Dravid Post Match Reaction: రోహిత్-విరాట్ భవితవ్యంపై ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
Dravid Post Match Reaction: టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ పరాజయం చెందిన అనంతరం విలేకరుల సమావేశంలో జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడారు. ఇందులో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Dravid Post Match Reaction: టీ20 వరల్డ్ కప్ రెండో సెమీస్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అటు బ్యాటింగ్‌లో పెద్దగా మెరుపులు లేకపోగా.. ఇటు బౌలింగ్‌లో అయితే దారుణంగా విఫలమైంది. ఫలితంగా భారీ పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తమ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన టీమ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా స్పందించారు. విదేశీ టీ20 లీగుల్లో భారత ఆటగాళ్లు ఆడితే గేమ్ బాగా మెరుగుపడుతుంది కదా? అనే ప్రశ్నను అడుగ్గా.. అలా చేస్తే దేశవాళీ టోర్నీలకు ముగింపు పలకడమే అవుతుందని ద్రవిడ్ స్పష్టం చేశారు.
"ఇతర ఆటగాళ్ల మాదిరిగా ఇక్కడకు వచ్చి టోర్నమెంట్ ఆడితే బాగానే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ భారత క్రికెట్‌కు ఇది చాలా కష్టం. ఈ టోర్నమెంట్‌లు చాలా వరకు మన సీజన్‌లో ఎక్కువగా జరుగుతాయి. ఫలితంగా ఇది మనకు సవాల్. మా ఆటగాళ్లలో చాలా మంది ఈ లీగుల్లో ఆడే అవకాశాలను కోల్పోతారు. అదీ కాకుండా ఆ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత బీసీసీఐకే ఉంది. విదేశీ లీగుల్లో ఆటగాళ్లను అనుమతిస్తే మన దేశవాళీ క్రికెట్ ఉందు. రంజీ ట్రోఫీకి చరమగీతం పలికినట్లే అవుతుంది" అని ద్రవిడ్ స్పష్టం చేశారు.
సీనియర్ ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20ల్లో ఇంకా కొనసాగించడంపై ప్రశ్నించగా.. ఇప్పుడే ఈ విషయంపై మాట్లాడటం తొందరాపాటే అవుతుందని బదులిచ్చారు. అందుకు ఇంకా చాలా సమయముందని అన్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనప్పటికీ.. విరాట్ కోహ్లీ(51), హార్దిక్ పాండ్య(63) అర్ధశతకాలతో జట్టును ఆదుకున్నారు. అనంతరం ఇంగ్లాండ్ 16 ఓవర్లలోనే వికెట్లేమి కోల్పోకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇంగ్లీష్ ఓపెనర్లు జాస్ బట్లర్(80), అలెక్స్ హేల్స్(86) అద్భుత అర్దశతకాలతో విజృంభించి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ 170 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వరల్డ్ కప్‌లో అదే అత్యధిక భాగస్వామ్యం.
సంబంధిత కథనం