Virat Kohli: ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్స్‌లో విరాట్ కోహ్లి ఒకడు: డివిలియర్స్
22 August 2022, 13:39 IST
- Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి అండగా నిలిచాడు అతని బెస్ట్ ఫ్రెండ్, సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. అంతేకాదు క్రికెట్‌లోని ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్స్‌లో అతడూ ఒకడని అన్నాడు.
ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ: ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై చర్చ చాలా రోజులుగా నడుస్తూనే ఉంది. అయితే కొన్ని రోజులుగా అతడు టీమ్‌కు దూరంగా ఉండటం వల్ల ఆగిపోయిన చర్చ.. ఇప్పుడు ఆసియా కప్ దగ్గరపడటంతో మరోసారి మొదలైంది. ఇప్పుడతని బెస్ట్ ఫ్రెండ్, ఆర్సీబీ మాజీ టీమ్‌మేట్ ఏబీ డివిలియర్స్ కూడా కోహ్లి ఫామ్‌పై స్పందించాడు.
ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. "ఇప్పటి వరకూ క్రికెట్ ఆడిన గ్రేటెస్ట్ ప్లేయర్స్‌లో విరాట్ ఒకడు. ఫామ్ తాత్కాలికం. క్లాస్ శాశ్వతం. విరాట్ ఇప్పటికీ వరల్డ్‌క్లాస్ ప్లేయరే. విరాట్, నేను రెగ్యులర్‌గా కాంటాక్ట్‌లో ఉంటాం. మేమిద్దరం ఫ్రెండ్స్. ఇలాంటి కష్ట సమయంలో హార్డ్ వర్క్ ప్రాముఖ్యత ఏంటో నేను అతనికి చెప్పాల్సిన అవసరం లేదు" అని డివిలియర్స్ అన్నాడు.
ఇక వన్డే క్రికెట్ తెరమరుగు అవుతుందన్న చర్చపైనా ఏబీ స్పందించాడు. టీ20 క్రికెట్ పురోగతి సాధిస్తూనే ఉంటుందని, దీనివల్ల ఇతర ఫార్మాట్లకు ముప్పు తప్పదని అతడు అనడం గమనార్హం. ట్రైసిరీస్‌లాంటివి ఏమైనా వన్డే క్రికెట్‌ను బతికిస్తాయా అని అడిగితే.. దాని ప్రభావం తక్కువే అని అన్నాడు. ఆదాయం బాగా ఉన్నంత వరకూ ఇంటర్నేషనల్ క్రికెట్ ఉంటుందని, అయితే క్రికెట్ పరిణామంలో ఫ్రాంఛైజీ క్రికెట్ ప్రముఖ పాత్ర పోషించడం మాత్రం ఖాయమని ఏబీ అభిప్రాయపడ్డాడు.
ఇక ఈ మధ్య ఇండియన్ ప్లేయర్స్ సూర్యకుమార్‌ను చూస్తుంటే కాస్త డివిలియర్స్‌లాగా కనిపిస్తున్నాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. దీనిపై ఏబీ స్పందించాడు. "అతడో మంచి ప్లేయర్‌లాగా కనిపిస్తున్నాడు. అతని బ్యాటింగ్ నేను ఎంజాయ్ చేస్తాను. ప్రతి ప్లేయర్‌కు తానేంటో నిరూపించుకునేందుకు అవకాశం ఉంటుంది" అని అన్నాడు.