Shaheen Afridi Deadly Yorker: షాహిన్ ప్రమాదకర యార్కర్.. ఆసుపత్రిలో ఆఫ్గాన్ ఓపెనర్
19 October 2022, 12:20 IST
- Shaheen Afridi Deadly Yorker: పాకిస్థాన్ పేసర్ షాహిన్ షా అఫ్రిదీ సంధించిన ప్రమాదకర యార్కర్ ఆఫ్గాన్ ఓపెనర్‌ను ఆసుపత్రి పాలు చేసింది. పాక్-ఆఫ్గాన్ మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అఫ్రిదీ వేసిన బంతి బలంగా ఆఫ్గాన్ ఓపెనర్ గుర్బాజ్ ఎడమ పాదానికి తాకింది.
షాహిన్ అఫ్రిదీ ప్రమాదకర యార్కర్
Shaheen Afridi Deadly Yorker: టీ20 వరల్డ్ కప్‌నకు ముందు పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ షా అఫ్రిదీ ఫిట్‌నెస్ గురించి రకరకాలుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటన్నింటిని పటాపంచలు చేస్తూ షాహిన్ అఫ్రిదీ ఘనంగా పునరాగమనం చేస్తున్నాడు. ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లోనే తన ఓపెనింగ్ స్పెల్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఆఫ్గాన్ ఓపెనర్లు రహమతుల్లా గుర్బాజ్-హజ్రతుల్లా జజాయ్ వికెట్లను అతడు వేసిన తొలి రెండు ఓవర్లలోనే తీశాడు. అయితే వీటిల్లో గుర్బాజ్‌కు సంధించిన పదునైన బంతి మాత్రం ప్రమాదకరంగా మారింది.
అఫ్రిదీ వేసి మొదటి ఓవర్ ఐదో బంతినే యార్కర్‌గా మారి గుర్బాజ్ ఎడమ పాదాన్ని తాకింది. ఫలితంగా భయంకరమైన నొప్పితో బ్యాటర్ విలవిల్లాడాడు. బ్యాటర్ బ్యాట్‌ను కిందకు దించేలోపే వేగంగా వచ్చి పాదానికి తగిలింది. అంపైర్ వెంటనే వేలు పైకెత్తి ఔట్‌గా పరిగణించాడు. అయితే గుర్బాజ్ మాత్రం నొప్పిని తట్టుకోలేకపోయాడు. అప్పటికే కింద పడిపోవడంతో అందరూ ఆందోళన చెందారు. అంత సౌకర్యవంతంగా కనిపించని అతడి వద్దకు ఫిజియోలు వచ్చి ప్రాథమిక చికిత్స చేశారు. కొంత సేపటి తర్వాత కూడా ఆఫ్గాన్ ఓపెనర్ నడవలేకపోవడంతో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ ద్వారా మైదానం నుంచి బయటకు వెళ్లాడు.
తాజా రిపోర్టుల ప్రకారం గుర్బాజ్ ఎడమ కాలి పాదం స్కాన్ కోసం అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆఫ్గాన్ టాపార్డర్ కీలకమైన గుర్బాజ్ గాయం కారణంగా ఆ జట్టుకు పెద్ద దెబ్బే తగలనుంది. గుర్బాజ్ ఔట్ అనంతరం షాహిన్ అఫ్రీదీ మరో పదునైన బంతిని సంధించి హజ్రతుల్లాను క్లీన్ బౌల్డ్ చేశాడు. అంతకుముందు అతడు సంధించిన డెలివరీలు కూడా వికెట్లే లక్ష్యంగా దూసుకెళ్లాయి. ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ మోకాలి గాయం నుంచి కోరుకున్న తర్వాత పాక్ తరఫున మళ్లీ పునరాగమనం చేస్తున్నాడు. ఆసియాకప్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌తో జరిగిన ట్రై సిరీస్‌కు దూరంగా ఉంచింది పాక్.
అక్టోబరు 23న జరగనున్న ఆరంభ మ్యాచ్ పాకిస్థాన్-టీమిండియా తలపడనున్నాయి. ఇప్పటికే గతేడాది వరల్డ్ కప్, ఆసియా కప్ పరాభవాల కారణంగా చిరకాల ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.