తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cricket Rules | క్రికెట్‌లో ఇలాంటి వింత రూల్స్ ఉన్నాయని మీకు తెలుసా?

Cricket Rules | క్రికెట్‌లో ఇలాంటి వింత రూల్స్ ఉన్నాయని మీకు తెలుసా?

Hari Prasad S HT Telugu

24 January 2022, 21:26 IST

google News
    • మిగతా గేమ్స్‌ గురించి తెలిసినా తెలియకపోయినా.. క్రికెట్‌ గురించి అన్నీ తెలుసు అని చాలా మంది ఈ గేమ్‌ అభిమానులు అనుకుంటారు. అయితే ఎన్నో ఏళ్లుగా క్రికెట్‌ను ఫాలో అవుతున్నా చాలా తక్కువ మందికే తెలిసిన క్రికెట్‌ రూల్స్‌ కొన్ని ఉన్నాయి.
ఎన్నో వింత రూల్స్‌కు కేరాఫ్‌ క్రికెట్‌
ఎన్నో వింత రూల్స్‌కు కేరాఫ్‌ క్రికెట్‌ (PTI)

ఎన్నో వింత రూల్స్‌కు కేరాఫ్‌ క్రికెట్‌

Cricket Rules.. ఇండియాలో క్రికెట్‌ను ఓ మతంగా చూస్తారు. క్రికెట్‌ గురించి అన్నీ తెలుసు అని చాలా మంది ఈ గేమ్‌ అభిమానులు అనుకుంటారు. అయితే ఎన్నో ఏళ్లుగా క్రికెట్‌ను ఫాలో అవుతున్నా చాలా తక్కువ మందికే తెలిసిన క్రికెట్‌ రూల్స్‌ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించే మనం చెప్పుకోబోతున్నాం.

అప్పీల్ చేయకుంటే ఔట్‌ ఇవ్వలేరు

కచ్చితంగా ఔటో కాదో తెలియకపోయినా.. ఫీల్డింగ్‌ సైడ్‌ తరచూ అప్పీల్‌ చేస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే క్రికెట్‌లో ఓ వింత రూల్‌ ఉంది. ఫీల్డింగ్‌ అప్పీల్‌ చేయనంత వరకూ ఓ అంపైర్‌.. బ్యాట్స్‌మన్‌ను ఔట్‌ ఇవ్వడానికి వీల్లేదు. అది కచ్చితంగా ఔటే అని అంపైర్‌ భావించినా.. ఫీల్డింగ్‌ టీమ్‌ అప్పీల్‌ చేస్తేనే ఔటివ్వాలి. ఇది చాలా అరుదుగా జరిగే సంఘటనే అనుకోండి. అయితే ఆ మధ్య ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో అంపైర్‌ క్రిస్‌ గఫానీ చెటేశ్వర్‌ పుజారాను ఔటిచ్చినట్లుగానే వేలు పైకెత్తినా.. ఆ తర్వాత ఫీల్డింగ్‌ సైడ్‌ నుంచి ఎలాంటి అప్పీల్‌ లేకపోవడంతో తన తలపై ఉన్న టోపీని సరిచేసుకుంటున్నట్లుగా కవర్‌ చేసుకున్నాడు.

బాల్‌ను బౌండరీ అవతలికి తంతే పెనాల్టీ

ఓ ఫీల్డర్‌ ఉద్దేశపూర్వకంగా బాల్‌ను బౌండరీ అవతలికి తంతే.. ఫీల్డింగ్‌ టీమ్‌కు ఐదు పరుగులు పెనాల్టీ వేస్తారన్న విషయం మీకు తెలుసా? పొరపాటున అలా జరిగితే పెనాల్టీ ఉండదు కానీ.. కావాలని చేస్తే మాత్రం ఫీల్డింగ్‌ టీమ్‌కు దెబ్బే. సౌతాఫ్రికాతో జరిగిన ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో ఇండియన్‌ ఫీల్డర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఇలాగే బంతిని కావాలని బౌండరీ బయటకు తన్నినందుకు టీమ్‌కు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు.

మూడు నిమిషాల రూల్‌

ఓ బ్యాట్స్‌మన్‌ ఔటైన తర్వాత అతని స్థానంలో వచ్చే మరో బ్యాట్స్‌మన్‌ మూడు నిమిషాల్లోపే క్రీజులో అడుగుపెట్టాలి. అలా రాకపోతే టైమ్డ్‌ ఔట్‌ పేరుతో బ్యాట్స్‌మన్‌ను ఔట్‌గా ప్రకటిస్తారు. అందుకే తర్వాత క్రీజులోకి రావాల్సిన బ్యాట్స్‌మన్‌ ప్యాడ్లు కట్టుకొని, హెల్మెట్‌ పెట్టుకొని సిద్ధంగా ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఇప్పటి వరకూ క్రికెట్‌లో ఇలా ఔటైన బ్యాట్స్‌మన్‌ ఎవరూ లేరు. 

