోగ్య శాఖ దాడులు చేసి పట్టుకున్నారు. అనంతరం సీజ్‌ చేశారు. సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్న ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మూడు రోజుల్లో నాలుగు హాస్పిటళ్లు సీజ్‌..

కేవలం మూడు రోజుల్లో నాలుగు హాస్పిటళ్లు సీజ్‌ కావడాన్ని బట్టి జిల్లా కేంద్రంలో ఎలాంటి వైద్యం నిర్వహిస్తున్నారో గుర్తించవచ్చు. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఎలాంటి భయం లేకుండా, చట్ట విరుద్ధంగా అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారో అర్దం చేసుకోవచ్చు. డీఎంహెచ్ఓ డా.మాలతి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బోనకల్‌ క్రాస్‌ రోడ్డు చర్చి కాంపౌండ్‌ కు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న సుగుణ హాస్పిటల్‌ లో ఇద్దరు నెలలు నిండని మహిళలకు ఆబార్షన్‌ చేస్తుండగా జిల్లా అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ యువరాజ్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ బి.మాలతి, ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి మౌనిక సంయుక్త ఆధ్వర్యంలో సమాచారం మేరకు రెడ్‌ హ్యాండెడ్‌ గా హాస్పిటల్‌ నిర్వాహకులను పట్టుకున్నారు. హాస్పిటల్‌ నిర్వాహకులు ఇద్దరు మహిళలకు ఆబార్షన్‌ చేసేందుకు ఇంజక్షన్‌ చేసి రెడీగా ఉంచినట్లు డా. మాలతి తెలిపారు. ఈ ఇద్దరు మహిళలు ఇతర ప్రాంతానికి చెందినవారేనని చెప్పారు. వీరికి 18 వారాలు, రెండునెలలు నిండనివారే. హాస్పిటల్‌ నిర్వాహకుల వద్ద నెలలు నిండని 50 మంది మహిళల కేసు షీట్లు లభించాయని తెలిపారు. ఆబార్షన్‌ చేయించుకోవడానికి వచ్చిన వారి వివరాలను ఐపి, ఓపి లో నమోదు చేయలేదన్నారు. ప్రతి కేసు షీట్‌ కు కోడ్‌ వేసి ఉన్నాయని అన్నారు. నిర్వహకులు కోడ్‌ ఏంటని అడిగితే సమాధానం చెప్పడం లేదన్నారు. ఆబార్షన్‌ కు వచ్చిన మహిళలు వాంతులు, కడుపు నొప్పితో అడ్మిట్‌ అయినట్లు చూపెడు తున్నారని ఆమె తెలిపారు. మహిళలను కోదాడ, కరీంనగర్‌, మహబూబాద్‌, కోరివి, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించించినట్లు చెప్పారు. స్కానింగ్‌ మిషన్‌ ను,రికార్డ్స్‌, కంప్యూటర్లను, హాస్పిటల్ను సీజ్‌ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆబార్షన్ కు సిద్ధం చేసిన ఇరువురి మహిళలను జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌ కు తరలించినట్లు ఆమె చెప్పారు. హాస్పిటల్‌ లో డాక్టర్‌ కు ఎంబీబీఎస్‌ అర్హత మాత్రమే ఉందన్నారు. డ్రగ్‌ శాఖ ఏడి ప్రసాద్‌ ఫార్మాసిని సీజ్‌ చేశారు. ఈ తనిఖీలో డిప్యూటీ డిఎం అండ్‌ హెచ్‌ ఓ సైదులు, వన్‌ టౌన్‌ పోలీసులు పాల్గొన్నారు.

ఒక్కో సెంటర్‌లో యాభైకి పైగా అబార్షన్లు..

ఖమ్మం కేంద్రంగా సాగుతున్న అబార్షన్ల దందాను పరిశీలిస్తే ఖమ్మం చుట్టుపక్కల జిల్లాలకే కాక హైదరాబాద్‌ లాంటి నగరాల నుంచి సైతం గర్భిణులను రప్పించుకుని బేరం మాట్లాడుకుని తమ వ్యాపారాన్ని మూడు పువ్వులూ, ఆరు కాయలుగా వర్ధిల్లేలా చక్క బెట్టుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అవాంచిత గర్భం అని భావించిన వారికి ఈ హాస్పిటళ్లే దిక్సూచీలా మారుతున్నాయి. డీఎంహెచ్ఓ డా. మాలతి మీడియాతో మాట్లాడుతూ ఒక్కో సెంటర్‌లో కనీసం యాభైకి పైగా కేసులు ఉన్నట్టు తమ వద్ద సమాచారం ఉందని చెప్పడాన్ని బట్టి ఏ స్థాయిలో అబార్షన్లకు పాల్పడుతున్నారో అర్దం చేసుకోవచ్చు. ఇంతకి తెగించిన ఈ వైద్యులు తమ అక్రమం బయటపడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా కేస్‌షీట్లు నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ప్రత్యేకంగా స్కానింగ్‌ యంత్రాలు వాడుతూ ఆడ, మగ అనే విషయాలు కూడా తేటతెల్లం చేసినందుకు ప్రత్యేకంగా ఫీజులు దండుకుంటున్నారని అధికారులు గుర్తించారు. ఇంత అక్రమం జరుగుతున్నా అధికారులు ఇంత వరకూ గుర్తించక పోవడాన్ని బట్టి పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ఈ అమానవీయ వ్యాపారాన్ని ఉక్కు పాదంతో అణచివేసి ఆయా హాస్పిటళ్ల గుర్తింపును రద్దు చేయాలని జిల్లా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఆరోపణలు ఉన్న మరిన్ని ఆస్పత్రులపై నిఘా ఉంచి నిజాలను నిగ్గు తేల్చాలన్న డిమాండ్‌ పెరుగుతోంది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం, HT తెలుగు ప్రతినిధి

IPL_Entry_Point