తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Sharma Record: సచిన్‌, అఫ్రిది రికార్డులు బ్రేక్‌ చేసిన రోహిత్‌ శర్మ

Rohit Sharma Record: సచిన్‌, అఫ్రిది రికార్డులు బ్రేక్‌ చేసిన రోహిత్‌ శర్మ

Hari Prasad S HT Telugu

06 September 2022, 21:36 IST

google News
    • Rohit Sharma Record: సచిన్‌ టెండూల్కర్‌, అఫ్రిది రికార్డులు బ్రేక్‌ చేశాడు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్‌ సూపర్‌ ఫోర్‌ మ్యాచ్‌లో ఈ రికార్డు అందుకున్నాడు.
రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (AP)

రోహిత్ శర్మ

Rohit Sharma Record: ఈ ఏడాది దారుణమైన ఫామ్‌లో ఉంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మొత్తానికి ఫామ్‌లోకి వచ్చాడు. శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్‌ సూపర్‌ ఫోర్‌ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో పదేళ్ల కిందటి సచిన్‌ టెండూల్కర్‌ రికార్డుతోపాటు పాక్‌ మాజీ బ్యాటర్ షాహిద్ అఫ్రిది రికార్డును కూడా బ్రేక్‌ చేశాడు. ఇప్పుడతడు ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్‌గా నిలిచాడు.

ఇన్నాళ్లూ 971 రన్స్‌తో సచిన్‌ టెండూల్కర్ టాప్‌లో ఉన్నాడు. అయితే రోహిత్‌ తన 30వ ఇన్నింగ్స్‌లో మాస్టర్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఇదొక్కటే కాదు.. అత్యధిక ఆసియా కప్‌ టోర్నీలు ఆడిన ఇండియన్‌ ప్లేయర్‌ కూడా రోహిత్‌ శర్మనే కావడం విశేషం. అతనికిది ఏడో ఆసియా కప్‌ టోర్నీ. 2008 నుంచి వరుసగా అన్ని ఆసియా కప్‌లలోనూ రోహిత్‌ ఆడాడు.

ఇప్పటి వరకూ అతడు ఈ మెగా టోర్నీల్లో ఒక సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు చేశాడు. సగటు 40కిపైనే ఉంది. ఇక 2018లో ఇండియాను కెప్టెన్‌గా విజేతగా నిలిపాడు. ఆ టోర్నీలో అప్పటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి లేకపోవడంతో రోహిత్‌ తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి టీమ్‌ను గెలిపించడం విశేషం.

ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ 41 బాల్స్ లో 72 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఒకప్పటి రోహిత్ ను చూసే అవకాశం అభిమానులకు దక్కింది. లంక బౌలర్లపై విరుచుకుపడుతూ.. స్కోరుబోర్డును ఉరకలెత్తించాడు.

ఇక ఇదే ఇన్నింగ్స్ తో మరో రికార్డును కూడా రోహిత్ శర్మ సొంతం చేసుకున్నాడు. ఆసియా కప్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా ఇన్నాళ్లూ పాక్ మాజీ షాహిద్ అఫ్రిది పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో 4 సిక్సర్లు బాదిన రోహిత్.. మొత్తంగా 31 ఆసియా కప్ మ్యాచ్ లలో 29 సిక్స్ లతో టాప్ లో ఉన్నాడు. అఫ్రిది 26 సిక్స్ లతో రెండోస్థానానికి పడిపోయాడు.

తదుపరి వ్యాసం