Ashes Series.. ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?
24 January 2022, 20:40 IST
- Ashes Series: 1882లో తొలిసారి యాషెస్ సిరీస్ జరిగింది. ప్రతి రెండేళ్లకోసారి వచ్చినప్పుడల్లా క్రికెట్ ప్రపంచంలో చర్చ జరుగుతూనే ఉంటుంది. యాషెస్ సిరీస్‌కు అసలు ఆ పేరు ఎలా వచ్చింది? యాషెస్ సిరీస్ అర్న్ (ఒక కలశంలాంటి పాత్ర)లో ఏముంటుంది? ఈ సిరీస్ గురించి అభిమానులకు తెలియని ఆసక్తికర విషయాలు..
యాషెస్ ట్రోఫీతో అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్
క్రికెట్‌లో తరచూ ఓ చర్చ జరుగుతుంది. అది Ashes Series గొప్పదా లేదంటే ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగే సిరీస్ గొప్పదా అని. మన దాయాదుల మధ్య దేశ విభజన తర్వాత సహజంగానే ఉన్న వైరాన్ని క్రికెట్‌కూ ఆపాదించి ఇండోపాక్ మ్యాచ్‌లను చాలా గొప్పగా చూస్తుంటాం. కానీ క్రికెట్‌తోనే మొదలైన వైరం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలది. అప్పుడెప్పుడో 1882లో తొలిసారి జరిగిన ఈ యాషెస్ సిరీస్.. ప్రతి రెండేళ్లకోసారి వచ్చినప్పుడల్లా దాని గురించి క్రికెట్ ప్రపంచంలో చర్చ జరుగుతూనే ఉంటుంది.
యాషెస్ సిరీస్‌కు అసలు ఆ పేరు ఎలా వచ్చింది? యాషెస్ సిరీస్ అర్న్ (ఒక కలశంలాంటి పాత్ర)లో ఏముంటుంది? అని ఇప్పటికే చాలాసార్లు మీరు చదివే ఉంటారు. అయితే ఈ ప్రతిష్టాత్మక సిరీస్ గురించి ఇప్పటికీ క్రికెట్ అభిమానులకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి.
తొలి సిరీస్ 1882లో..
- యాషెస్ తొలి సిరీస్ 1882లో జరగగా.. ఇంగ్లండ్ 2-1తో గెలిచింది. ఒక్కో యాషెస్ సిరీస్‌లో సాధారణంగా 5 టెస్టులు ఉంటాయి. 18 నెలల నుంచి 30 నెలల గ్యాప్‌లో ఈ సిరీస్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఇంగ్లండ్, మరోసారి ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తుంది.
- ఇప్పటి వరకూ చరిత్రలో మొత్తం 330 యాషెస్ టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 134 టెస్టులు, ఇంగ్లండ్ 106 టెస్టులు గెలవగా.. 90 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
- ఇక 2019 వరకూ మొత్తం 71 యాషెస్ సిరీస్ జరిగితే.. అందులో 33 ఆస్ట్రేలియా, 32 ఇంగ్లండ్ గెలిచాయి. మరో ఆరు డ్రాగా ముగిశాయి.
- యాషెస్ సిరీస్‌లో రెండుసార్లు ఇంగ్లండ్ ఫాలోఆన్ ఆడుతూ విజయం సాధించడం విశేషం. 1894లో తొలిసారి సిడ్నీ టెస్ట్‌లో ఇలా జరగగా.. 1981లో లీడ్స్‌లో జరిగిన టెస్ట్‌లోనూ ఫాలో ఆన్ ఆడిన తర్వాత కూడా ఇంగ్లండ్ గెలిచింది.
- యాషెస్‌లో 1932-33 సిరీస్‌కు బాడీలైన్ సిరీస్‌గా పేరుంది. ఆ సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ శరీరాలనే లక్ష్యంగా చేసుకొని ఇంగ్లండ్ బౌలర్లు బంతులు విసరడంతో మొత్తం 11 మందిలో ఏడుగురు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు.
