Asia cup 2022: ఆసియా కప్‌నకు ముందు షాహిన్ అఫ్రిదీకి గాయం.. అప్డేట్ ఇచ్చిన బాబర్-babar azam gives injury update on shaheen afridi ahead of asia cup ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Asia Cup 2022: ఆసియా కప్‌నకు ముందు షాహిన్ అఫ్రిదీకి గాయం.. అప్డేట్ ఇచ్చిన బాబర్

Asia cup 2022: ఆసియా కప్‌నకు ముందు షాహిన్ అఫ్రిదీకి గాయం.. అప్డేట్ ఇచ్చిన బాబర్

Maragani Govardhan HT Telugu
Aug 12, 2022 08:37 PM IST

పాకిస్థాన్ ప్రధాన పేసర్ షాహిన్ అఫ్రిదీకి గాయమైంది. దీంతో అతడు నెదర్లాండ్స్ పర్యటనలో ఆడేది లేంది అనుమానంగా మారింది. ఈ పర్యటన తర్వాత ఆసియా కప్‌లో ఆడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో షాహిన్ గాయంపై అప్డేట్ ఇచ్చాడు ఆ జట్టు కెప్టెన్ బాబర్.

షాహిన్ అఫ్రిదీ
షాహిన్ అఫ్రిదీ (AFP)

గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ చేతిలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో పాక్ పేసర్ షాహిన్ అఫ్రిదీ తన పదునైన బంతులతో భారత బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఓపెనర్లయిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ వికెట్లు తీసి భారత్‌ను ఘోరంగా దెబ్బకొట్టాడు. దీంతో అతడిపై ప్రత్యేక దృష్టి పెట్టింది టీమిండియా. మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ రానున్న తరుణంలో ఇరుజట్లు తమ తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. అయితే ఇలాంటి సమయంలో పాక్ పేసర్ షాహిన్ అఫ్రిదీ గాయమవడం ఆ జట్టును కలవర పెడుతోంది.

షాహిన్ అఫ్రిదీకి గాయమైంది. మోకాలి గాయం కారణంగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టుకు కూడా అతడు అందుబాటులోకి రాలేదు. ఆసియా కప్ మరికొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో.. ఆ టోర్నీ కంటే ముందు పాక్ నెదర్లాండ్స్ పర్యటన చేయనుంది. ఈ సిరీస్‌కు కూడా షాహిన్ ఎంపికయ్యాడు. అయితే గాయం కారణంగా అతడు నెదర్లాండ్స్ పర్యటనతో పాటు, ఆసియా కప్ ఆడతాడో లేదనే అనుమానం తలెత్తింది. తాజాగా అతడి హెల్త్ కండీషన్‌పై పాక్ కెప్టెన్ బాబర్ అజాం స్పష్టత ఇచ్చాడు.

"షాహిన్ అఫ్రిదీ ఫిట్నెస్‌పై కొన్ని ఆందోళనలు ఉన్నాయి. నెదర్లాండ్స్ పర్యటనకు అతడిని కూడా తీసుకెళ్తున్నాం. అయితే అతడితో పాటు డాక్టర్, ఫిజియో ఎల్లవేళలా ఉంటారు. దీర్ఘకాలిక కోణంలో ఆలోచించి ఈ మేరకు ఏర్పాట్లు చేశాం. ఆసియా కప్, ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. అతడు వీలైనంత త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాం. నెదర్లాండ్స్ సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా ఆడగలడని అనుకుంటున్నాం. లేని పక్షంలో ఆసియా కప్ సమయానికి కోలుకుంటాడని భావిస్తున్నాం." అని బాబర్ అజాం స్పష్టం చేశాడు.

ఆసియా కప్ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో టీమిండియా మూడు సార్లు ఢీ కొనే అవకాశముంది. ఈ మ్యాచ్‌లను వీక్షించడానికి అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం