Hyderabad Accident: రాష్ డ్రైవింగ్.. గాల్లోకి ఎగిరి పడిపోయిన మహిళ.. షాకింగ్ విజువల్స్
01 September 2024, 13:16 IST
- Hyderabad Accident: హైదరాబాద్ నగరంలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల హబ్సీగూడలో జరిగిన ప్రమాదాన్ని మర్చిపోకముందే.. మరో ఘటన జరిగింది. రాష్ డ్రైవింగ్ ఓ మహిళను ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసింది. ఈ ప్రమాదం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.
వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ నగరం వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు మహిళను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. వనస్థలిపురంలోని ఎన్‌జీవోస్ కాలనీలోని వివేకానంద పార్క్ ముందు ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న కారు మహిళను ఢీకొట్టిన ఘటన సీసీటీవీలో రికార్డైంది. మహిళ తలకు బలమైన గాయం కావడంతో.. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారును గుర్తించామని పోలీసులు చెప్పారు. డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ అశోక్ రెడ్డి వివరించారు.
హబ్సీగూడలోనూ..
హైదరాబాద్ నగరం హబ్సిగూడలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ ప్రమాదానికి సంబంధించి స్కూటీని లారీ ఢీకొట్టిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. కామేశ్వరి (10), ఆమె తమ్ముడు వేదాంష్ స్థానిక జాన్సన్ గ్రామర్ స్కూల్‌లో చదువుతున్నారు. రోజులాగే గురువారం కూడా స్కూలుకు వెళ్లారు. సాయంత్రం వారిని ఇంటికి తీసుకెళ్లడానికి తల్లి సంతోషి స్కూటీ వేసుకొని వచ్చారు.
చనిపోయిన బాలిక..
స్కూటీపై పిల్లలను తీసుకొని వెళ్తుండగా.. ఉప్పల్ నుంచి వేగంగా వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. సంతోషి, వేదాంష్ లారీకి ఎడమ వైపు పడిపోయారు. కామేశ్వరి కుడివైపు పడిపోగా.. లారీ వెనక టైర్లు బాలిక పైనుంచి వెళ్లాయి. దీంతో కామేశ్వరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. లాభం లేకుండా పోయింది. బాలిక కామేశ్వరి చనిపోయింది.
ఆగస్టు 18న కూడా..
హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఆగస్టు 18న కూడా ప్రమాదం జరిగింది. ఓ టిప్పర్ లారీ వేగంగా వచ్చింది. బస్సు వెనకాల ఆగి ఉన్న ఆటోను బలంగా ఢీకోట్టింది. దీంతో ఆటో బస్సు కిందకు వెళ్లి ఇరుక్కుంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తోపాటు అందులో ఉన్న విద్యార్థిని తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి క్రేన్ సహాయంతో ఆటోను తొలగించారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని చికిత్స పొందుతూ మృతిచెందింది.