క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఒకసారి దీనికి చాలా దగ్గరగా వచ్చాడు. 2006-07లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ ముగిసే ముందు 18 నిమిషాల పాటు సచిన్‌ స్థానంలో మరో ప్లేయర్‌ ఫీల్డింగ్‌ చేశాడు. దీంతో ఇండియా ఇన్నింగ్స్ ప్రారంభమైన 18 నిమిషాల తర్వాత గానీ సచిన్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాదు. అయితే ఇండియా ఇన్నింగ్స్‌ ప్రారంభమైన 10 నిమిషాల్లోపే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే రూల్‌ ప్రకారం సచిన్‌ బ్యాటింగ్‌కు రాలేకపోయాడు. 6 నిమిషాల తర్వాత గంగూలీ వచ్చాడు. కానీ ప్రత్యర్థి కెప్టెన్‌ అప్పీల్‌ చేయకపోవడంతో అంపైర్లు ఆ బ్యాట్స్‌మన్‌ను ఔట్‌గా ప్రకటించలేదు.

బెయిల్స్‌ లేకపోయినా నో ప్రాబ్లమ్‌

క్రికెట్‌లో స్టంప్స్‌ మీద ఉండే బెయిల్స్‌కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బంతి వికెట్లను తగిలినా బెయిల్స్ కదిలితేనే అంపైర్లు ఔట్‌గా ప్రకటిస్తారు. అందుకే స్టంప్స్‌పై కచ్చితంగా బెయిల్స్‌ ఉండాలి. అయితే క్రికెట్‌లోని 8.5 రూల్‌ ప్రకారం.. ఇద్దరు అంపైర్లు అవసరమని భావిస్తే బెయిల్స్‌ లేకుండా కూడా క్రికెట్‌ ఆడొచ్చు. 

2019లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. భారీగా ఈదురు గాలులు వీస్తుండటంతో పదేపదే బెయిల్స్ కిందపడిపోతుండటంతో అంపైర్లు వాటిని తీసేసి మ్యాచ్‌ను కొనసాగించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఔటిస్తారన్న సందేహం కలగవచ్చు. దానికి క్రికెట్‌ రూల్‌ బుక్‌లోని 29.4 నిబంధన ప్రకారం.. బెయిల్స్ లేని సమయంలో అది ఔటా కాదా అన్నది అంపైర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

అనుమతి లేకుండా ఫీల్డ్‌లోకి వస్తే పెనాల్టీ

ఈ రూల్‌ కూడా క్రికెట్‌లో ఉందన్న విషయం చాలా మంది తెలియదు. చాలాసార్లు ఫీల్డర్లు గాయం కారణంగానో, మరో కారణంతోనో ఫీల్డ్‌ బయటకు వెళ్తుంటారు. వాళ్ల స్థానంలో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ వస్తారు. అయితే బయటకు వెళ్లిన ఫీల్డర్‌ తిరిగి అంపైర్‌ అనుమతి తీసుకొని మాత్రమే ఫీల్డ్‌లో అడుగుపెట్టాలి. అందుకే చాలాసార్లు బయటకు వెళ్లిన ఫీల్డర్‌ ఓవర్‌ పూర్తయిన తర్వాతనో లేక బాల్‌ డెడ్‌ అయిన తర్వాత ఫీల్డ్‌లోకి వస్తారు. అంపైర్‌ అనుమతి లేకుండా ఆట జరుగుతున్న సమయంలో ఫీల్డ్‌లోకి వచ్చి సదరు ఫీల్డర్‌ ఆ బాల్‌ను ఆపితే.. ఫీల్డింగ్‌ టీమ్‌కు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు.

ఫీల్డర్‌ గ్లోవ్స్‌ వేసుకుంటే పెనాల్టీ

క్రికెట్‌లో ఫీల్డింగ్‌ టీమ్‌ తరఫున కేవలం వికెట్‌ కీపర్‌ మాత్రమే గ్లోవ్స్‌ వేసుకోవడం మనం చూస్తుంటాం. కానీ ఓ ఫీల్డర్‌ కూడా గ్లోవ్స్‌ వేసుకుంటే ఏం జరుగుతుంది? వికెట్‌ కీపింగ్‌ చేసే ఉద్దేశం లేకుండా కీపర్‌ గ్లోవ్స్‌ తీసుకొని ఓ ఫీల్డర్‌ వేసుకుంటే బ్యాటింగ్‌ టీమ్‌కు ఐదు పరుగులు ఇస్తారు. ఓసారి ఆస్ట్రేలియా ఫీల్డర్‌ మాట్‌ రెన్షా ఇలాగే కీపర్‌ గ్లోవ్స్‌ వేసుకున్నందుకు అంపైర్లు 5 పరుగుల పెనాల్టీ విధించారు. బాల్‌ చేసే క్రమంలో కీపర్‌ తన గ్లోవ్‌ను పడేసి వెళ్లిన సమయంలో.. రెన్షా సరదాగా దానిని వేసుకున్నాడు. దీంతో అంపైర్లు పెనాల్టీ విధించారు.

