Sandeep Sharma on IPL Auction: కోహ్లిని అన్నిసార్లు ఔట్ చేసినా.. వేలంలో ఎందుకు తీసుకోలేదో: సందీప్ శర్మ
27 December 2022, 17:28 IST
Sandeep Sharma on IPL Auction: కోహ్లిని ఏడుసార్లు ఔట్ చేసినా పేస్ బౌలర్ సందీప్ శర్మను ఈ మధ్య జరిగిన మినీ వేలంలో ఎవరూ తీసుకోలేదు. ఇది తనను షాక్‌కు గురి చేసిందని అతడు చెప్పాడు.
పేస్ బౌలర్ సందీప్ శర్మ
Sandeep Sharma on IPL Auction: ప్రస్తుతం క్రికెట్‌లో విరాట్ కోహ్లి వికెట్ తీసిన బౌలర్ ఆనందానికి అవధులు ఉండవు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ వికెట్ తీయాలని ఏ బౌలర్ మాత్రం కోరుకోడు చెప్పండి. మరి ఐపీఎల్‌లో పేస్ బౌలర్ సందీప్ శర్మ.. విరాట్ వికెట్‌ను ఏకంగా ఏడుసార్లు తీశాడు. అయినా ఈసారి వేలంలో ఏ ఫ్రాంఛైజీ అతన్ని కరుణించలేదు.
కేవలం రూ.50 లక్షల బేస్‌ప్రైస్‌తోనే వేలంలోకి వచ్చినా.. ఎవరూ సందీప్‌పై ఆసక్తి చూపలేదు. గతంలో సందీప్.. పంజాబ్ కింగ్స్‌తోపాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్స్‌కు ఆడాడు. ఈసారి మినీ వేలంలో సామ్ కరన్ (రూ.18.5 కోట్లు), కామెరాన్ గ్రీన్ (రూ.17.5 కోట్లు), బెన్ స్టోక్స్ (రూ.16.25 కోట్లు)లాంటి ప్లేయర్స్‌ను రికార్డు ధరలకు ఫ్రాంఛైజీలు సొంతం చేసుకున్నా.. సందీప్‌లాంటి కొందరు ప్లేయర్స్‌కు నిరాశ తప్పలేదు.
అయితే తనను ఎవరూ తీసుకోకపోవడంపై సందీప్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో తాను దేశవాళీ క్రికెట్‌లోనూ రాణిస్తున్న విషయాన్ని గుర్తు చేశాడు. "ఇది నన్ను షాక్‌కు గురి చేసింది. చాలా అసంతృప్తిగా ఉంది. నన్ను ఎవరూ ఎందుకు కొనలేదో అర్థం కావడం లేదు. గతంలో నేను ఏ టీమ్‌కు ఆడినా బాగానే ఆడాను.
ఈసారి ఎవరో ఒకరు తీసుకుంటారని అనుకున్నాను. నిజాయతీగా చెప్పాలంటే ఇది మాత్రం ఊహించలేదు. ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కావడం లేదు. దేశవాళీ క్రికెట్‌లోనూ బాగానే ఆడుతున్నాను. రంజీ ట్రోఫీ చివరి రౌండ్‌లో ఏడు వికెట్లు తీసుకున్నాను. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ బాగానే రాణించాను" అని సందీప్ శర్మ అన్నాడు.
ఐపీఎల్‌లోనూ సందీప్ శర్మ రికార్డు బాగానే ఉంది. 104 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన సందీప్.. 114 వికెట్లు తీసుకున్నాడు. అతని ఎకానమీ రేటు కూడా 7.77గా ఉంది. టీ20ల్లో ఇది కాస్త మెరుగైన ఎకానమీ రేటే. అంతేకాదు ఐపీఎల్ సీజన్‌లో 12 కంటే ఎక్కువ వికెట్లు రెండుసార్లు (2014, 2020) తీసుకున్న ఏకైక బౌలర్‌గా సందీప్ పేరిట రికార్డు ఉంది. ఇక భువనేశ్వర్ కుమార్ తర్వాత పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా సందీపే.