Rohit Sharma Tweet on Shubman Gill: శుభ్‌మన్ గిల్‌పై రోహిత్ పాత ట్వీట్ వైరల్.. ఇంతకీ ఏమన్నాడు?
20 January 2023, 10:07 IST
- Rohit Sharma Tweet on Shubman Gill: శుభ్‌మన్ గిల్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన పాత ట్వీట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. న్యూజిలాండ్ పై తొలి వన్డేలో డబుల్ సెంచరీ తర్వాత ఇప్పుడంతా గిల్ నామస్మరణే జరుగుతున్న విషయం తెలుసు కదా.
గిల్, రోహిత్ శర్మ
Rohit Sharma Tweet on Shubman Gill: క్రికెట్ లో రికార్డులు ఉన్నవి బ్రేక్ చేయడానికే అని అంటారు. ఇది నిజమే. కానీ ఈ ఆధునిక టీ20 శకంలో మాత్రం ఆ రికార్డులు చాలా వేగంగా మరుగున పడిపోతున్నాయి. నెల రోజుల కిందట బంగ్లాదేశ్ పై ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలుసు కదా. అప్పుడు వన్డేల్లో అత్యంత పిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ గా ఇషాన్ నిలిచాడు.
అసలు వన్డేల్లో డబుల్ సెంచరీ అంటేనే చాలా అరుదు. అలాంటిది అతని కంటే తక్కువ వయసు ప్లేయర్ ఆ ఘనత సాధించడం అయ్యే పనేనా అనుకున్నారు. కానీ నెల తిరిగే లోపే శుభ్‌మన్ గిల్ ఆ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. అయితే వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డు మాత్రం ఇప్పటికీ ఇషాన్ పేరిటే ఉంది. టీమిండియా యువ ఆటగాళ్లను చూస్తుంటే ఇండియన్ క్రికెట్ భవిష్యత్తుపై భరోసా కలుగుతోంది.
నిజానికి గిల్ గురించి గతంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ ఇలాంటి ట్వీట్ ఒకటి చేశాడు. ఇప్పుడది వైరల్ అవుతోంది. 2020లో రోహిత్ 33వ బర్త్ డే సందర్భంగా ట్విటర్ లో అతనికి గిల్ విషెస్ చెప్పాడు. "పుల్ షాట్స్ ను రోహిత్ కంటే మంచిగా ఎవరూ ఆడలేరు. హ్యాపీ బర్త్ డే రోహిత్" అంటూ అప్పుడు గిల్ ట్వీట్ చేశాడు.
దానికి రోహిత్ రిప్లై ఇస్తూ.. "థ్యాంక్స్ ఫ్యూచర్" అని ట్వీట్ చేశాడు. మూడేళ్ల కిందటే గిల్ భవిష్యత్తులో ఎలాంటి అద్భుతాలు చేయబోతున్నాడో రోహిత్ ఊహించడం విశేషం. ఇప్పుడు రోహిత్ అంచనానే నిజం చేస్తూ.. గిల్ అతని డబుల్ సెంచరీ రికార్డును కూడా అందుకున్నాడు. వన్డేల్లో రోహిత్ మూడు డబుల్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.
2013లో ఆస్ట్రేలియాపై తొలి డబుల్ సెంచరీ చేయగా.. తర్వాత 2014, 2017లలోనూ మరో రెండు బాదాడు. ప్రపంచ క్రికెట్లో ఇలా మూడు డబుల్ సెంచరీలు చేసిన ప్లేయర్ మరొకరు లేరు. అయితే వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ గా రికార్డు నెలకొల్పిన గిల్ కు భవిష్యత్తులో అవకాశం రావచ్చు. కేవలం 23 ఏళ్ల వయసున్న గిల్ కు ఇంకా చాలా క్రికెట్ భవిష్యత్తు మిగిలి ఉంది. మరి అతడు ఈ రికార్డును కూడా గిల్ అందుకుంటాడేమో చూడాలి.