తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఎందుకు లేదు? 2028లో ఛాన్స్‌ వస్తుందా?

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఎందుకు లేదు? 2028లో ఛాన్స్‌ వస్తుందా?

Hari Prasad S HT Telugu

24 January 2022, 20:32 IST

google News
    • Olympics.. ఒలింపిక్స్‌ విశ్వక్రీడా వేదిక. ఫుట్‌బాల్‌, హాకీ, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌లాంటి ఎన్నో పాపులర్‌ స్పోర్ట్స్‌కు అవకాశం దక్కినా.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ ఉన్న క్రికెట్‌ మాత్రం ఒలింపిక్స్‌లో లేదు. నిజానికి ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఎప్పుడూ లేదా అంటే ఉంది.
టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీతో ఆస్ట్రేలియా టీమ్‌
టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీతో ఆస్ట్రేలియా టీమ్‌ (AFP)

టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీతో ఆస్ట్రేలియా టీమ్‌

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఎందుకు లేదు? ఈ ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా కాదు కానీ.. కనీసం క్రికెట్‌ను పిచ్చిగా అభిమానించే ఇండియాలాంటి దేశాల్లో మాత్రం చాలా మంది అభిమానులను వేధిస్తూ ఉంటుంది. ఒలింపిక్స్‌ విశ్వక్రీడా వేదిక. ఇందులో ఫుట్‌బాల్‌, హాకీ, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌లాంటి ఎన్నో పాపులర్‌ స్పోర్ట్స్‌కు అవకాశం దక్కినా.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ ఉన్న క్రికెట్‌ మాత్రం లేదు.  ఒక్కసారి మాత్రమే ఈ మెగా ఈవెంట్‌లో జెంటిల్మెన్‌ గేమ్‌కు అవకాశం దక్కింది. అది కూడా 1900లో పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌ అవి. 

అప్పుడు ఆతిథ్య ఫ్రాన్స్‌ను ఓడించి గ్రేట్‌ బ్రిటన్‌ గోల్డ్ మెడల్‌ గెలిచింది. ఇక ఆ తర్వాత క్రికెట్‌ జాడే లేదు. దీనికి క్రికెట్‌ బోర్డుల అనాసక్తితోపాటు ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్యే ఇంటర్నేషనల్ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఒలింపిక్స్‌ కమిటీని నియమించడం చూస్తుంటే.. కనీసం 2028 ఒలింపిక్స్‌లో అయినా క్రికెట్‌ను చూసే అదృష్టం అభిమానులకు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఇన్నాళ్లూ క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో ఎందుకు చేర్చలేదు? దీనికి క్రికెట్‌కు ఉన్న కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు, ఈ ఆటను నిర్వహించడంలో ఉన్న సవాళ్లు కారణమయ్యాయి.

క్రికెట్‌.. టైమ్‌తోనే ప్రాబ్లం

మిగతా క్రీడలతో పోలిస్తే క్రికెట్‌ ఓ ప్రత్యేకమైన ఆట. ప్రతి ఆటలోనూ ఒకే సమయంలో ప్రత్యర్థులిద్దరూ గెలుపోటముల కోసం పోరాడతారు. కానీ క్రికెట్‌లో మాత్రం ఒకసారి ఒక టీమ్‌ ఆడుతుంది. వాళ్లు విధించిన లక్ష్యాన్ని ఛేదించడానికి మరో టీమ్‌ మరోసారి ఆడాల్సి వస్తుంది. దీంతో క్రికెట్‌ ఆడటానికి ఎక్కువ సమయం పడుతుంది. సాధారణంగా ఒలింపిక్స్‌లో జరిగే ఆటలన్నీ.. చాలా వేగంగా ముగిసిసోయేవే. గరిష్ఠంగా గంటర్నర, రెండు గంటల్లోపే చాలా వరకూ స్పోర్ట్స్‌లో ఫలితాలు వచ్చేస్తాయి. 

కానీ క్రికెట్‌లో ఎంతో పాపులర్‌ అయిన టీ20 క్రికెట్‌ ఆడాలన్నా.. కనీసం మూడు గంటలకుపైనే టైమ్‌ పడుతుంది. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఆడాలంటే ఈ ఫార్మాట్‌ ఒక్కటే మార్గం. ఈ ఫార్మాట్‌ను ఒలింపిక్స్‌లో పెడితే.. రెండేళ్లకోసారి జరిగే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సి వస్తుంది. వరల్డ్‌కప్‌ చాలా కాసులు కురిపించే టోర్నీ. అది వదిలేసి పైసా విదిల్చని ఒలింపిక్స్‌లో ఈ ఫార్మాట్‌ను పెడితే తమకు నష్టమే అని ఐసీసీ భావిస్తోంది. అలాగని వన్డే లేదా టెస్టులు నిర్వహించే అవకాశమే లేదు.

