Sridhar on Kohli Shastri blunder: కోహ్లి, శాస్త్రి చేసిన ఆ తప్పు వల్లే ఇండియాకు వరల్డ్ కప్ రాలేదు: శ్రీధర్
23 February 2023, 14:00 IST
- Sridhar on Kohli Shastri blunder: కోహ్లి, శాస్త్రి చేసిన ఆ తప్పు వల్లే ఇండియాకు వరల్డ్ కప్ రాలేదని చెప్పాడు టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్. ఇప్పుడదే తప్పును రోహిత్, ద్రవిడ్ చేయబోరని ఆశాభావం వ్యక్తం చేశాడు.
రోహిత్, ద్రవిడ్, కోహ్లి, రవిశాస్త్రి
Sridhar on Kohli Shastri blunder: ఇండియన్ టీమ్ 2019 వరల్డ్ కప్ లో సెమీస్ వరకూ వచ్చింది. లీగ్ స్టేజ్ లో అన్ని మ్యాచ్ లూ గెలిచి టాప్ లో నిలిచింది. కానీ ఈ వరల్డ్ కప్ లో ఒక్క తప్పు ఇండియా ఆశలను తుంచేసింది. ఆ సమయంలో ఇండియన్ టీమ్ లో బలమైన నంబర్ 4 బ్యాటర్ లేడు. ఆ టోర్నీలో వేర్వేరు ప్లేయర్స్ ను ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఇప్పుడు నాలుగేళ్లవుతున్నా.. టీమ్ అప్పుడు చేసిన తప్పును ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ మరచిపోలేకపోతున్నాడు. 2019 వరల్డ్ కప్ లో తాము నంబర్ 4 బ్యాటర్ విషయంలో అతిపెద్ద తప్పు చేసినట్లు తన ఆటోబయోగ్రఫీ కోచింగ్ బియాండ్ లో రాసుకొచ్చాడు. 2015 నుంచి 2019 వరకూ నాలుగేళ్ల సమయం దొరికినా.. ఈ స్థానం కోసం ఓ మంచి బ్యాటర్ ను వెతకలేపోయినట్లు చెప్పాడు.
ఏ టీమ్ లో అయినా నంబర్ 4 స్థానం చాలా ముఖ్యమైనది. వన్డేల్లో ఈ స్థానంలో వచ్చే బ్యాటర్ మిడిలార్డర్ లో కీలకపాత్ర పోషిస్తాడు. "మేము వెంటనే ఫలితం రావాలని అనుకున్నాం. అందుకే ఓ ప్లేయర్ రెండు, మూడు మ్యాచ్ లలో విఫలం కాగానే మరొకరి వైపు చూశాం. ఆ స్థానంలో మంచి బ్యాటర్ ను తీసుకొచ్చేందుకు మా దగ్గర చాలా సమయం ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఫలితంగానే వరల్డ్ కప్ లో విఫలమయ్యాం" అని శ్రీధర్ స్పష్టం చేశాడు.
నిజానికి 2017 ఆగస్ట్ నుంచి 2019 వరల్డ్ కప్ మధ్య 49 మ్యాచ్ లలో ఇండియన్ టీమ్ ఏకంగా 10 మంది బ్యాటర్లను ఈ నంబర్ 4 స్థానం కోసం ప్రయత్నించింది. ఈ స్థానంలో అంబటి రాయుడు సెటిలైనట్లే కనిపించినా.. వరల్డ్ కప్ టీమ్ లో అతనికి చోటు దక్కకపోవడం షాక్ కు గురి చేసింది. రాయుడు స్థానంలో విజయ్ శంకర్ ను తీసుకొని టీమ్ తగిన ఫలితం అనుభవించింది.
అప్పుడు కోహ్లి, శాస్త్రి చేసిన ఈ తప్పిదాన్ని ఇప్పటి రోహిత్, ద్రవిడ్ ద్వయం రిపీట్ చేయబోదని తాను భావిస్తున్నట్లు కూడా శ్రీధర్ చెప్పాడు. "నంబర్ 4 గురించి ఎవరూ మాట్లాడలేదు. ఆ స్థానాన్ని అందరూ తేలిగ్గా తీసుకున్నారు. అదే వరల్డ్ కప్ లో మా కొంప ముంచింది. అప్పుడు రాయుడు ఒక్కడే ఏడు మ్యాచ్ లలో ఆ స్థానంలో ఆడాడు. మిగతా ఎవ్వరికీ అన్ని అవకాశాలు కూడా దక్కలేదు.
సపోర్ట్ స్టాఫ్ అయిన రవి, సంజయ్, అరుణ్, నేను, విరాట్ నుంచి పెద్ద తప్పిదమే జరిగింది. ఆ స్థానంలో ఎదగడానికి ఎవరికీ తగినన్ని అవకాశాలు ఇవ్వలేకపోయాం. దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తప్పును రోహిత్, ద్రవిడ్ ద్వయం చేయబోదు అన్న విశ్వాసం నాకుంది" అని శ్రీధర్ తన పుస్తకంలో రాశాడు.