India Tour of Ireland 2023: ఐర్లాండ్‌లో పర్యటించనున్న భారత్.. వరుసగా రెండో ఏడాది ఐరిష్ టూర్
India Tour of Ireland 2023: టీమిండియా వరుసగా రెండో ఏడాది ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఆగస్టు నెలలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆ దేశం వెళ్లనుంది. ఈ విషయాన్ని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
India Tour of Ireland 2023: గతేడాది టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లి సంగతి తెలిసిందే. ఈ టూర్‌లో భాగంగా రెండు టీ20ల సిరీస్ భారత్ ఆడగా.. 2-0 తేడాతో ఆతిథ్య జట్టుపై క్లీన్ స్వీప్ సాధించింది. తాజాగా మరోసారి ఐర్లాండ్‌లో పర్యటించనుంది మెన్ ఇన్ బ్లూ. ఈ ఏడాది ఆగస్టులో ఐరిష్ జట్టుతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. వరుసగా రెండో ఏడాది ఐర్లాండ్‌లో భారత్ పర్యటించనుండటం విశేషం. ఈ విషయాన్ని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. భారత్.. తమ దేశంలో పర్యటించడం ఐరిష్ జట్టు ప్రతిభ, పోటీతత్వంపై విశ్వాసాన్ని తెలియజేస్తుందని సదరు బోర్డు తన ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు 18 నుంచి 23 మధ్య కాలంలో ఈ టీ20లు జరగనున్నట్లు స్పష్టం చేసింది.
"భారత్ వరుసగా రెండో సంవత్సరం ఐర్లాండ్‌లో పర్యటించడాన్ని మేము ఖరారు చేస్తున్నాం. ఇదే కాకుండా బంగ్లాదేశ్‌తో ప్రపంచ కప్ సూపర్ లీగ్ సిరీస్ మే ప్రారంభంలో జరుగుతుందని కూడా ధ్రువీకరిస్తున్నాం. ఇప్పటికే బంగ్లాతో జూన్ టెస్టు సహా మూడు మ్యాచ్ వన్డే సిరీస్ కూడా ఉంది. ఆ తర్వాత ఆగస్టులో భారత్‌తో సెప్టెంబరులో ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడబోతున్నాం. "అని ఐర్లాండ్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ వారెన్ డ్యూట్రోమ్ అన్నారు.
"భారత్‌తో గతేడాది జరిగిన టీ20 సిరీస్ సగం వరకు నాటకీయంగా జరిగింది. దీంతో ఈ సారి మరింత ఎక్కువగా ఆసక్తి నెలకొంది. అడ్మిషన్ ధర కూడా పెరగనుంది. ఈ వేసవి సిరీస్‌లకు ఆసక్తి, డిమాండ్ పెరిగిన కారణంగా హోమ్ మ్యాచ్‌కు ముందుగానే టికెట్లు విక్రయించాలని అభిమానులు ఆత్రుతగా ఉన్నారు." అని వారెన్ స్పష్టం చేశారు.
భారత్‌తో టీ20 సిరీస్ కంటే ముందు ఐర్లాండ్ బంగ్లాదేశ్‌తో వరల్డ్ కప్ సూపర్ లీగ్ సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు మే నెలలో జరగనున్నాయి. అయితే బంగ్లాదేశ్ ఇప్పటికే 2023 వరల్డ్ కప్‌కు అర్హత సాధించడంతో ఐర్లాండ్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసి ఆటోమేటిక్‌గా మెగా టోర్నీకి అర్హత సాధించాలని చూస్తోంది. ఒకవేళ బంగ్లాపై ఐర్లాండ్ 3-0 తేడాతో గెలవకపోయినట్లయితే వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల కోసం జూన్‌లో జింబాబ్వేకు వెళ్లాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్