Hyderabad: హబ్సిగూడ యాక్సిడెంట్‌ కేసులో డ్రైవర్‌ సూరజ్ సింగ్ అరెస్ట్-driver suraj singh arrested in habsiguda accident case in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad: హబ్సిగూడ యాక్సిడెంట్‌ కేసులో డ్రైవర్‌ సూరజ్ సింగ్ అరెస్ట్

Hyderabad: హబ్సిగూడ యాక్సిడెంట్‌ కేసులో డ్రైవర్‌ సూరజ్ సింగ్ అరెస్ట్

Basani Shiva Kumar HT Telugu
Aug 18, 2024 10:25 AM IST

Hyderabad: బస్సు వెనకాల ఆగి ఉన్న స్కూల్ పిల్లల ఆటోను.. వెనకాల నుండీ టిప్పర్ లారి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.

ప్రమాదంలో నుజ్జునుజ్జైన ఆటో
ప్రమాదంలో నుజ్జునుజ్జైన ఆటో

హబ్సిగూడ యాక్సిడెంట్‌ కేసులో డ్రైవర్‌ అరెస్ట్ అయ్యారు. శనివారం ఉదయం హబ్సిగూడలో ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో టెన్త్ విద్యార్థిని సాత్విక మృతి చెందింది. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ సూరజ్‌సింగ్‌ను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

శనివారం ఉదయం హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఓ టిప్పర్ లారీ వేగంగా వచ్చింది. బస్సు వెనకాల ఆగి ఉన్న ఆటోను బలంగా ఢీకోట్టింది. దీంతో ఆటో బస్సు కిందకు వెళ్లి ఇరుక్కుంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తోపాటు అందులో ఉన్న విద్యార్థిని తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి క్రేన్ సహాయంతో ఆటోను తొలగించారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ మృతి..

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలు తార్నాకలోని కిమితీ కాలానికి చెందిన సాత్వికగా పోలీసులు గుర్తించారు. సాత్విక హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నారు. సాత్విక మృతితో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాత్విక మృతికి కారణమైన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

నిత్యం రద్దీగా..

ఉప్పల్, హబ్సీగూడలో రోడ్లు నిత్యం రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం ఎక్కువ రద్దీ ఉంటుంది. ఈ సమయాల్లో వాహనాలు నెమ్మదిగా వెళ్లేలా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు. కానీ.. టిప్పర్ డ్రైవర్ సూరజ్ సింగ్ రద్దీగా ఉండే సమయంలో వాహనాన్ని వేగంగా నడిపారు. కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.