తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Training: ఆసియా కప్ కోసం ట్రైనింగ్ మొదలుపెట్టిన విరాట్ కోహ్లి

Virat Kohli Training: ఆసియా కప్ కోసం ట్రైనింగ్ మొదలుపెట్టిన విరాట్ కోహ్లి

Hari Prasad S HT Telugu

11 August 2022, 16:45 IST

google News
    • Virat Kohli Training: ఇంగ్లండ్‌ టూర్‌ తర్వాత వెస్టిండీస్‌, జింబాబ్వే టూర్‌లకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లి ఆసియా కప్‌ కోసం మళ్లీ టీమ్‌లోకి వస్తున్నాడు. దీనికోసం అప్పుడే ట్రైనింగ్‌ మొదలుపెట్టాడు.
విరాట్ కోహ్లి ట్రైనింగ్
విరాట్ కోహ్లి ట్రైనింగ్ (Twitter)

విరాట్ కోహ్లి ట్రైనింగ్

న్యూఢిల్లీ: విరాట్‌ కోహ్లి ప్రస్తుతం ఫామ్‌లో లేడేమో కానీ.. ఇప్పటికీ టీమ్‌లో అందరి కంటే ఎక్కువ ఫిట్‌నెస్‌ కలిగిన క్రికెటర్‌. గత పదేళ్లుగా తన ఫిట్‌నెస్‌ కోసం కోహ్లి శ్రమిస్తున్న తీరు ఎంతోమందికి ఆదర్శం. టీమ్‌లోకి అడుగుపెట్టిన కొత్తలో ఎంతో బొద్దుగా కనిపించిన విరాట్.. ఆ తర్వాత నాన్‌వెజ్‌ వదిలేశాడు. జిమ్‌లో గంటల తరబడి చెమటోడ్చడం మొదలుపెట్టాడు. ప్రపంచంలోని ఫిటెస్ట్‌ అథ్లెట్లలో ఒకడిగా ఎదిగాడు.

విరాట్‌ ఫిట్‌నెస్‌ కోసం ఎంతలా శ్రమిస్తాడో గతంలో ఎన్నోసార్లు చూశాము. తాజాగా ఆసియా కప్‌ కోసం సిద్ధమవుతున్న విరాట్‌ ట్రైనింగ్‌ వీడియో వైరల్‌ అవుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో విరాట్ ఈ వీడియోను పోస్ట్‌ చేశాడు. ఆ వెంటనే నెటిజన్లు ఈ వీడియోను వైరల్‌గా మార్చేశారు. ఇండోర్‌ ఫెసిలిటీలో తన రన్నింగ్‌పై విరాట్‌ దృష్టిసారించడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.

ఆసియాకప్‌ కోసం ఫిట్‌గా ఉండటానికి అతడు చేస్తున్న ట్రైనింగ్‌ బాగానే ఉంది కానీ.. ఈ మెగా టోర్నీలో అతడు ఎలా ఆడతాడన్నదే ఆసక్తికరంగా మారింది. చాలా రోజులుగా ఫామ్‌లో లేని విరాట్‌.. ఐపీఎల్‌ తర్వాత తనకు వచ్చిన అతికొద్ది అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరోవైపు రెస్ట్‌ పేరుతో అతన్ని సెలక్టర్లు టీమ్‌ నుంచి పక్కన పెట్టారు.

ఇప్పుడు ఆసియా కప్‌లాంటి కీలకమైన టోర్నీ కోసం తిరిగి టీమ్‌లోకి తీసుకున్నారు. ఈ టోర్నీలో ఇండియా ఫేవరెట్స్‌గా బరిలోకి దిగుతున్నా.. దాయాది పాకిస్థాన్‌తో ముప్పు ఉందనడంలో సందేహం లేదు. బాబర్‌ ఆజం కెప్టెన్సీలోని పాక్‌ టీమ్‌ కూడా బలంగానే ఉంది. ఆ టీమ్‌తో ఈ నెల 28న జరగబోయే తొలి మ్యాచ్‌తో టీమిండియా ఆసియా కప్‌ వేట మొదలవనుంది.

ఈ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్‌తోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌, మరో క్వాలిఫయర్‌ ఆడనున్నాయి. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు టీ20 ఫార్మాట్‌లోనే జరగనున్న ఆసియా కప్‌ ఆసక్తి రేపుతోంది. ఇండియా, పాకిస్థాన్‌లాంటి టీమ్స్‌ తమ బలాబలాలను బేరీజు వేసుకోవడానికి ఈ టోర్నీ ఉపయోగపడనుంది.

తదుపరి వ్యాసం