తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  క్రికెట్‌ కెరీర్‌లో ఒక్క నోబాల్‌ కూడా వేయని బౌలర్లు ఎవరో తెలుసా?

క్రికెట్‌ కెరీర్‌లో ఒక్క నోబాల్‌ కూడా వేయని బౌలర్లు ఎవరో తెలుసా?

Hari Prasad S HT Telugu

24 January 2022, 20:28 IST

google News
    • నోబాల్స్‌ మ్యాచ్‌ ఫలితాలనే తారుమారు చేసిన సందర్భాలు కూడా క్రికెట్‌లో ఉన్నాయి. అయితే తమ సుదీర్ఘ కెరీర్‌లలో కొందరు గొప్ప బౌలర్లు ఒక్క నోబాల్‌ కూడా వేయలేదంటే నమ్ముతారా? అలాంటి బౌలర్లు ఎనిమిది మంది ఉన్నారు. కెరీర్‌ మొత్తం నోబాల్‌ వేయకుండా ఉండటం ఎలా సాధ్యమైంది.
ఇండియన్ టీమ్ గ్రేటెస్ట్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్
ఇండియన్ టీమ్ గ్రేటెస్ట్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ (Getty Images)

ఇండియన్ టీమ్ గ్రేటెస్ట్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్

క్రికెట్‌లో బౌలర్లు నోబాల్ వేయడం అత్యంత సహజం. దాదాపు ప్రతి మ్యాచ్‌లో కనీసం ఒక్క నోబాల్‌ అయినా నమోదవుతూ ఉంటుంది. ఒకప్పుడైతే నోబాల్‌ వేస్తే ఒక అదనపు పరుగు మాత్రం వచ్చేది. కానీ ఈ కాలం వన్డే, టీ20 క్రికెట్లో నో బాల్‌ ఓ భారీ తప్పిదం. ఎందుకంటే నోబాల్‌ వేసిన తర్వాతి బాల్‌ బ్యాట్స్‌మన్‌కు ఫ్రీ హిట్‌ ఇస్తున్నారు. ఈ నోబాల్స్‌ మ్యాచ్‌ ఫలితాలనే తారుమారు చేసిన సందర్భాలు కూడా క్రికెట్‌లో ఉన్నాయి. అయితే తమ సుదీర్ఘ కెరీర్‌లలో కొందరు గొప్ప బౌలర్లు ఒక్క నోబాల్‌ కూడా వేయలేదంటే నమ్ముతారా? 

అలాంటి బౌలర్లు ఎనిమిది మంది ఉన్నారు. కెరీర్‌ మొత్తం నోబాల్‌ వేయకుండా ఉండటమంటే ఎంత క్రమశిక్షణ, ఎంతటి కచ్చితమైన రనప్‌ ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ స్పిన్నర్ల కంటే ఎక్కువ రనప్‌ ఉండే పేస్‌బౌలర్లు నోబాల్ వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ లిస్ట్‌లో మాత్రం స్పిన్నర్ల కంటే పేస్‌బౌలర్లే ఎక్కువగా ఉండటం మరో విశేషం. మరి ఇంతటి అరుదైన ఘనతను సాధించిన ఆ బౌలర్లు ఎవరో ఒకసారి చూసేద్దామా?

కపిల్‌దేవ్‌ (ఇండియా)

ఇండియన్‌ టీమ్‌ను తొలిసారి విశ్వవిజేతగా నిలిపిన హీరో, ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్ ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడైన కపిల్‌ దేవ్‌ తన సుదీర్ఘ కెరీర్‌లో ఒక్క నోబాల్‌ కూడా వేయలేదు. అతడు ఇండియా తరఫున 131 టెస్టులు, 225 వన్డేలు ఆడాడు. కెరీర్‌ మొత్తంలో నోబాల్‌ వేయని ఏకైక ఇండియన్‌ బౌలర్‌ కపిల్‌దేవే కావడం విశేషం.

డెన్నిస్‌ లిల్లీ (ఆస్ట్రేలియా)

1970ల్లో ఆస్ట్రేలియా తరఫునే కాకుండా, ప్రపంచంలోని బెస్ట్‌ ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు డెన్నిస్‌ లిల్లీ. అతడు కెరీర్లో 70 టెస్టులు, 63 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 355 వికెట్లు, వన్డేల్లో 103 వికెట్లు తీసుకున్నాడు. అయితే కెరీర్‌ మొత్తంలో అతడు ఒక్క నో బాల్‌ కూడా వేయలేదు.

