Aakash Chopra on Bumrah: బుమ్రా.. నువ్వు ముందు ఇండియన్ ప్లేయర్.. ఐపీఎల్ ముఖ్యం కాదు: ఆకాశ్ చోప్రా
Aakash Chopra on Bumrah: బుమ్రా.. నువ్వు ముందు ఇండియన్ ప్లేయర్.. ఐపీఎల్ ముఖ్యం కాదని అన్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. అటు ఐపీఎల్లో అతనిపై భారం తగ్గించే బాధ్యత కూడా ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీపై ఉందని స్పష్టం చేశాడు.
Aakash Chopra on Bumrah: వెన్ను గాయం కారణంగా ఐదు నెలలుగా ఇండియన్ టీమ్ కు దూరంగా ఉన్నాడు పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా. కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతోపాటు ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కూడా ఆడటం లేదు. అయితే మార్చి 31 నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ కు అతడు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముంబై ఇండియన్స్ టీమ్ తరఫున ఆడే బుమ్రా.. కచ్చితంగా ఈ మెగా లీగ్ లో కనిపించే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. అటు బుమ్రాతోపాటు ముంబై ఫ్రాంఛైజీకి కూడా కీలకమైన సూచన చేశాడు. ఐపీఎల్ 2023లో బుమ్రాపై భారాన్ని మోపే విషయంలో బీసీసీఐ చెప్పినట్లుగా ముంబై టీమ్ నడుచుకోవాల్సి ఉంటుందని చెప్పాడు.
ఏడాది కాలంగా వెన్ను గాయంతో బుమ్రా బాధపడుతున్నాడు. గతేడాది ఇంగ్లండ్ టూర్ లో ఉన్న సమయంలో ఈ గాయం కాగా.. తర్వాత ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లాంటి వాటికి దూరమయ్యాడు. ఈ ఏడాది మొదట్లో శ్రీలంకతో సిరీస్ కోసం మొదట ఎంపిక చేసినా.. తర్వాత అతన్ని పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ కీడాతో మాట్లాడిన ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.
"ముందు నువ్వు ఇండియన్ ప్లేయర్. తర్వాతే నీ ఫ్రాంఛైజీకి ఆడుతున్నావు. ఒకవేళ బుమ్రా ఏదైనా అసౌకర్యానికి గురైతే బీసీసీఐ వెంటనే రంగంలోకి దిగాలి. బుమ్రాను రిలీజ్ చేయబోమని ఫ్రాంఛైజీకి చెప్పాలి. జోఫ్రా ఆర్చర్ తో కలిసి బుమ్రా ఏడు మ్యాచ్ లలో ఆడకపోతే ప్రపంచమేమీ అంతమవదు" అని చోప్రా చాలా ఘాటుగా స్పందించాడు.
బుమ్రా పరిస్థితిని బట్టి.. బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్, ముంబై ఇండియన్స్ కలిసి ఐపీఎల్లో అతనిపై పనిభారం గురించి నిర్ణయం తీసుకోవాలని చోప్రా సూచించాడు. "అదే సమయంలో ఫిట్ గా ఉంటే మాత్రం ఆడుతూనే ఉండాలి. అదే ప్లేయర్ ను మెరుగు పరుస్తుంది. అయితే ఒకవేళ బీసీసీఐ రంగంలోకి దిగితే మాత్రం ముంబై ఫ్రాంఛైజీ బోర్డు చెప్పినట్లు వినాలి. ఎందుకంటే బుమ్రా జాతి ఖజానా" అని చోప్రా స్పష్టం చేశాడు.
ఈలోపు బుమ్రా ఫిట్ గా ఉంటే ఇరానీ ట్రోఫీ, కౌంటీ క్రికెట్ లాంటివి ఆడాలని కూడా చోప్రా సూచించాడు. ఐపీఎల్ కు మరో నెల రోజుల సమయం ఉన్నదని, అందులో బుమ్రా అన్ని మ్యాచ్ లు ఆడతాడా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం