India vs England Highlights: చేతులెత్తేసిన బౌలర్లు.. చిత్తు చిత్తుగా ఓడిన టీమిండియా-india vs england highlights bowlers failed miserably as india lose to england in semis ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs England Highlights: చేతులెత్తేసిన బౌలర్లు.. చిత్తు చిత్తుగా ఓడిన టీమిండియా

India vs England Highlights: చేతులెత్తేసిన బౌలర్లు.. చిత్తు చిత్తుగా ఓడిన టీమిండియా

Hari Prasad S HT Telugu
Nov 10, 2022 04:35 PM IST

India vs England Highlights: టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు. ఇంగ్లండ్‌ బ్యాటర్ల ధాటికి తలవంచారు. దీంతో పూర్తి ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో ఇండియాను చిత్తు చిత్తుగా ఓడించింది ఇంగ్లండ్‌. ఆదివారం జరగబోయే ఫైనల్లో పాకిస్థాన్ తో ఇంగ్లండ్ తలపడనుంది.

ఇండియా బౌలర్లను చితకబాదిన జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్
ఇండియా బౌలర్లను చితకబాదిన జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ (AFP)

India vs England Highlights: మరోసారి వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో ఇండియన్‌ టీమ్‌ చేతులెత్తేసింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో దారుణంగా విఫలమై ఏకంగా 10 వికెట్లతో తేడాతో చిత్తుగా ఓడింది. 169 రన్స్‌ టార్గెట్‌ను ఇంగ్లండ్‌ ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండానే మరో 4 ఓవర్లు మిగిలి ఉండగా చేజ్‌ చేయడం విశేషం. ఆ టీమ్‌ ఓపెనర్లు అలెక్స్‌ హేల్స్‌, జోస్‌ బట్లర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

భారత బౌలర్లు భువనేశ్వర్‌, షమి, అక్షర్‌ పటేల్‌, హార్దిక్ పాండ్యా, అశ్విన్‌, అర్ష్‌దీప్‌ సమష్టిగా విఫలమయ్యారు. బౌండరీలు, సిక్సర్ల మోత మోగించిన ఇంగ్లండ్‌ ఓపెనర్లు.. గల్లీ బౌలర్లను బాదినట్లు బాదేశారు. తొలి ఓవర్లోనే మూడు ఫోర్లతో మొదలైన పరుగుల ప్రవాహం.. గెలిచే వరకూ కొనసాగింది. అలెక్స్ హేల్స్ 47 బాల్స్ లో 86, బట్లర్ 49 బాల్స్ లో 80 రన్స్ చేశారు. హేల్స్ 7 సిక్స్ లు, 4 ఫోర్లు.. బట్లర్ 3 సిక్స్ లు 9 ఫోర్లు బాదారు.

ఆదివారం (నవంబర్ 13) పాకిస్థాన్ తో మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరగబోయే ఫైనల్లో ఇంగ్లండ్ తలపడనుంది.

చెలరేగిన హార్దిక్, విరాట్

అంతకుముందు హార్దిక్ పాండ్యా, విరాట్‌ కోహ్లి చెలరేగారు. హాఫ్‌ సెంచరీలతో టీమిండియాను ఆదుకున్నారు. ఈ ఇద్దరి జోరుతో ఇండియన్‌ టీమ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 రన్స్‌ చేసింది. విరాట్‌ 39 బాల్స్‌లో, హార్దిక్‌ 29 బాల్స్‌లో హాఫ్‌ సెంచరీలు చేయడం విశేషం. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 61 రన్స్‌ జోడించారు. విరాట్‌ 50 రన్స్‌ చేసి ఔటవగా.. హార్దిక్ 33 బాల్స్‌లోనే 63 రన్స్‌ చేసి చివరి బాల్‌కు హిట్‌ వికెట్‌గా ఔటయ్యాడు.

ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో హార్దిక్‌ విశ్వరూపం చూపించాడు. సామ్‌ కరన్‌ వేసిన ఆ ఓవర్లో వరుసగా 4, 6, 4 కొట్టి కేవలం 29 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు రిషబ్‌ పంత్‌ కూడా ఒక ఫోర్‌ కొట్టడంతో ఆ ఓవర్లో మొత్తం 20 పరుగులు వచ్చాయి. దీంతో సామ్‌ కరన్‌ 4 ఓవర్లలో 42 పరుగులు సమర్పించుకున్నాడు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (4) మరోసారి నిరాశ పరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ను చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 47 పరుగులు జోడించారు. రోహిత్ మంచి టచ్ లో కనిపించినా.. 27 రన్స్ చేసి జోర్డాన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి ఔటయ్యాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తనదైన స్టైల్లో చెలరేగినట్లే కనిపించాడు. స్టోక్స్ బౌలింగ్ లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. అయితే ఆ తర్వాత రషీద్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి 14 పరుగుల దగ్గరే ఔటయ్యాడు.

Whats_app_banner