Shoaib Akhtar on Umran Malik: ఉమ్రాన్‌కు సాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధమే: అక్తర్
17 March 2023, 18:02 IST
- Shoaib Akhtar on Umran Malik: ఉమ్రాన్‌కు సాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధమేనని అన్నాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. ఉమ్రాన్ తన రనప్‌ను మరికాస్త పెంచుకోవాలని చెప్పాడు.
ఉమ్రాన్ మాలిక్
Shoaib Akhtar on Umran Malik: టీమిండియా పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్ తన స్పీడుతో అదరగొడుతున్న సంగతి తెలుసు కదా. అతడు ఎప్పుడో ఒకసారి పాకిస్థాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ వేసిన ఫాస్టెస్ట్ డెలివరీ (గంటకు 161.3 కి.మీ.) రికార్డును అధిగమిస్తాడని భావిస్తున్నారు. అక్తర్ ఈ బాల్ ను 2003 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పై వేశాడు.
అయితే తన రికార్డును బీట్ చేయడానికి తానే ఉమ్రాన్ మాలిక్ కు సాయం చేస్తానని న్యూస్ 24 స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ చెప్పాడు. "నేను బౌలింగ్ చేయడానికి 26 గజాలు తీసుకుంటాను. కానీ ఉమ్రాన్ 20 గజాలే తీసుకుంటున్నాడు. అతడు 26 గజాలకు వెళ్లినప్పుడు అతని కండరాల శక్తి మరింత పెరుగుతుంది. రానున్న రోజుల్లో అతడు నేర్చుకుంటాడని అనుకుంటున్నాను.
అతనికి సాయం కావాలంటే నేను ఎప్పుడూ సిద్ధమే. నా రికార్డును బ్రేక్ చేయాలని అనుకుంటే చేసెయ్. 20 ఏళ్లుగా ఎవరూ బ్రేక్ చేయలేదు. దయచేసి బ్రేక్ చెయ్. నిన్ను హగ్ చేసుకొని, కిస్ చేసే తొలి వ్యక్తిని నేను అవుతా" అని అక్తర్ అన్నాడు.
"ఉమ్రాన్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. బలంగా ఉన్నాడు. పవర్ ఫుల్ రనప్ ఉంది. ఆర్మ్ స్పీడు కూడా బాగుంది. ఉమ్రాన్.. ధైర్యంగా బౌలింగ్ చెయ్. వేగంగా చేయడానికి నేర్చుకో. ఇందులోని సాంకేతిక విషయాన్ని నేర్చుకో. నీ దూకుడు తగ్గించుకోకు.
ఎప్పుడూ వేగంగానే బౌలింగ్ చెయ్. ఫీల్డ్ లోకి వెళ్లావంటే నువ్వే దున్నేయాలి. నమ్మకం కోల్పోకు. కఠినంగా శ్రమించు. నువ్వు గొప్ప దేశానికి ఆడుతున్నావు. ఈ ఆటను అక్కడి వాళ్లు చాలా ఇష్టపడతారు. వాళ్లనెప్పుడూ తలదించుకునేలా చేయకు" అని అక్తర్ అనడం విశేషం.
ఉమ్రాన్ మాలిక్ నిలకడగా గంటకు 150 కి.మీ.లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. 2021 ఐపీఎల్లో తెరపైకి వచ్చిన ఉమ్రాన్.. తర్వాత ఇండియన్ టీమ్ లో కూడా చోటు సంపాదించాడు. అయితే అతనికి రెగ్యులర్ గా తుది జట్టులో మాత్రం అవకాశం దక్కడం లేదు.
టాపిక్