Sunil Gavaskar about Harshal Patel: ముందు ఆడనివ్వండి.. తర్వాత విమర్శించండి.. హర్షల్‌ను తీసుకోవడంపై గవాస్కర్ స్పందన
14 September 2022, 11:42 IST
- Sunil Gavaskar: టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో హర్షల్ పటేల్‌ను తీసుకోవడంపై వ్యక్తమవుతున్న విమర్శలపై సునీల్ గవాస్కర్ స్పందించాడు. ముందు ఆడనివ్వాలని, ఆ తర్వాత విమర్శలు చేయాలని తెలిపారు.
హర్షల్ పటేల్
Sunil Gavaskar about Harshal Patel: వచ్చే నెల నుంచి జరగనున్న పొట్టి ప్రపంచకప్ సమరంలో పోటీ పడటానికి బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రపంచకప్ జట్టుపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సంజూ శాంసన్‌ను కాదని, రిషభ్ పంత్‌కు అవకాశం కల్పించడంపై నెటిజన్లు ఫైర్ అవుతుండగా.. తాజాగా మహమ్మద్ షమీనీ జట్టులో తీసుకోకుండా హర్షల్ పటేల్‌ను తీసుకోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ దిగ్గజం కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. తను జట్టు సెలక్టరైనట్లయితే.. తప్పకుండా హర్షల్ స్థానంలో షమీని ఆడించేవాడినని స్పష్టం చేశాడు.
"నేను కానీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అయినట్లయితే.. షమీ తప్పకుండా జట్టులో ఉండేవాడు. మనం ఆస్ట్రేలియాలో ఆడబోతున్నాం. షమీ అక్కడ అద్భుత ప్రదర్శన చేయగలడు. మంచి బౌన్స్ రాబట్టగలడు. ఆరంభంలో వీలైనంత వరకు వికెట్లు తీయగలడు. బహుశా హర్షల్ పటేల్ స్థానంలో షమీని తీసుకోవాల్సింది." అని కృష్ణమాచారి శ్రీకాంత్ స్పష్టం చేశారు.
ఇదే విషయంపై భారత మాజీ సునీల్ గవాస్కర్ కూడా స్పందించాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్ చర్చలో పాల్గొన్న ఆయనను.. ఓ క్రికెట్ అభిమాని హర్షల్ పటేల్‌ను జట్టులో తీసుకోవడంపై ప్రశ్నించాడు. హర్షల్ ఆసీస్‌లో విఫలమవుతాడని, అతడి వద్ద పేస్ లేదని జోస్యం చెప్పాడు. దీంతో గవాస్కర్ అతడి ప్రశ్నపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. హర్షల్ విఫలమవుతాడని ముందుగానే మీరు ఎలా చెబుతారంటూ సీరియస్ అయ్యారు.
"ముందు టోర్నమెంట్ ప్రారంభమైన తర్వాత ఫస్ట్ మ్యాచ్‌లో అతడు(హర్షల్ పటేల్) ఎలా ఆడతాడో చూడాలి. అలా కాకుండా అతడు పరుగులు దారాళంగా సమర్పించుకుంటాడని మీరు ముందుగానే ఎలా నిర్ణయిస్తారు? అతడు కొంచెం స్లోగా బౌలింగ్ చేస్తాడని అతడి గురించి ఓ ముగింపునకు రావడం సరికాదు. మ్యాచ్ అయినతర్వాత ఏం జరిగిందో అప్పుడు చెప్పాలి" అని సునీల్ గవాస్కర్ తెలిపారు.
టీ20 ప్రపంచకప్ 2022 కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఇందులో రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య, యజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్. జట్టులో ఉన్నారు. వీరు కాకుండా మహమ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి భిష్ణోయ్, దీపక్ చాహర్‌ను స్టాండ్ బై ఆటగాళ్లుగా తీసుకుంది.