Rishabh Pant plastic surgery: రిషబ్ పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ సక్సెస్.. చికిత్సకు స్పందిస్తున్న క్రికెటర్
01 January 2023, 11:51 IST
- Rishabh Pant plastic surgery: రిషబ్ పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ సక్సెస్ అయింది. అతడు చికిత్సకు కూడా బాగానే స్పందిస్తున్నాడని డాక్టర్లు చెప్పారు. పంత్ గత శుక్రవారం(డిసెంబర్ 30) కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
ప్రమాదంలో పంత్ నుదుటిపై పదునైన గాయమైంది
Rishabh Pant plastic surgery: ఇండియన్ క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోరమైన కారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ గాయాలకు డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇందులో భాగంగా డాక్టర్లు అతనికి ప్లాస్టిక్ సర్జరీ కూడా నిర్వహించారు.
25 ఏళ్ల పంత్ చికిత్సకు కూడా బాగానే స్పందిస్తున్నట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ప్రమాదం కారణంగా పంత్ కనీసం ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన అతడు ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి, ఐపీఎల్‌కు దూరం అవుతాడు. ప్రమాదంలో నుదుటిపై పంత్‌కు పదునైన గాయం అయిన విషయం తెలిసిందే.
ఈ గాయానికే ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించినట్లు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఛీఫ్ శ్యామ్ శర్మ వెల్లడించారు. పంత్ ధైర్యంగానే ఉన్నాడని, చికిత్సకు కూడా బాగా స్పందిస్తున్నట్లు ఆయన చెప్పారు. పంత్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతోంది. అయితే అతని చికిత్స అక్కడే కొనసాగించాలా లేక మోకాలు దగ్గర అయిన తీవ్ర గాయం చికిత్స కోసం మరెక్కెడికైనా తీసుకెళ్లాలా అన్నదానిపై బీసీసీఐ మెడికల్ టీమ్ స్థానిక మ్యాక్స్ హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడుతున్నారు.
ఇక ఈ ప్రమాదం ఎలా జరిగిందో పంత్ తనకు వివరించినట్లు కూడా శ్యామ్ శర్మ తెలిపారు. ఆ సమయంలో అంతా చీకటిగా ఉందని, రోడ్డుపై ఉన్న గుంతను గమనించి తప్పించడానికి ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పంత్ తనతో చెప్పినట్లు వివరించారు.
ఇక పంత్ ఆరోగ్యం చాలా మెరుగుపడిందని అతని సన్నిహితులు కూడా వెల్లడించారు. పంత్ ప్రమాద వార్త తెలుసుకున్న అతని తల్లి సరోజ్ పంత్, సోదరి సాక్షి లండన్ నుంచి శనివారం ఉదయం హాస్పిటల్‌కు వచ్చారు. చికిత్స పొందుతున్న పంత్‌ను క్రికెటర్లతోపాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పరామర్శిస్తున్నారు.
టాపిక్