Siraj on Smith: స్మిత్‌పైకి బాల్ విసరడంపై సిల్లీగా స్పందించిన సిరాజ్
09 June 2023, 9:41 IST
- Siraj on Smith: స్మిత్‌పైకి బాల్ విసరడంపై సిల్లీగా స్పందించాడు మహ్మద్ సిరాజ్. కేవలం ఎంజాయ్‌మెంట్ కోసమే తాను అలా బాల్ విసిరానని, అంతే తప్ప ఏమీ లేదని అతడు చెప్పడం విశేషం.
స్టీవ్ స్మిత్ తో సిరాజ్ గొడవ
Siraj on Smith: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాకు రెండో రోజు కూడా కలిసి రాలేదు. తొలి రోజు కంటే రెండో రోజు కాస్త బౌలింగ్ మెరుగైనా.. బ్యాటర్లు చేతులెత్తేయడంతో చివరికి ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. అయితే రెండో రోజు ఆటలో స్మిత్ తో సిరాజ్ వ్యవహరించిన తీరు అభిమానులకు నచ్చలేదు. అతనిపైకి బాల్ విసరడమే సరికాదంటే.. తర్వాత సిరాజ్ ఇచ్చిన వివరణ మరీ సిల్లీగా ఉంది.
సిరాజ్ బౌలింగ్ లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి స్మిత్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత బంతి వేయడానికి సిరాజ్ దాదాపు పరుగు పూర్తి చేసే సమయంలో స్మిత్ తప్పుకున్నాడు. పైనున్న స్పైడర్ క్యామ్ కారణంగా ఏకాగ్రత చెదరడంతో స్మిత్ ఇలా చేశాడు. అయితే అప్పటికే రెండు వరుస ఫోర్లు కొట్టడంతో ఫ్రస్ట్రేషన్ లో ఉన్న సిరాజ్.. కోపంతో స్మిత్ పైకి బాల్ విసిరాడు.
కెమెరా వల్ల తాను అలా చేసినట్లు స్మిత్ చెబుతూనే ఉన్నా సిరాజ్ వినలేదు. అయితే రెండో రోజు ఆట ముగిసిన తర్వాత ఈ ఘటనపై సిరాజ్ స్పందించిన తీరు మరీ సిల్లీగా ఉంది. "అదేం లేదు. ఏదో కాస్త ఎంజాయ్‌మెంట్. ఎంజాయ్ చేస్తే కాస్త మైండ్ రిలాక్స్ అవుతుంది. మరీ ఒత్తిడి తీసుకుంటే అది బౌలింగ్ పై ప్రభావం చూపుతుంది. అందుకే అదేమీ లేదు" అని సిరాజ్ అన్నాడు.
స్మిత్ ఏకాగ్రతను దెబ్బతీయడానికి అలా చేశావా అని అడిగినా కూడా సిరాజ్ ఇలాగే స్పందించాడు. "అలాంటిదేమీ లేదు. అతన్ని ఫ్రస్ట్రేషన్ కు గురి చేయాలన్న ప్లాన్ కూడా ఏమీ లేదు. నేను కేవలం నా బౌలింగ్ ను ఎంజాయ్ చేశాను. ఆ సమయంలో కాస్త ఫ్రస్ట్రేట్ అయ్యాను" అని సిరాజ్ చెప్పడం విశేషం.
తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ 4 వికెట్లు తీశాడు. అయితే స్మిత్, 121, హెడ్ 163 పరుగులు చేయడంతోపాటు నాలుగో వికెట్ కు ఇద్దరూ కలిసి 285 రన్స్ జోడించడంతో ఆస్ట్రేలియా 469 పరుగుల భారీ స్కోరు చేసింది. రెండో హెడ్ ను కేవలం బౌన్సర్లతో ఇబ్బంది పెట్టాలని తాము ప్లాన్ తో వచ్చినట్లు సిరాజ్ చెప్పాడు.