World Cup 2023: వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయిన టీమ్స్ ఇవే.. ఆ రెండు పెద్ద జట్లకు షాక్
10 May 2023, 14:53 IST
- World Cup 2023: వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయిన టీమ్స్ లిస్టును ఐసీసీ అనౌన్స్ చేసింది. అయితే ఇందులో రెండు మాజీ ఛాంపియన్ జట్లకు షాక్ తగిలింది. ఆ రెండు టీమ్స్ క్వాలిఫయర్స్ ద్వారా వరల్డ్ కప్ కు అర్హత సాధించాల్సి ఉంటుంది.
అక్టోబర్, నవంబర్ లలో ఇండియాలో జరగనున్న వన్డే వరల్డ్ కప్
World Cup 2023: ఈ ఏడాది చివర్లో ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా క్వాలిఫై అయిన టీమ్స్ లిస్ట్ ను ఐసీసీ బుధవారం (మే 10) అనౌన్స్ చేసింది. ట్విటర్ ద్వారా ఈ జట్ల జాబితా వెల్లడించింది. నేరుగా అర్హత సాధించిన జట్లతోపాటు క్వాలిఫయర్స్ ఆడాల్సిన జట్ల వివరాలను కూడా తెలిపింది. తాజాగా బుధవారం సౌతాఫ్రికా కూడా అర్హత సాధించిన తర్వాత ఈ లిస్టును రిలీజ్ చేసింది.
ఐర్లాండ్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో సౌతాఫ్రికా అర్హత సాధించింది. అయితే మాజీ ఛాంపియన్లు వెస్టిండీస్, శ్రీలంకలు మాత్రం వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించలేకపోయాయి. ఇప్పుడా రెండు టీమ్స్ క్వాలిఫయర్స్ ద్వారా వరల్డ్ కప్‌కు అర్హత సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఐసీసీ సూపర్ లీగ్ కు 8 జట్లు అర్హత సాధించాయి.
వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయిన టీమ్స్
తాజాగా సౌతాఫ్రికా కూడా వరల్డ్ కప్ కు అర్హత సాధించడంతో నేరుగా అర్హత సాధించిన జట్ల సంఖ్య 8కి చేరింది. ఆతిథ్య జట్టు ఇండియా ఆటోమేటిగ్గా క్వాలిఫై అయింది. ఇండియా, సౌతాఫ్రికాతోపాటు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ వరల్డ్ కప్ 2023కు అర్హత సాధించాయి.
కొన్నేళ్లుగా వన్డే ఫార్మాట్ లోనూ ఐసీసీ సూపర్ లీగ్ పేరుతో జట్లు ఆడే మ్యాచ్ లకు పాయింట్లు కేటాయించి.. చివరికి 8 జట్లకు నేరుగా వరల్డ్ కప్ లో ఆడే అవకాశం ఇస్తున్న విషయం తెలిసిందే. ఓ టీమ్ గెలిస్తే 10 పాయింట్లు.. టై లేదా ఫలితం తేలకపోయినా, మ్యాచ్ రద్దయినా ఐదు పాయింట్లు ఇస్తారు. టాప్ 8లో లేని జట్లు క్వాలిఫయర్స్ లో ఆడాల్సి ఉంటుంది. అందులో టాప్ లో నిలిచే రెండు జట్లు వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తాయి.
క్వాలిఫయర్స్ ఆడబోయే టీమ్స్
వరల్డ్ కప్ కు అర్హత సాధించిన జట్లతోపాటు క్వాలిఫయర్స్ ఆడాల్సిన జట్ల జాబితాను కూడా ఐసీసీ ప్రకటించింది. ఈ జాబితాలో మాజీ ఛాంపియన్లు వెస్టిండీస్, శ్రీలంకతోపాటు జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఒమన్, నేపాల్, యూఎస్ఏ, యూఏఈ, ఐర్లాండ్ ఉన్నాయి. ఈ క్వాలిఫయర్స్ జూన్ 18 నుంచి జులై 9 వరకు జరగనున్నాయి.
నిజానికి సౌతాఫ్రికా కూడా ఇదే లిస్టులో ఉంటుందేమో అనిపించింది. అయితే వాళ్ల లక్కు బాగుండి.. బంగ్లాదేశ్ తో ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో సఫారీలు నేరుగా అర్హత సాధించారు. ఒకవేళ బంగ్లాదేశ్ పై ఐర్లాండ్ మూడు వన్డేల్లోనూ గెలిస్తే అర్హత సాధించేది. కానీ తొలి వన్డేనే రద్దు కావడం సౌతాఫ్రికాకు కలిసొచ్చింది.