Babar Azam on Ind vs Pak: ఆసియాకప్‌లో ఇండియాను పాక్ ఓడిస్తుందా.. బాబర్ ఆజం ఏం చెప్పాడంటే?
Babar Azam on Ind vs Pak: ఆసియాకప్‌లో ఇండియాను పాకిస్థాన్ ఓడిస్తుందా? ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఓ వెరైటీ సమాధానమిచ్చాడు.
ఇస్లామాబాద్: చాలా రోజులుగా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కోసం రెండు దేశాల ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వాళ్లంతా ఇప్పుడు ఆసియా కప్‌తో పండగ చేసుకోనున్నారు. ఎందుకంటే ఈ టోర్నీలో ఈ దాయాదుల ఒక్కసారి కాదు.. గరిష్ఠంగా మూడుసార్లు ఆడే అవకాశాలు ఉన్నాయి. అయితే వీటిలో షెడ్యూల్ ప్రకారమైతే ఈ నెల 28న తొలి మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత సూపర్ 4లో ఒకసారి, ఫైనల్లో మరోసారి ఇండోపాక్ వార్ ఉండే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
క్రికెట్‌కు కేరాఫ్ అయిన ఆసియా ఉపఖండంలో అసలుసిసలు ఛాంపియన్ ఎవరన్నది ఈ టోర్నీతోనే తెలుస్తుంది. దీంతో ఈ మెగా టోర్నీ గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తారు. అయితే ఇప్పుడీ టోర్నీకి ముందు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఇండియాతో మ్యాచ్‌పై స్పందించాడు. ఈ టోర్నీలో రెండు దేశాల మూడుసార్లు తలపడే అవకాశం ఉండటంతో ఇండియాను 3-0తో ఓడిస్తారా అని ఓ జర్నలిస్ట్ అడిగాడు.
దీనిపై బాబర్ స్పందిస్తూ.. "మాపై ఒత్తిడేమీ లేదు. మ్యాచ్‌ను మ్యాచ్‌గా ఆడటానికే ప్రయత్నిస్తాం" అని అనడం విశేషం. చివరిసారి ఇండియాతో గత టీ20 వరల్డ్‌కప్‌లో ఆడిన పాకిస్థాన్ 10 వికెట్లతో గెలిచింది. ఆ మ్యాచ్‌లో బాబర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇప్పుడూ అదే ధోరణితో ఆడతారా అని ప్రశ్నించగా.. "ఇండియాతో మ్యాచ్ అంటే ఒత్తిడి కొంత వేరుగానే ఉంటుంది. కానీ గత వరల్డ్‌కప్‌లో ఆ ఒత్తిడి మమ్మల్ని చిత్తు చేయకుండా ఎలా ఆడామో అదే ధోరణితో ఇప్పుడు ఆడతాం. మా సామర్థ్యాలపైనే దృష్టి సారిస్తాం. బాగా ఆడటం వరకూ మా చేతుల్లో ఉంది. గెలుపోటములు కాదు" అని బాబర్ అన్నాడు.
నాలుగేళ్ల కిందట చివరిసారి జరిగిన ఆసియా కప్‌లో రెండు ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లు జరగగా.. రెండింట్లోనూ ఇండియానే గెలిచింది. అప్పుడు పాకిస్థాన్ ఫైనల్ చేరి ఉంటే మూడు జరిగేవి. కానీ పాక్ ఫైనల్ చేరలేకపోయింది. బంగ్లాదేశ్‌పై ఫైనల్లో గెలిచిన ఇండియా విజేతగా నిలిచింది. ఈసారి ఆసియాకప్‌లో ఆరు టీమ్స్ రెండు గ్రూపులుగా విడిపోయి ఆడుతున్నాయి. ఇందులో నాలుగు సూపర్ 4 చేరతాయి. అందులో రెండు ఫైనల్‌కు వెళ్తాయి.