ఎల్బీడబ్ల్యూ అంటే బాడీ బిఫోర్‌ వికెట్‌

క్రికెట్‌లో ఎల్బీడబ్ల్యూ అంటే ఏంటి? మనకు తెలిసింది లెగ్‌ బిఫోర్‌ వికెట్‌. కానీ ఇందులో లెగ్‌ అసలు అర్థం కేవలం కాలు మాత్రమే కాదు.. మీ బాడీలో ఏ పార్ట్‌ అయినా సరే. స్టంప్స్‌ను తగులుతుందనుకున్న బాల్‌ బ్యాట్స్‌మన్‌లోని ఏ భాగానికి తగిలినా అంపైర్‌ ఔటివ్వవచ్చు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఓసారి సచిన్‌ భుజానికి బాల్‌ తగిలితే అంపైర్‌ డారెల్‌ హెయిర్‌ ఔట్‌గా ఇచ్చిన విషయం తెలుసు కదా. బౌన్సర్‌ తప్పించుకోవడానికి సచిన్‌ కిందికి వంగినప్పుడు అది అతని భుజానికి తగిలింది. దీనిని షౌల్డర్‌ బిఫోర్‌ వికెట్‌ అంటూ అప్పట్లో మీడియా అంతా విమర్శలు గుప్పించింది. కానీ రూల్‌ ప్రకారం దీనిని ఔట్‌గా ఇచ్చే హక్కు అంపైర్‌కు ఉంటుంది. అయితే నైతికంగా ఆలోచిస్తే మాత్రం ఇలా చేయడం తప్పనిపించవచ్చు.

స్ట్రైకర్‌ ఎండ్‌ వైపు బౌలర్‌ బాల్‌ త్రో చేస్తే నోబాల్‌

ఇదొక రూల్‌ క్రికెట్‌లో ఉందని చాలా మందికి తెలియదు. సాధారణంగా ఓ బౌలర్‌ త్రో చేస్తున్నాడంటే దానిని చకింగ్‌గా పిలుస్తారు. అయితే ఇది అది కాదు. ఓ బౌలర్‌ బాల్‌ వేయడానికి తిరిగి వెళ్తూ తన చేతిలో ఉన్న బంతిని స్ట్రైకర్‌ ఎండ్‌ వైపు విసిరితే అంపైర్లు నో బాల్‌గా ఇవ్వొచ్చని క్రికెట్‌ రూల్స్‌ చెబుతున్నాయి. అయితే క్రికెట్‌లో ఇప్పటి వరకూ ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు.

బౌలర్‌ విసిరిన బాల్ రెండుసార్లు బౌన్స్‌ అయితే..

సాధారణంగా ఓ బౌలర్‌ వేసిన బాల్‌ ఒకే బౌన్స్‌లో బ్యాట్స్‌మన్‌కు చేరుతుంది. అలా కాకుండా చాలా అరుదైన సందర్భాల్లో బౌలర్‌ చేతి నుంచి వెళ్లిన బంతి ఒకటి కంటే ఎక్కువ బౌన్స్‌ అవుతుంది. అలాంటి బంతిని అంపైర్లు నోబాల్‌గా ప్రకటించవచ్చని క్రికెట్‌ రూల్‌ చెబుతోంది. అప్పట్లో ట్రెవర్‌ చాపెల్‌ అండర్‌ఆర్మ్‌ బౌలింగ్‌ వివాదం తర్వాత క్రికెట్‌లో ఈ కొత్త రూల్‌ను చేర్చారు. 

స్ట్రైకర్‌ ఎండ్‌లోని వికెట్లను చేరేలోపు బంతి ఒకటి కంటే ఎక్కవసార్లు బౌన్స్‌ అయితే దానిని నోబాల్‌గా పరిగణిస్తారు. క్రికెట్‌లో ఒకసారి ఈ ఘటన జరిగింది. 1999లో ఆస్ట్రేలియా, వరల్డ్‌ ఎలెవన్‌ మధ్య మ్యాచ్‌లో మార్క్‌ టేలర్‌ వేసిన బాల్‌ను బ్యాట్స్‌మన్‌ ముందుకు వచ్చి ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అది మిస్సయి స్టంప్స్‌ను తగిలింది. కానీ సరిగ్గా స్టంప్స్‌కు ముందు ఆ బాల్‌ మరోసారి బౌన్స్‌ అయింది. దీంతో అంపైర్ సైమన్‌ టౌఫెల్‌ దానిని నోబాల్‌గా ప్రకటించాడు.

తదుపరి వ్యాసం