క్రికెట్‌కు గ్రౌండ్లు ఏవి?

ఇప్పటి వరకూ ముగిసిపోయిన ఐదు ఒలింపిక్స్‌, రాబోయే రెండు ఒలింపిక్స్‌ నిర్వహించే దేశాలు చూస్తే అందులో ఉన్న అతిపెద్ద సమస్య మీకు అర్థమవుతుంది. గత ఐదు ఒలింపిక్స్‌ ఏథెన్స్‌, బీజింగ్‌, లండన్, రియో డిజనీరో, టోక్యోల్లో జరిగాయి. ఇందులో ఒక్క లండన్ మినహా మరెక్కడా క్రికెట్‌కు ఆదరణ లేదు. ఆడటానికి గ్రౌండ్లూ లేవు. 

ఇక రాబోయే పారిస్‌, లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లోనూ ఇదే పరిస్థితి. ఒలింపిక్స్‌ ఆతిథ్యం కోసం దేశాలు ఎంతో ముందుగానే పోటీ పడతాయి. ఎన్నో ఏళ్లు, డబ్బు, శ్రమను స్టేడియాల నిర్మాణం కోసం వెచ్చిస్తాయి. క్రికెట్‌కు ఏమాత్రం ఆదరణ లేని ఇలాంటి ఆతిథ్య దేశాలు.. ప్రత్యేకంగా క్రికెట్‌ స్టేడియాలు నిర్మించడానికి ఇష్టపడవు.

ఒలింపిక్స్‌తో లాభమేంటి?

ఈ మెగా ఈవెంట్‌లో క్రికెట్‌ కోసం అభిమానులు ఆరాటపడుతున్నా.. ఆయా బోర్డులు మాత్రం ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన మన ఇండియన్‌ క్రికెట్‌ బోర్డు బీసీసీఐ ఇప్పటి వరకూ ఒలింపిక్స్‌ దిశగా ఆలోచన చేయకపోవడానికి ఇదే ప్రధాన కారణం. ముఖ్యంగా ఐపీఎల్‌లాంటి కాసులు కురిపించే టోర్నీని ఒకవేళ ఒలింపిక్స్‌ కోసం త్యాగం చేయాల్సి వస్తే.. బీసీసీఐ కచ్చితంగా నో అనే అంటుంది. 

ఇక ఒలింపిక్స్‌లో క్రికెట్‌ భాగమైతే.. ఇప్పటి వరకూ పూర్తి స్వతంత్రంగా పని చేసిన బీసీసీఐ ఎంతో కొంత ఒలింపిక్‌ కమిటీ కిందికి వెళ్లాల్సి వస్తుంది. ఇది క్రికెట్‌ పెద్దలకు అస్సలు ఇష్టం లేదు. క్రికెట్‌లో ఏ పని జరగాలన్నా.. దానికి పెద్దన్నలాంటి బీసీసీఐ మద్దతు ఉంటేనే ఐసీసీ కూడా అడుగు ముందుకేస్తుంది. అందుకే ఇన్నాళ్లూ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ లేకపోవడానికి బీసీసీఐ అనాసక్తే ముఖ్య కారణంగా చెప్పొచ్చు.

క్రికెట్‌కు అర్హత ఉన్నా..

ఒలింపిక్స్‌ ఆటగా ఎంపిక కావడానికి క్రికెట్‌కు అర్హత ఉంది. ఈ ఆటను వందకుపైగా దేశాల్లో ఆడతారు. ఐసీసీలో 104 సభ్యదేశాలు ఉన్నాయి. అయితే పది నుంచి 15 దేశాలు మాత్రమే రెగ్యులర్‌గా క్రికెట్‌లో కనిపిస్తాయి. మిగతావన్నీ.. ఏదో పేరుకే ఉన్నాయంటే ఉన్నాయి. అటు ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీలో ఉన్న సభ్య దేశాల్లోనూ చాలా వరకూ క్రికెట్‌తో పెద్దగా సంబంధం లేనివే. దీంతో ఈ ఆటను ఒలింపిక్స్‌లో చేర్చడానికి ఎవరూ సీరియస్‌గా ప్రయత్నించలేదు.

తదుపరి వ్యాసం