Wasim Akram on Team India: ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ ఒక్క వరల్డ్‌కప్ గెలవలేదు.. ఏం లాభం: అక్రమ్
11 November 2022, 11:46 IST
- Wasim Akram on Team India: ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ ఒక్క టీ20 వరల్డ్‌కప్ గెలవలేదు.. ఏం లాభం అంటూ వసీం అక్రమ్ ప్రశ్నించాడు. ఇంగ్లండ్ చేతుల్లో ఇండియా ఓడిన తర్వాత విమర్శల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.
Wasim Akram; Rahul Dravid
Wasim Akram on Team India: ఇండియాపై సెమీఫైనల్లో వీర బాదుడు బాదిన ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్.. మ్యాచ్ తర్వాత చెప్పిన ఓ మాట చాలా మందిని ఆకర్షించింది. తాను ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్‌లో ఆడటం బాగా కలిసి వచ్చింది అని. కానీ దురదృష్టశాత్తూ బీసీసీఐ పాలసీ ప్రకారం ఇండియన్ ప్లేయర్స్‌కు ఆ అవకాశం లేదు. ఎవరైనా సరే మన ఐపీఎల్‌లో వచ్చి ఆడాల్సిందే తప్ప.. మన వాళ్లు మరో లీగ్‌లో ఆడటానికి వీల్లేదు.
నిజానికి మ్యాచ్ ముగిసిన తర్వాత కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. దీనిపై అతడు స్పందిస్తూ.. తమ సీజన్ పీక్‌లో ఉన్నప్పుడే ఈ లీగ్స్ జరుగుతాయని, దీంతో ఇండియన్ ప్లేయర్స్‌కు ఆ అవకాశం ఉండదని అన్నాడు. అయినా దీనిపై తుది నిర్ణయం బీసీసీఐదే అని చెప్పాడు. ఆ తర్వాత ఇదే ప్రశ్నను పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్‌ను అడిగితే అతడు వ్యంగ్యంగా స్పందించాడు.
ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఇండియన్ క్రికెట్ చాలా మెరుగైందని అంటారు.. మరి ఒక్క టీ20 వరల్డ్‌కప్ గెలవలేదేంటి అంటూ ప్రశ్నించాడు. "ఐపీఎల్ నుంచి ఇండియా లబ్ధి పొందుతుందని అందరూ అనుకున్నారు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైంది. ఇండియా చివరిసారి 2007లో టీ20 వరల్డ్‌కప్ గెలిచింది. కానీ ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఒక్క టీ20 వరల్డ్‌కప్ కూడా గెలవలేదు. ఇక ఏం లాభం మరి? ఇతర లీగ్స్‌లో ఆడటానికి అనుమతిస్తే అయినా ఇండియా ఆడే విధానం మారుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది" అని వసీం అక్రమ్ అన్నాడు.
నిజానికి ఇది న్యాయమైన ప్రశ్నే. ఐపీఎల్‌లో ఒక్క పాకిస్థాన్ తప్ప మిగతా అన్ని దేశాల ప్లేయర్స్ ఆడతారు. కానీ ఇండియన్ ప్లేయర్స్‌ను మాత్రం ఇతర లీగ్స్‌లో ఆడటానికి బీసీసీఐ అనుమతించదు. ఐపీఎల్‌లో ఆడటం ద్వారా ఇతర దేశాల ప్లేయర్స్ ఆటపరంగా, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. కానీ బిగ్ బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, సౌతాఫ్రికా లీగ్, యూఏఈ లీగ్‌లాంటి వాటిలో ఇండియన్ ప్లేయర్స్ ఆడకపోవడం కారణంగా మన వాళ్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి వరల్డ్‌కప్‌లలో ఓటముల తర్వాతే మన టీమ్ ఏం కోల్పోతోందో అర్థమవుతుంది.