Shahid Afridi on Shoaib Akhtar: షోయబ్ అక్తర్ చాలా ఇంజెక్షన్లు తీసుకునేవాడు.. అందుకే నడవడానికీ రావడం లేదు: అఫ్రిది
Shahid Afridi on Shoaib Akhtar: షోయబ్ అక్తర్ చాలా ఇంజెక్షన్లు తీసుకునేవాడు.. అందుకే ఇప్పుడు అతనికి నడవడానికీ రావడం లేదని పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సంచలన కామెంట్స్ చేశాడు.
Shahid Afridi on Shoaib Akhtar: క్రికెట్ లో అందరి కంటే ఎక్కువగా పేస్ బౌలర్లు తరచూ గాయాల బారిన పడుతుంటారు. వాళ్లకే ఎక్కువ ఫిట్‌నెస్ అవసరం. ఈ మధ్యకాలంలో ఇండియన్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, పాకిస్థాన్ పేస్ బౌలర్ షాహీన్ అఫ్రిది ఇలా గాయాల బారిన పడి కీలకమైన టోర్నీలకు దూరమయ్యారు.
అయితే ఈ మధ్య షాహీన్ అఫ్రిదిపై పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందిస్తూ.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ తీసుకొని అయినా సరే అతడు బౌలింగ్ చేయాల్సిందని అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్తర్ తాను ఆడే రోజుల్లో ఇలా చాలా ఇంజెక్షన్లు తీసుకునేవాడని మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చెప్పడం గమనార్హం.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్ గా అక్తర్ కు పేరుంది. అలాంటి ప్లేయర్ కు చాలా ఫిట్‌నెస్ అవసరం. దీనికోసమే అక్తర్ ఇంజెక్షన్లు తీసుకునేవాడని అఫ్రిది అన్నాడు. "షోయబ్ అక్తర్ చాలా ఇంజెక్షన్లు తీసుకున్నాడు. అందుకే ఇప్పుడతనికి నడవడానికీ రావడం లేదు. అదీ షోయబ్ అక్తర్ క్లాస్.
అతను చేయగలడు. చాలా కష్టం. ప్రతి ఒక్కరూ షోయబ్ అక్తర్ కాలేరు. ఇంజెక్షన్లు, పెయిన్ కిల్లర్లు తీసుకున్నా.. గాయంతో ఆడటం చాలా కష్టం. ఎందుకంటే ఆ గాయం మరింత ముదిరేలా చేసుకుంటున్నారు. ఏది ఏమైనా అక్తర్ ను అలా వదిలేద్దాం" అని అఫ్రిది సమా టీవీతో మాట్లాడుతూ అన్నాడు.
మోకాలి గాయంతో బాధపడుతున్న షాహీన్ అఫ్రిది.. గతేడాది ఫైనల్లో మరోసారి అదే మోకాలికి గాయం చేసుకున్నాడు. దీంతో కీలకమైన సమయంలో బౌలింగ్ చేయలేకపోయాడు. ఫలితంగా ఇంగ్లండ్ సులువుగా విజయం సాధించి వరల్డ్ కప్ ఎగరేసుకుపోయింది. దీనిపై ఈ మధ్య అక్తర్ స్పందిస్తూ.. తాను అఫ్రిది స్థానంలో ఉండి ఉంటే పెయిన్ కిల్లర్లు తీసుకొని బౌలింగ్ చేసేవాడినని అన్నాడు.
సంబంధిత కథనం