ఎప్పుడూ అవే వేదికలు
- యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో ఎప్పుడూ ఒకే వేదికలు ఉంటాయి. ఇంగ్లండ్‌లో అయితే ఓల్డ్ ట్రాఫోర్డ్, ద ఓవల్, లార్డ్స్, ట్రెంట్ బ్రిడ్జ్, హెడింగ్లీ, ఎడ్‌బాస్టన్ ఉపయోగించగా.. ఆస్ట్రేలియాలో గబ్బా, ఎంసీజీ, అడిలైడ్ ఓవల్, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, వాకా గ్రౌండ్‌లు ఉపయోగిస్తారు.
- యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్ జిమ్ లేకర్ సృష్టించిన రికార్డు ఇక ఆ సిరీస్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందేమో. 1956 సిరీస్‌లోని ఓ మ్యాచ్ ఒకే ఇన్నింగ్స్‌లో లేకర్ పది వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో మొత్తం 19 వికెట్లు తీసిన లేకర్ రికార్డు ఇప్పటికీ టెస్ట్, యాషెస్ చరిత్రలో అలా నిలిచిపోయింది.
- నిజానికి యాషెస్ సిరీస్ గెలిచిన వారికి ఇచ్చే అర్న్ ట్రోఫీ 1998-99 సిరీస్‌లోనే పరిచయం చేశారు. వాటర్‌ఫోర్డ్ క్రిస్టల్‌తో చేసిన అర్న్ ఆకారంలో ఉన్న ట్రోఫీని ఆ సిరీస్ నుంచే ఇస్తున్నారు.
- ఇప్పటి వరకూ యాషెస్‌లో ఇంగ్లండ్ ఎప్పుడూ ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేయలేదు. 1978-79లో 5-1తో గెలవడమే ఇంగ్లండ్ అత్యుత్తమ ప్రదర్శన.
- ఇక 1948 యాషెస్ సిరీస్‌కు వెళ్లిన ఆస్ట్రేలియా టీమ్‌కు ది ఇన్విన్సిబుల్స్ (అజేయులు)గా పేరుంది. ఆ సిరీస్‌లో బ్రాడ్‌మన్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా టీమ్ 4-0 తో విజయం సాధించింది. ఇదే ఇప్పటి వరకూ బెస్ట్ ఆస్ట్రేలియా టీమ్ అని క్రికెట్ మేధావులు చాలా మంది చెబుతారు.
అత్యధిక పరుగుల రికార్డు బ్రాడ్‌మన్ దే
- యాషెస్ హిస్టరీలో అత్యధిక పరుగుల రికార్డు డాన్ బ్రాడ్‌మన్ (5028) పేరిటే ఉంది. ఆ తర్వాత సర్ జాక్ హాబ్స్, అలన్ బోర్డర్‌లు అతని కంటే ఎక్కువ యాషెస్ టెస్టులు ఆడినా.. ఆ రికార్డుకు చేరువలోకి కూడా వెళ్లలేకపోయారు. హాబ్స్ 3636 పరుగులు చేయగా.. బోర్డర్ 3222 పరుగులు చేశాడు.
- పురుషులకే కాదు మహిళలకూ యాషెస్ సిరీస్ ఉంది. నిజానికి 1934 నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మహిళల టీమ్స్ తలపడుతున్నా.. 1998 వరకూ ఈ సిరీస్‌ను అధికారికంగా యాషెస్‌గా పిలిచేవారు కాదు. వీళ్ల సిరీస్ కూడా రెండేళ్లకోసారి జరుగుతుంది. అయితే 2013 నుంచి టూర్‌లో భాగంగా జరిగే టీ20, వన్డే సిరీస్‌ల ఫలితాలను కూడా చూసి మహిళల యాషెస్ సిరీస్ విజేతను తేలుస్తున్నారు.
- యాషెస్‌లో అసలుదిగా భావించే చిన్న అర్న్.. ఎప్పటికీ ఇంగ్లండ్‌లోని ఎంసీసీ మ్యూజియంలోనే ఉంటుంది. ఇప్పటి వరకూ కేవలం రెండుసార్లు మాత్రమే ఈ అర్న్ ఆస్ట్రేలియా వెళ్లింది. 1988లో ఒకసారి, 2006లో మరోసారి మాత్రమే ఇది ఆస్ట్రేలియాకు వెళ్లింది.