Ind vs Aus 1st ODI: తొలి వన్డేలో ఆసీస్‌పై భారత్ విజయం.. కష్టాల్లో ఆదుకున్న కేఎల్ రాహుల్
Ind vs Aus 1st ODI: వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆసీస్‌పై గెలిచింది. ఈ మ్యాచ్‌లే కేఎల్ రాహుల్.. ఓడిపోతున్న మ్యాచ్‌ను గెలిపించి ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.
Ind vs Aus 1st ODI: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా అదరగొట్టింది. టెస్టు సిరీస్ విజయాన్ని కొనసాగిస్తూ వన్డేలోనూ ఆకట్టుకుంది. ముంబయి వాంఖడే వేదికగా కంగారూ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 189 పరుగుల లక్ష్యాన్ని 39.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పీకల్లోతూ కష్టాల్లో ఉన్న భారత్‌ను కేఎల్ రాహుల్(75) తన అద్భుత అర్ధశతకంతో విజయాన్ని అందించాడు. రవీంద్ర జడేజా(45) సాయంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లు స్టార్క్ 3 వికెట్లు తీయగా.. మార్కస్ స్టాయినీస్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
189 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభమేమి దక్కలేదు. రెండో ఓవర్లోనే ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను(3) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు ఆసీస్ బౌలర్ స్టాయినీస్. ఆ కాసేపటికే విరాట్ కోహ్లీని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు స్టార్క్. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ తింది. నాలుగో టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్న కోహ్లీని.. ఈ మ్యాచ్‌లో కేవలం 4 పరుగులకే స్టార్క్ ఔట్ చేశాడు. ఆ తదుపరి బంతికే సూర్యకుమార్ యాదవ్‌ను(0) కూడా ఎల్బీగా వెనక్కి పంపాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. మెరుగైన ప్రదర్శన చేస్తాడనుకున్న శుబ్‌మన్ గిల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. స్టార్క్ బౌలింగ్‌లో లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది భారత్. ఇలాంటి సమయంలో రాహుల్.. కెప్టెన్ హార్దిక్ పాండ్య సాయంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. వీరిద్దరూ నిలకడగా రాణించారు. అయితే వీరి భాగస్వామ్యం బలపడుతుందనుకుంటున్న తరుణంలో పాండ్యను(25) స్టాయినీస్ ఔట్ చేశాడు. దీంతో 84 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి మరింత ఇబ్బందుల్లో ఇరుక్కుంది.
ఇలాంటి సమయంలో కేఎల్ రాహుల్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. రవీంద్ర జడేజా సాయంతో స్కోరు వేగాన్ని పెంచాడు. జడ్డూ తోడుతో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. చెత్త బంతులను మాత్రమే బౌండరీకి తరలిస్తూ నిదానంగా స్కోరు వేగాన్ని పెంచాడు. నిలకడగా రాణిస్తూ కేఎల్ రాహుల్ తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. జడ్డూతో కలిసి మరో వికెట్ పడకుండా 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివర్లో జడేజా వరుసగా రెండు ఫోర్లు కొట్టి విజయాన్ని కన్ఫార్మ్ చేశాడు. దీంతో 39.5 ఓవర్లలో టీమిండియా 5 వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ మిచెల్ మార్ష్(81) మినహా మిగిలిన వారు పెద్దగా ఆకట్టుకోలేదు. అతడు ఒంటి చేత్తో ఫోర్లు, సిక్సర్లు కొడుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. అయితే సహచరుల నుంచి తోడ్పాటు కొరవడటం, దూకుడుగా ఆడే ప్రయత్నంలో జడేజా బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ చెరో 3 వికెట్లు తీయగా.. జడేజా 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.