Khammam Congress Candidate : చక్రం తిప్పుతున్న 'హస్తం' పెద్దలు - ఖమ్మంలో తెరపైకి ఊహించని అభ్యర్థి!
Khammam Congress Ticket 2024: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. జిల్లాకు చెందిన మంత్రులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా… అధినాయకత్వం పెద్దలు మరో మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఊహించని విధంగా మరో అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం.
Khammam Congress Ticket 2024: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా దేశమంతటా ఖరారవుతోంది. కాగా అభ్యర్థుల ప్రకటన క్రమంలో ఎన్ని జాబితాలు వెలువడుతున్నప్పటికీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎవరనే మీమాంసకు మాత్రం ఇంకా తెర పడడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేయగా ఖమ్మం ఎంపీ అభ్యర్థి(Khammam Congress Ticket 2024) వ్యవహారం ఇప్పుడు ఢిల్లీలో సెగ పుట్టిస్తోంది. ఈ టికెట్టు కోసం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పోటీ పడుతుండగా రాష్ట్ర స్థాయి నేతలు సైతం ఈ స్థానంపై కన్నేసిన విషయం తెలిసిందే. కాగా ఈ టికెట్ ఆశిస్తున్న సీనియర్ నేత వి హనుమంతరావును ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి బుజ్జగించడంతో ఈ రేసులో ప్రస్తుతానికి ఆయన లేనట్లే చెప్పాలి. అయితే మంత్రి పదవులను అనుభవిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల కుటుంబ సభ్యులకు మళ్లీ ఎంపీ టికెట్ ఇవ్వడం అనే విషయంలో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర క్యాబినెట్లో హోదాను అనుభవిస్తున్న వారి కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్ ఇవ్వడమేంటని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ టికెట్ ఎవరికి కేటాయించాలన్న విషయంలో తల నొప్పులను ఎదుర్కొంటుంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్ కేటాయించినా మరో ఇద్దరు కినుక వహించే అవకాశాలు ఉండడంతో అధిష్టానం ఆచితూచి అడుగేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
కాంగ్రెస్ ఆపరేషన్ లో నామా ఉండబోతున్నారా..?
కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) గేట్లను తెరవడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్కరు మిగలని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో కీలక పదవులను అనుభవించిన నేతలు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతున్న పరిస్థితి తాజాగా నెలకొంది. అయితే ఇందులో భాగంగానే ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు సైతం కాంగ్రెస్ లో చేరనున్నారా..? అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా కాంగ్రెస్ లో ముగ్గురు మంత్రుల నడుమ నెలకొన్న పోటీని వారించేందుకు కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎంపీ నామ కాంగ్రెస్ లో చేరతారన్న ఊహాగానాలు వినిపించాయి. ఆ సమయంలో ఆయనకు ఖమ్మం ఎంపీ స్థానంలో పోటీ చేసే విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో వెనకడుగు వేశారు. కాగా కాంగ్రెస్ లో నెలకొన్న పోటీ వాతావరణాన్ని నివారించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావును ఆహ్వానించి ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని అధిష్టాన పెద్దలు భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కాస్త జాప్యం జరిగినా ఆచితూచి అడుగు వేసేందుకు అధిష్టానం ప్రాధాన్యత ఇస్తున్నట్లు పార్టీ పెద్దలు భావిస్తున్నారు.
2004 నుంచి ప్రస్థానం..
ప్రస్తుతం ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు(nama nageswara rao) 17వ లోక్‌సభకు ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా మే నెలలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి ఖమ్మం స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మొదటి సారిగా లోక్‌సభకు 2004లో తెలుగుదేశం పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరిపై పోటీచేసి లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. తిరిగి అదే అభ్యర్థి మీద 2009లో సుమారు 1,25,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం నియోజకవర్గం నుంచి 11 వేల ఓట్ల తేడాతో వై.సి.పి. అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2019 మార్చి 21వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. నామా నాగేశ్వరరావు 2019లో టీఆర్‌ఎస్ పార్టీ తరపున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఖమ్మం ఎంపీగా గెలిచారు. ఆయన ప్రస్తుతం బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడిగా కూడా కొనసాగుతున్నారు.