Shakib Al Hasan Record: టీ20ల్లో షకీబ్ వరల్డ్ రికార్డు.. అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ అతడే
29 March 2023, 20:43 IST
Shakib Al Hasan Record: టీ20ల్లో షకీబ్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా నిలిచాడు. ఐర్లాండ్ తో మ్యాచ్ లో ఐదు వికెట్లు తీయడం ద్వారా షకీబ్ ఈ ఘనత సాధించాడు.
టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ షకీబుల్ హసన్
Shakib Al Hasan Record: బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లలో టాప్ లోకి దూసుకెళ్లాడు. ఐర్లాండ్ తో బుధవారం (మార్చి 29) జరిగిన రెండో టీ20లో షకీబ్ ఈ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఈ మ్యాచ్ లో అతడు ఐదు వికెట్లు తీసుకోవడం విశేషం.
ఈ క్రమంలో న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీని అతడు వెనక్కి నెట్టాడు. ఐర్లాండ్ తో రెండో టీ20లో షకీబ్ 22 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్ లోనూ బంగ్లా టీమ్ ఐర్లాండ్ ను ఓడించింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ మూడో బంతికి ఐర్లాండ్ బ్యాటర్ జార్జ్ డాక్రెల్ ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసిన షకీబ్. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.
ప్రస్తుతం షకీబ్ ఖాతాలో 136 అంతర్జాతీయ టీ20 వికెట్లు ఉన్నాయి. అతని సగటు 20.67 కాగా.. ఎకానమీ రేటు కూడా కేవలం 6.8 కావడం విశేషం. సౌథీ 134 వికెట్లతో రెండోస్థానానికి పడిపోయాడు. ఇక రషీద్ ఖాన్ 129, ఇష్ సోధీ 114, లసిత్ మలింగా 107 వికెట్లతో మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. 2006లో తొలిసారి జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేశాడు షకీబ్.
ఆ తర్వాత జరిగిన అన్ని టీ20 వరల్డ్ కప్ లలో అతడు ఆడటం విశేషం. ఆల్ రౌండర్ అయిన షకీబ్ 114 మ్యాచ్ లలో 2339 రన్స్ కూడా చేశాడు. ఐర్లాండ్ తో రెండో టీ20లోనూ షకీబ్ 38 పరుగులతో రాణించాడు. ఇదే మ్యాచ్ లో ఓపెనర్ లిటన్ దాస్ కేవలం 41 బంతుల్లోనే 83 రన్స్ చేశాడు. అతడు 18 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేసి బంగ్లా తరఫున వేగంగా టీ20 ఫిఫ్టీ చేసిన బ్యాటర్ గా నిలిచాడు.
దీంతో బంగ్లాదేశ్ కేవలం 17 ఓవర్లలోనే 202 రన్స్ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 17 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత ఐర్లాండ్ 17 ఓవర్లలో 125 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ లో షకీబ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.