Yuvraj in MCC honour list: యువరాజ్, ధోనీ, మిథాలీలకు అరుదైన గౌరవం
05 April 2023, 21:04 IST
- Yuvraj in MCC honour list: యువరాజ్, ధోనీ, మిథాలీలకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ముగ్గురితోపాటు రైనా, ఝులన్ గోస్వామిలకు ఎంసీసీలో జీవితకాల సభ్యత్వం దక్కడం విశేషం.
ధోనీ, యువరాజ్ సింగ్
Yuvraj in MCC honour list: టీమిండియా మెన్, వుమెన్స్ క్రికెట్ టీమ్ మాజీ ప్లేయర్స్ కు అరుదైన గౌరవం దక్కింది. మొత్తం ఐదుగురు క్రికెటర్లు మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) జీవితకాల గౌరవ సభ్యత్వం అందుకున్నారు. ఎంసీసీ బుధవారం (ఏప్రిల్ 5) ఈ విషయాన్ని వెల్లడించింది. చాలా ఏళ్లుగా గొప్ప క్రికెటర్లకు ఇలా గౌరవ సభ్యత్వం ఇస్తూ వస్తోంది ఎంసీసీ.
ఈ ఏడాది మొత్తం 17 మంది క్రికెటర్లకు ఈ గౌరవం దక్కగా.. అందులో ఐదుగురు ఇండియన్స్ ఉన్నారు. మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి ఈ లిస్ట్ లో ఉన్నారు. వీళ్లకు క్లబ్ లో జీవితకాల గౌరవ సభ్యత్వం దక్కింది. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమ్ లో సభ్యులైన ధోనీ, యువరాజ్ లు ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.
సురేశ్ రైనాను కూడా ఎంసీసీ ఈ లిస్టులో చేర్చింది. అతడు వన్డేల్లో 5500 కుపైగా రన్స్ చేశాడు. అటు భారత మహిళల జట్టుకు దశాబ్దాల పాటు సేవలందించిన మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామిలకూ ఈ గౌరవం దక్కింది. గతేడాది ఈ ఇద్దరూ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. మహిళల వన్డే క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా ఝులన్ రికార్డు క్రియేట్ చేసింది.
ఇక మిథాలీ కూడా వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్. ఆమె 211 ఇన్నింగ్స్ లో 7805 రన్స్ చేసింది. ఈ తాజా లిస్టులో ఇండియాతోపాటు ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెటర్లకు కూడా చోటు దక్కింది. ఇంగ్లండ్ నుంచి కూడా ఐదుగురు ప్లేయర్స్ ఈ జాబితాలో ఉన్నారు. జెన్నీ గన్, లారా మార్ష్, ఇయాన్ మోర్గాన్, కెవిన్ పీటర్సన్, అన్యా ష్రుబ్సోలే ఎంసీసీ జీవితకాల సభ్యత్వం అందుకున్నారు.
పాకిస్థాన్ నుంచి మహ్మద్ హఫీజ్ ఉండగా.. బంగ్లాదేశ్ మాజీ మష్రఫే ముర్తజా, సౌతాఫ్రికా మాజీ బౌలర్ డేల్ స్టెయిన్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ కూడా ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.