ఇమ్రాన్‌ ఖాన్‌ (పాకిస్థాన్‌)

క్రికెట్‌లోని బెస్ట్‌ ఆల్‌రౌండర్లలో ఒకడిగా, పాకిస్థాన్‌ను విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్‌గా, ప్రస్తుతం ఆ దేశ ప్రధానమంత్రిగా.. ఇమ్రాన్‌ ఖాన్‌ తన జీవితంలో సాధించని ఘనత లేదు. పాకిస్థాన్‌ తరఫున 88 టెస్టులు, 175 వన్డేలు ఆడిన ఇమ్రాన్‌ఖాన్‌.. కెరీర్‌ మొత్తంలో ఒక్క నోబాల్‌ కూడా వేయని ఘనతనూ సొంతం చేసుకున్నాడు. తన ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో సుమారు అతడు 27 వేల బంతులు వేయడం విశేషం.

ఇయాన్‌ బోథమ్‌ (ఇంగ్లండ్‌)

ఇంగ్లండ్‌ టీమ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ సర్‌ ఇయన్‌ బోథమ్‌ కూడా ఈ నోబాల్ వేయని బౌలర్ల లిస్ట్‌లో ఉన్నాడు. 16 ఏళ్ల కెరీర్‌లో అతడు 102 టెస్టులు, 116 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 28 వేల బాల్స్ వేసిన బోథమ్‌ అందులో ఒక్క నోబాల్‌ కూడా వేయలేదంటే నమ్మశక్యం కాదు.

లాన్స్ గిబ్స్‌ (వెస్టిండీస్‌)

ఈ వెస్టిండీస్‌ మాజీ స్పిన్నర్‌ కెరీర్‌ 18 ఏళ్ల పాటు సాగింది. ఆ టీమ్‌ తరఫున 79 టెస్టులు, 3 వన్డేలు ఆడాడు. తన కెరీర్‌లో గిబ్స్‌ సుమారు 27 వేల బాల్స్‌ వేయగా.. అందులో ఒక్క నోబాల్‌ కూడా లేదు.

బాబ్‌ విల్లిస్ (ఇంగ్లండ్‌)

ఇంగ్లండ్‌ ప్రపంచ క్రికెట్‌కు అందించిన బెస్ట్‌ ఫాస్ట్ బౌలర్లలో బాబ్‌ విల్లిస్‌ కూడా ఒకడు. 1971లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అతడు.. ఇంగ్లండ్‌ తరఫున మొత్తం 90 టెస్టులు, 64 వన్డేలు ఆడాడు. తన కెరీర్‌లో 21 వేల బంతులు వేసిన విల్లిస్‌.. ఒక్కసారి కూడా గీత దాటలేదు.

ఫ్రెడ్‌ ట్రూమన్‌ (ఇంగ్లండ్‌)

ఈ ఇంగ్లండ్‌ మాజీ పేస్‌ బౌలర్‌ టెస్ట్‌ క్రికెట్‌లో 300 వికెట్లు తీసుకున్న తొలి బౌలర్‌గా ఘనత సాధించాడు. 1952లో ఇండియాపై టెస్ట్‌ అరంగేట్రం చేసిన ట్రూమన్‌ కెరీర్‌లో 67 టెస్టులు ఆడాడు. తాను వేసిన సుమారు 15 వేల బంతుల్లో ఒక్క నోబాల్‌ కూడా లేకుండా చూసుకున్నాడు.

గ్రేమ్‌ స్వాన్‌ (ఇంగ్లండ్‌)

గత దశాబ్దంన్నర కాలంలో అంతర్జాతీయ కెరీర్‌లో ఒక్క నోబాల్‌ కూడా వేయని బౌలర్‌ గ్రేమ్‌ స్వాన్‌ మాత్రమే. ఈ ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ 2008లో తన తొలి టెస్ట్‌ ఆడాడు. 60 టెస్టులు, 79 వన్డేల్లో మొత్తం 19 వేల బాల్స్‌ వేసినా.. అందులో ఒక్క నోబాల్‌ కూడా లేదు.

 

తదుపరి వ్యాసం