Harshal Patel | ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ ఇంట్లో విషాదం
కొన్ని సీజన్ల నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున నిలకడగా రాణిస్తున్నాడు హర్షల్ పటేల్. ఈ సీజన్‌లోనూ తన స్థాయి ఆటతీరుతో టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
ముంబై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ ఐపీఎల్ బయో బబుల్‌ను వీడాడు. ముంబై ఇండియన్స్‌తో శనివారం రాత్రి మ్యాచ్ ముగియగానే అతడు టీమ్‌ను వదిలి వెళ్లాడు. తన సోదరి మృతి చెందడంతో హర్షల్ అత్యవసరంగా పుణె నుంచే తన ఇంటికి వెళ్లిపోయాడు. నిజానికి ముంబైతో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే అతనికి ఈ విషాద వార్త తెలిసింది.
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయంలో హర్షల్ కీలకపాత్ర పోషించాడు. 4 ఓవర్లలో కేవలం 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ముంబై భారీ స్కోరు చేయలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. "దురదృష్టవశాత్తూ అతని కుటుంబంలో మరణం సంభవించడంతో హర్షల్ టీమ్ బయో బబుల్‌ను వీడాల్సి వచ్చింది. అతని సోదరి మృతి చెందింది. అతడు పుణె నుంచి టీమ్‌తో కలిసి ముంబై వెళ్లకుండా ఇంటికి వెళ్లిపోయాడు" అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
అయితే ఆర్సీబీకి గుడ్‌న్యూస్ ఏంటంటే.. తన తర్వాతి మ్యాచ్ ఈ నెల 12న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడే ముందు హర్షల్ తిరిగి బయో బబుల్‌లో చేరనున్నాడు. ఆర్సీబీ తరఫున గత రెండు సీజన్లలో అద్భుతంగా రాణించిన హర్షల్ ఇండియా తరఫునా అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకూ 8 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
సంబంధిత కథనం
టాపిక్