Asia cup 2022 india squad: ఆసియా కప్ కోసం భారత జట్టు ప్రకటన.. బుమ్రా దూరం
Asia cup 2022 india squad: ఈ నెలాఖరు నుంచి జరగనున్న ఆసియా కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పునరాగమనం చేస్తుండగా.. బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడు.
Asia cup 2022 india squad: విదేశాల్లో వరుస పెట్టి సిరీస్‌లను గెలుస్తూ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ గడ్డపై అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న రోహిత్ సేన.. మరో ప్రతిష్టాత్మక టోర్నీకి సమాయత్తమైంది.
అదే ఆసియా కప్. అక్టోబరులో టీ20 ప్రపంచకప్ జరగనున్న వేళ.. ఆసియా కప్‌లోనూ సత్తా చాటి పొట్టి ప్రపంచకప్‌లో అదిరిపోయేలా ఎంట్రీ ఇవ్వాలని తహతహలాడుతోంది. తాజాగా ఆసియా కప్ కోసం ఆడేందుకు భారత్ జట్టును ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 మంది ఆటగాళ్లకు అవకాశమిచ్చింది. ఈ టోర్నీకి జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడు. గాయం కారణంగా అతడికి విశ్రాంతి కల్పించారు.
ఇదే సమయంలో గాయం, కోవిడ్-19 ఇలా వరుస దెబ్బలతో సతమత మవుతున్న భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఈ టోర్నీలో పునరాగమనం చేయనున్నాడు. రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ లాంటి ఇద్దరు వికెట్ కీపర్లు, ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో 15 సభ్యుల జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ స్పినర్లలో రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, రవిభిష్ణోయ్‌కు కూడా అవకాశం కల్పించింది. వీరు కాకుండా హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా ఇద్దరు ఆల్ రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ కలిపి జట్టుకు రెండు బ్యాటింగ్ ఆప్షన్లు ఉన్నాయి.
గాయంతో బుమ్రా దూరమైన వేళ.. భువనేశ్వర్ కుమార్ టీమిండియా పేస్ దళాన్ని నడిపించనున్నాడు. యువ బౌలర్లయిన ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్‌తో పేస్ బలాన్ని పెంచనున్నాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిన హర్షల్ పటేల్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్‌ను స్టాండ్ బై ఆటగాళ్ల మాదిరిగా జట్టులోకి తీసుకున్నారు.
ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఆసియా కప్ కోసం ఈ భారత జట్టును ప్రకటించింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ 15వ ఎడిషన్ టోర్నమెంట్ యూఏఈ వేదికగా ఆరుజట్లతో జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఇప్పటివరకు అత్యధిక సార్లు ఆసియా కప్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఏడు సార్లు ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. గత ఎడిషన్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించగా.. ఈ సారి మాత్రం టీ20 ఫార్మాట్‌లో జరగనుంది.
"మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. భారత్, పాకిస్థాన్, అర్హత సాధించిన జట్టు గ్రూప్-ఏలో ఉండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ గ్రూప్-బీలో పోటీ పడనునున్నాయి. గ్రూపులోని ప్రతి జట్టు ఇంకో జట్టుతో ఓ సారి మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి సూపర్-4 రౌండుకు చేరుకుంటాయి. సూపర్ 4 నుంచి టాప్-2 జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి." అని బీసీసీఐ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.
Asia cup 2022 india squad: ఆసియా కప్ లో ఆడనున్న భారత జట్టు..
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, రవి భిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్హదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్.
సంబంధిత కథనం